RK Kotha Paluku: ప్రతి ఆదివారం ఆంధ్రజ్యోతి పత్రికలో కొత్త పలుకు పేరుతో సంపాదకీయాలు రాస్తుంటారు ఆ పత్రిక ఎండి వేమూరి రాధాకృష్ణ. ఆయన సీనియర్ జర్నలిస్ట్. పైగా రాజకీయ పార్టీలతో ఆయనకు దగ్గర సంబంధాలు ఉంటాయి. రాజకీయాలంటే కూడా ఆయన చాలా ఇష్టం. అందువల్లే తన కొత్త పలుకు సంపాదకీయంలో ఎక్కువగా రాజకీయ వార్తలు ఉండే విధంగా చూసుకుంటారు. లోతైన విషయాలపై విశ్లేషణ చేస్తూ ఉంటారు.
తాజా కొత్త పలుకులో వేమూరి రాధాకృష్ణ తన ట్రేడ్ మార్క్ రాజకీయాలను వదిలేశారు. ఆర్థిక పాఠాలను చెప్పడం మొదలుపెట్టారు. ఇందులో కొన్ని అంశాలు మాత్రం చెప్పుకోదగ్గవిగా.. ఆచరించే దగ్గవిగా ఉన్నాయి. ముఖ్యంగా భారతీయులు మర్చిపోయిన పొదుపు పాఠాలు.. రాజకీయ పార్టీల సంక్షేమ పథకాలు.. వాటి వల్ల ప్రజలు సోమరిపోతులుగా మారిన తీరు.. అనవసరమైన ఖర్చులు.. ప్రతి అంశాన్ని రాధాకృష్ణ లోతుగానే విశ్లేషించారు. వాస్తవానికి ఈ తరహాలో ఆయన రాస్తారని.. పొలిటికల్ ట్రేడ్ మార్క్ పక్కనపెట్టి ఎకనామికల్ లెక్చర్లు దంచుతారని ఎవరూ ఊహించలేదు.
నరేంద్ర మోడీని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ఇప్పటికైనా దేశం పొదుపు పాఠాలు నేర్వాలని రాధాకృష్ణ పేర్కొన్నారు.. “తోటోడు తొడ కోసుకుంటే.. మనం మెడ కోసుకుంటున్నాం. ఆడంబరాలు పెరిగిపోయాయి. ఖర్చులు ఎక్కువైపోయాయి. పొదుపు అనేది పక్కకు వెళ్లిపోయింది. వ్యక్తిగత అవసరాలకు మించి ఖర్చు విపరీతంగా పెడుతున్నారు. దీనివల్ల పొదుపు లేకుండా పోతోంది. అందువల్ల భారతీయుల వ్యవహార శైలి పూర్తిగా మారిపోతుంది. ఫలితంగానే ఈ ఇబ్బందులు. సాధ్యమైనంతవరకు ఇటువంటి పరిణామాలు భారతీయులను మార్చే అవకాశం ఉందని” రాధాకృష్ణ అభిప్రాయపడ్డారు.
రాధాకృష్ణ చెప్పింది ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. పొదుపు గురించి వీర లెవెల్ లో లెక్చర్లు దంచినప్పటికీ.. ఆయన తన పత్రికను అమ్ముకోవడంలో కార్ రేస్ వంటి కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహించినట్టు.. సంవత్సర చందా కడితే బహుమతులు ఎందుకు ఇచ్చినట్టు.. రాధాకృష్ణ మాదిరిగానే మిగతా కంపెనీలు కూడా తమ ఉత్పత్తులు అమ్ముకోవడానికి వినియోగదారులను ఆకట్టుకుంటాయి. రకరకాల స్కీములు అమలు చేస్తుంటాయి. ఎవరూ ఒకే విధంగా బతకాలి అనుకోరు. లగ్జరీని ఆస్వాదించాలని భావిస్తుంటారు. ఇందులో తప్ప పట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆ లగ్జరీ అనేది వ్యసనంగా మారిపోతేనే ఇబ్బంది. బహుశా భారతీయులు ఇంకా ఆ స్థాయికి రాలేదు. రాధాకృష్ణ చెప్పింది ఒక యాంగిల్ లో బాగానే ఉంది కానీ.. లోతుగా వెళ్తేనే ఇబ్బందిగా ఉంది.. ప్రఖ్యాత కంపెనీలు భారతదేశంలో సంస్థలు ఏర్పాటు చేస్తున్నాయి. ఎందుకంటే బెల్లం ఎక్కడ ఉంటే అక్కడే చీమలు ఉంటాయి. భారతదేశం అతిపెద్ద వినియోగదారులు ఉన్న మార్కెట్ కాబట్టి.. ప్రపంచ స్థాయి కంపెనీలు వస్తుంటాయి.
ఇటీవల ఏపీ రాష్ట్రానికి గూగుల్ వచ్చింది.. రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చింది.. అంతకుముందు కియా వచ్చింది. వాటన్నిటిని గొప్పగా చెప్పిన రాధాకృష్ణ.. ఇప్పుడు తప్పు పట్టడమేంటి.. పెద్ద పెద్ద సంస్థలు ఎందుకు ఏర్పాటు అవుతున్నాయి.. ఎందుకు ఈ లగ్జరీ అని అనడం ఏంటి.. ఏదైనా ఒకే కోణంలో ఉండాలి.. అవసరం ఉన్నప్పుడు ఒక విధంగా.. అవసరం లేనప్పుడు మరొక విధంగా మాట్లాడితేనే ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడే వ్యక్తుల మీద గౌరవం పోతుంది. పాపం రాధాకృష్ణ ఎలాంటి రాతలు రాసేవాడు.. చివరికి ఇప్పుడు ఇలా అయిపోయాడు..