Tomato Salesman: ‘డబ్బులు ఊరికే ఎవరికీ రావు’.. ఈ ప్రకటన ఎంత ప్రాచుర్యం పొందిందో తెలియంది కాదు. అయితే ఇది ఒక్క తెలుగులోనే కాదు దక్షిణాది రాష్ట్రాల్లో.. ఆయా ప్రాంతీయ భాషల్లో స్వయంగా సదరు సంస్థ ఎండి చేసిన యాడ్ ఇది. ప్రొఫెషనల్స్ చేసిన యాడ్ మాదిరిగా ఎంతో ప్రాచుర్యం పొందింది. లలిత జ్యువెలర్స్ ఎండి కిరణ్ ఈ యాడ్ తో ఒక సెలబ్రిటీ గా మారారు. దేశంలో పేరు మోసిన సంస్థలు, పరిశ్రమల యజమానులకు దక్కని గుర్తింపు.. సొంతం చేసుకున్నారు కిరణ్. అయితే ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది పారిశ్రామికవేత్తలు సొంతంగానే ప్రకటనలు చేస్తున్నారు. యాడ్ లలో నటిస్తున్నారు. అయితే అక్కడితో ఆగలేదు. చివరకు వీధుల్లో తిరిగి కూరగాయల విక్రయించేవారు సైతం ఇదే ఫార్ములాను అనుసరిస్తున్నారు. మారుతున్న పోటీ ప్రపంచానికి తగ్గట్టు.. తమ వ్యాపార శైలిని మార్చుకుంటున్నారు.
Also Read: పాతికేళ్ల హ్యుందాయ్ గర్వాన్ని అణిచేసిన మహీంద్రా
శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో.. కొన్ని గ్రామాల్లో ఓ మోపెడ్ తో ఒక వ్యక్తి కూరగాయలు విక్రయిస్తుంటాడు. ఆయన రాకముందే.. గ్రామం వెలుపల ఉన్నప్పుడే ‘ పుల్ల టమాటా.. లేత వంకాయలు.. నాటు బీరకాయలు.. పచ్చని చిక్కుడుకాయలు.. తినాలంటే కొనాలి.. వండాలంటే అమ్మాలి’ అనే లౌడ్ స్పీకర్ శబ్దం వినిపిస్తుంటుంది. దీంతో ఇళ్లల్లో ఉండే మహిళలు ఒక్కసారిగా ఎగబాకుతారు. వీధుల్లోకి వచ్చి కూరగాయలను కొనుగోలు చేస్తుంటారు. ఇది ఒక్క ఈ వ్యాపారే కాదు.. గ్రామాల్లో సైతం ముందుగానే రికార్డ్ అయ్యే చిన్నపాటి లౌడ్ స్పీకర్లు అందుబాటులోకి వస్తున్నాయి. వాటితోనే తమ వ్యాపారాన్ని పూర్తి చేస్తున్నారు చిరు వ్యాపారులు. ఆ విధంగానే ఉద్దానం ప్రాంతంలో చిరు కూరగాయల వ్యాపారిగా గుర్తింపు పొందారు తోట లక్ష్మీనారాయణ.
వారపు సంతల్లో కూరగాయలు విక్రయించేవారు లక్ష్మీనారాయణ. అంతకుముందు పంజాబ్లో రోజువారి వేతన కార్మికుడిగా పనిచేసేవారు. అక్కడ నుంచి స్వగ్రామానికి వచ్చి కూరగాయల వ్యాపారిగా మారారు. అయితే పోటీని తట్టుకొని విక్రయాలు పెంచుకోవాలంటే.. ఏదో ప్రత్యేకత చూపాలని భావించారు. అలా ఆలోచన చేసిందే ‘ పుల్ల టమాట’ మాట. ఇప్పుడు ఉద్దానం ప్రాంతంలో ఎక్కడ చూసినా ఈ పుల్ల టమాట మాటే. అంతలా పాపులర్ అయ్యారు తోట లక్ష్మీనారాయణ.