Anantapur Maoist: మన్యం జిల్లాలో మినహా ఆంధ్రప్రదేశ్లోని మిగతా ప్రాంతాలలో మావోయిస్టుల కార్యకలాపాలు దాదాపుగా శూన్యం. ఆదివాసుల్లో కూడా చైతన్యం పెరగడంతో వారు మావోయిస్టు కార్యకలాపాలకు అంతగా ఆకర్షితులు కావడం లేదు. దీంతో మావోయిస్టుల దళాలకు తెలంగాణ ప్రాంతాన్ని చెందిన వారి నాయకత్వం వహిస్తున్నారు. ఆంధ్ర – ఒడిశా, ఆంధ్ర – చత్తీస్ గడ్ సరిహద్దు ప్రాంతాలలోని దళాలకు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే నాయకత్వం వహిస్తున్నారు.
కొన్ని సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుండి మావోయిస్టుల డంప్ దొరకడం కలకలం రేపుతోంది. ఒకప్పుడు అన్నలకు పెట్టని కోట లాగా ఉన్న అనంతపురం జిల్లాలో మావోయిస్టుల డంప్ దొరకడం పోలీసు వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. అనంతపురం జిల్లాలోని ఆత్మకూరు మండలం వేపచెర్ల ప్రాంతంలో మా పోస్టులు భారీగా నిల్వచేసిన ఆయుధాలు, ఇతర మందు గుండు సామగ్రి దొరకడం సంచలనం కలిగిస్తోంది. ఈ డంప్ లో డిటోనేటర్లు, తుపాకీ బుల్లెట్లు, ఐరన్ బాల్స్ ఉన్నాయి. అయితే చాలా సంవత్సరాల క్రితమే ఈ ఆయుధాలను తయారు చేశారని.. అప్పట్లో తమ కార్యకలాపాలు విస్తృతంగా సాగుతున్న సమయంలో మావోయిస్టులు ఈ ప్రాంతంలో డంప్ చేశారని తెలుస్తోంది.
Also Read: ఏపీలో కొత్త జిల్లాలు.. నియోజకవర్గాల వారీగా.. జాబితా సిద్ధం!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కుమ్మటి చిత్తూరు జిల్లా అలిపిరి ప్రాంతంలో మావోయిస్టులు పేల్చిన మందు గుండు సామగ్రి ధాటికి చంద్రబాబు తీవ్రంగా గాయపడ్డారు. అప్పట్లో ఈ అలిపిరి బాంబు బ్లాస్ట్ ను మావోయిస్టు పార్టీకి చెందిన కొంతమంది కీలక వ్యక్తులు నిర్వహించినట్టు తెలుస్తోంది. అయితే అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టుల కార్యకలాపాలు జోరుగా సాగుతూ ఉండేవి. ఉమ్మడి అనంతపురం జిల్లాలోనూ అన్నల అలికిడి వినిపించేది. నాడు అలిపిరి బాంబు బ్లాస్ట్ లో మావోయిస్టులు అధునాతనమైన ఆయుధాలను వాడారు. ఐరన్ బాల్స్ ఉపయోగించారు. డిటోనేటర్లను దీనికోసం వినియోగించారు. వేపచెర్ల ప్రాంతంలో డిటోనేటర్లు, ఐరన్ బాల్స్, తుపాకీ బుల్లెట్లు కనిపించిన నేపథ్యంలో.. నాటి అలిపిరి ఘటనకు.. ఇక్కడ మావోయిస్టులు చేసిన డంప్ కు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో ఉమ్మడి అనంతపురం జిల్లా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.