Vangaveeti Ranga successors: ప్రముఖుల కుటుంబాలు ఐక్యతగా ఉంటేనే చూడాలని అనిపిస్తుంది. ఎవరికి వారు గా ఉంటే ఆ కుటుంబం ఇతరుల వద్ద చులకన కావడం ఖాయం. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం వారి పిల్లలు వేరువేరుగా ఉంటున్నారు. రాజకీయ శత్రువులుగా మారారు. తెలంగాణ రాజకీయాల్లో కూడా అటువంటి పరిస్థితి. సోదరుడు కేటీఆర్ ను విభేదించి బయటకు వచ్చేసారు కవిత. రాజకీయాల్లో ఎన్ని రకాల పరిణామాలు నడుస్తున్న ఈ తరుణంలో.. వంగవీటి వారసులు కూడా అదే రకమైన తప్పటడుగులు వేస్తున్నారు. ఈరోజు వంగవీటి మోహన్ రంగా వర్ధంతి. కానీ పిల్లలిద్దరూ వేర్వేరు మార్గాల్లో వెళ్తున్నారు. రంగా రాధా మిత్రమండలి ద్వారా ముందుకు సాగుతున్నారు కుమార్తె ఆశా కిరణ్. తెలుగుదేశం పార్టీలో ఉన్న కుమారుడు రాధాకృష్ణ రూట్ మరోలా ఉంది.
రంగా రాధా మిత్రమండలి ద్వారా..
రంగా రాధా మిత్రమండలి ప్రారంభంలో చాలా యాక్టివ్ గా ఉండేది. మోహన్ రంగా మరణం సమయంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిగేవి. క్రమేపి ఆ యాక్టివిటీస్ తగ్గాయి. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రంగా పేరు ప్రముఖంగా వినిపించేది. అయితే ఇప్పుడు అదే రంగా రాధా మిత్రమండలిని క్రియాశీలకం చేస్తున్నారు ఆశా కిరణ్. మరోవైపు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు రాధాకృష్ణ. అయితే ఆశాకిరణ్ సైతం త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని ప్రచారం నడుస్తోంది. అయితే వీరిద్దరూ తమ రాజకీయ గమ్యాలపై స్పష్టత ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇద్దరి విషయంలో జరుగుతున్న ప్రచారం వేరేలా ఉంది. కొంత కన్ఫ్యూజన్ కూడా కనిపిస్తోంది.
స్పష్టత ఇవ్వడం ప్రధానం..
వంగవీటి మోహన్ రంగా వారసులుగా.. తమ నిర్ణయాలను అభిమానులతో పంచుకోవడం ఇప్పుడు ముఖ్యం. ఎందుకంటే వేరువేరు రాజకీయ మార్గాల్లో వెళితే ఆ కుటుంబానికే ఇబ్బంది కరం. అనుకున్నది సాధించలేరు కూడా. పైగా కుటుంబంలోనే ఐక్యత లేదు. ఇంకేం చేస్తారులే అని అభిమానులు కూడా విభజనకు గురయ్యే అవకాశముంది. అందుకే వారి రాజకీయ ఆజెండా, వెళ్లే మార్గాల గురించి క్లారిటీ ఇస్తే బాగుంటుంది. పైగా ఇద్దరూ వేరువేరుగా తమ తండ్రి కార్యక్రమాలను నిర్వహించడం అనేది తప్పుడు సంకేతం. ఆదిలోనే అది ఇబ్బందికర పరిస్థితులకు దారి తీసే అవకాశం ఉంది. ఈరోజు రంగా రాధా మిత్రమండలి ఆధ్వర్యంలో విశాఖ రంగా సేన భారీ బహిరంగ సభ జరగనుంది. ఆశా కిరణ్ లీడ్ తీసుకున్నారు. అయితే వంగవీటి రాధాకృష్ణ వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం విశేషం. ఇలా ముందుకు సాగితే మాత్రం రంగా వారసులకు లాభం కంటే నష్టమే అధికం.