Vangaveeti Asha Kiran: ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh) రాజకీయాల్లో వంగవీటి కుటుంబానికి ప్రత్యేక స్థానం. అటువంటి కుటుంబంలో ఏ చిన్న పరిణామం జరిగినా అది సంచలనమే. అయితే సంచలనాలకు ఆ కుటుంబం వేదిక అయింది తప్ప.. ఆశించిన స్థాయిలో రాజకీయ లబ్ధి పొందలేకపోయింది.. వంగవీటి మోహన్ రంగ మరణానంతరం ఆ కుటుంబం పేరు రాజకీయాల్లో వినిపిస్తూ వస్తోంది. కానీ వారి కుటుంబాలకు రాజకీయం ఎంత మాత్రం లబ్ధి చేకూర్చలేదు. కుమారుడు రాధాకృష్ణ రాజకీయాల్లోకి వచ్చినా అనాలోచిత నిర్ణయాల వల్ల సరైన పదవి దక్కించుకోలేకపోయారు. యాక్టివ్ పాలిటిక్స్, పవర్ పాలిటిక్స్ కు దూరంగా ఉండిపోతున్నారు. అయితే ఇప్పుడు వంగవీటి మోహన్ రంగా కుమార్తె ఆశా కిరణ్ రాజకీయాల్లోకి వస్తారని తెలుస్తుండడం సంచలనమే. అయితే ఆమె ఏ పార్టీలో చేరుతారు అన్నది ఇప్పటికీ సస్పెన్షన్ గానే ఉంది. అయితే తాజాగా ఆమె జగన్మోహన్ రెడ్డితో భేటీ కానున్నారని ప్రచారం అయితే మాత్రం జరుగుతోంది. తద్వారా వైసిపిలో చేరుతారా అనే ప్రచారం కూడా ఊపందుకుంటోంది.
వైసీపీకే లాభం..
ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆ పార్టీలోకి వంగవీటి వారసురాలు వచ్చి చేరుతామంటే తప్పకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇది మంచి పరిణామమే. కానీ వంగవీటి కుమార్తెకు మాత్రం ఇది సాహసమే అవుతుంది. ఎందుకంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోయింది. ఆపై కూటమి పార్టీలు బలంగా ఉన్నాయి. సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. పైగా అదే టిడిపిలో తన సోదరుడు వంగవీటి రాధాకృష్ణ ఉన్నారు. ఈ ప్రతికూల పరిస్థితుల నడుమ ఆశాకిరణ్ వైసీపీలో చేరితే ఆ పార్టీకే లాభం. అయితే ఆమె సాహసించి పోరాటం చేసి వైసీపీని అధికారంలోకి తెస్తే మాత్రం.. ఆమెకు సముచిత స్థానం దక్కేది.
కాపు సామాజిక వర్గం అండ..
ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కాపు సామాజిక వర్గం( Kapu community) అండ అవసరం. అందులో భాగంగానే వంగవీటి కుమార్తెను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి తేవాలన్నది వ్యూహంగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే వైసీపీలో చేరి మూల్యం చెల్లించుకున్నారు ముద్రగడ పద్మనాభం. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ముద్రగడ తెరపైకి వచ్చారు. కాపు రిజర్వేషన్ ఉద్యమంతో నాటి టిడిపి ప్రభుత్వం పై వ్యతిరేకత పెంచేలా చేశారు. దాని ఫలితమే కాపులు 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవడం. మొన్నటి ఎన్నికల్లో మాత్రం కాపులు పూర్తిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. ముద్రగడ పద్మనాభం బయట ఉన్నప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మేలు చేయగలిగారు. ఆ పార్టీకి దగ్గర అయినప్పుడు మాత్రం కాపులను దగ్గర చేయలేకపోయారు.
అలా చేస్తేనే భవిష్యత్తు..
ముద్రగడ చేయలేనిది.. వంగవీటి కుమార్తె చేసి చూపిస్తేనే ఆమెకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. అయితే కేవలం కాపులను ఆకర్షించాలన్న ఉద్దేశంతోనే ఆశాకిరణ్ వైపు మొగ్గు చూపుతున్నారు జగన్. గతంలోనూ ఇదే జగన్ తన సోదరుడు వంగవీటి రాధాకృష్ణను పిలిచి ఎలా అవమానించారో ఆమె గుర్తించుకోవాలి. తప్పకుండా కాపుల మద్దతు కోసం ఆశాకిరణ్ ను అడ్డం పెట్టుకుంటారన్నది బహిరంగ రహస్యం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కాపులు నమ్ముతారా లేదా అన్నది కూడా అనుమానమే. ఇవన్నీ బేరీజు వేసుకొని ఆమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని వంగవీటి అభిమానులు సూచిస్తున్నారు. మరి ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.