Vangaveeti Radha Krishna: ప్రస్తుత రాజకీయాలు ట్రెండ్ మారాయి. ఎందుకంటే ఇప్పుడు అవసరాలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఫలానా నాయకుడు ఫలానా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తున్నాడనే మాట లేదు. అప్పటికప్పుడు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి నేటి రాజకీయాల్లో ఏర్పడింది. అటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు వంగవీటి రాధాకృష్ణ( vangaveeti Radha Krishna ). ప్రత్యేక పరిస్థితుల్లోనే తెలుగుదేశం పార్టీలో చేరారు. అదే పార్టీలో కొనసాగుతున్నారు. అయితే ఇంతవరకు ఆయనకు కూటమిలో పదవి దక్కకపోవడంతో రకరకాల ప్రచారం నడుస్తోంది. వంగవీటి ఫ్యామిలీ విషయంలో చంద్రబాబుకు భిన్న వైఖరి ఉండడం వల్లే నిర్ణయం తీసుకోలేదని పొలిటికల్ వర్గాల్లో టాక్ ఉంది. కానీ ఇప్పుడు వంగవీటి రాధాకృష్ణ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి చంద్రబాబుది.
Also Read: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాజీ ప్రేయసి.. రీ యూనియన్ అదిరిపోయింది..
* అప్పట్లో అనేక అనుమానాలు..
వంగవీటి మోహన్ రంగా( Mohan Ranga) మరణం చుట్టూ అనేక రకాల ఆరోపణలు వచ్చాయి. కులం కోణంలో.. పార్టీ కోణంలో తెలుగుదేశం పార్టీ చుట్టూ అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే కాంగ్రెస్ సైతం ఈ విషయంలో ఆ కుటుంబానికి న్యాయం చేయలేకపోయింది. చివరకు వంగవీటి మోహన్ రంగా కుమారుడు రాధాకృష్ణ అదే తెలుగుదేశం పార్టీలో చేరాల్సి వచ్చింది. తెలుగుదేశం పార్టీలో ఉండి రంగా హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవినేని ఫ్యామిలీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. అయితే రాజకీయాల్లో ఇటువంటి భిన్న వైఖరి కొనసాగుతున్న క్రమంలో.. వంగవీటి రాధాకృష్ణ విషయంలో చంద్రబాబు ప్రత్యేక ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. పార్టీ కష్టకాలంలో ఉండగా వచ్చి ప్రచారం చేయడంతో పాటు ఐదేళ్లపాటు పార్టీలో కొనసాగుతూ వచ్చారు రాధాకృష్ణ. అందుకే ఆయనకు ఏదో ఒక అవకాశం ఇవ్వాలని చంద్రబాబుతో పాటు లోకేష్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
* చిన్న వయసులో అసెంబ్లీకి..
వంగవీటి మోహన్ రంగా హత్య సమయంలో రాధాకృష్ణ ది చిన్న వయసు. అయితే 2003లో రాజశేఖర్ రెడ్డి ( Y S Rajasekhara Reddy )పాదయాత్ర సమయంలో యువకుడిగా ఉన్న రాధాకృష్ణను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో గెలిచిన రాధాకృష్ణ చిన్న వయసులోనే అసెంబ్లీలో అడుగు పెట్టారు. అటు తరువాత రాధాకృష్ణ రాజకీయ అపసవ్య నిర్ణయాలు తీసుకున్నారు. దాని ప్రతికూలతలు ఎదుర్కొన్నారు. ప్రజారాజ్యం పార్టీ తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. 2009, 2014లో పోటీ చేసి ఓడిపోయారు. 2019, 2024 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కలేదు. అయితే వంగవీటి రాధాకృష్ణ కు ఛాన్స్ ఇవ్వాలని చంద్రబాబుతో పాటు లోకేష్ నిర్ణయం తీసుకున్నారట. ఎమ్మెల్సీ ఇవ్వడమే కాకుండా మంత్రివర్గంలోకి తీసుకోవాలని భావిస్తున్నారట. త్వరలో ఖాళీ కాబోయే ఎమ్మెల్సీ పోస్టులో ఒకటి రాధాకృష్ణకు ఇవ్వడం ఖాయంగా తెలుస్తోంది. విస్తరణలో క్యాబినెట్ లో కూడా ఛాన్స్ ఇస్తారని సమాచారం.