Vangaveeti Asha Kiran: వంగవీటి కుటుంబంలో పొలిటికల్ ఎంట్రీ ఇస్తానని చెబుతున్నారు ఆశ కిరణ్. ఆమె మోహన్ రంగా కుమార్తె. ఇప్పటికే కుమారుడు రాధాకృష్ణ రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు కుమార్తె సైతం యాక్టివ్ కావాలని చూస్తున్నారు. ముందుగా రంగ రాధా మిత్రమండలి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని చూస్తున్నారు. తద్వారా తన బలం, కాపు సామాజిక వర్గంలో ఎంత ప్రభావం చూపడం వంటివి అంచనా వేసుకుని ఏదో ఒక పార్టీలో చేరాలన్నది ఆమె లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రస్తుతం సోదరుడు రాధాకృష్ణ టిడిపిలో ఉన్నారు. అయితే ఆయనను అనుసరించకుండా తన సొంత అజెండాతో ఆశాకిరణ్ ముందుకు వెళుతున్నట్లు అర్థమవుతోంది. అయితే ఒకవైపు కాపు సామాజిక వర్గం ద్వారా వెళ్లాలా? లేకుంటే ఆ ముద్ర లేకుండా వెళ్లాలా? అనేది ఆమెకు తెలియక పోతోంది. అయితే కాపు సామాజిక వర్గ ప్రభావం ఆమెపై ఉంది. ఎందుకంటే కాపు సేన తో సంచలనం సృష్టించారు వంగవీటి మోహన్ రంగ. తప్పకుండా ఆ ప్రభావం ఇప్పుడు ఆశాకిరణ్ పై ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గాన్ని అజెండాగా తీసుకెళ్లడమే ఉత్తమమని ఆమె ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
తూర్పుగోదావరి నుంచి..
కోస్తాంధ్రలో కాపు సామాజిక వర్గం అధికం. ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో సైతం కాపు సామాజిక వర్గం ప్రజలు ఉన్నారు. కృష్ణ గుంటూరులో సైతం ప్రభావం చూపుతున్నారు. ప్రకాశం జిల్లాలో సైతం రాజకీయ ప్రభావం ఎక్కువ కాపు సామాజిక వర్గం నుంచి. అయితే ఈ నెల 26న వంగవీటి మోహన్రంగా వర్ధంతి. ఆ రోజు నుంచి ప్రజల్లోకి రావాలని భావిస్తున్నారు ఆశాకిరణ్. అయితే ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో ఏదో ఒక ప్రాంతం నుంచి పర్యటనలను మొదలు పెట్టాలని ఆమె భావిస్తున్నారట. అలా కొద్ది రోజులపాటు పర్యటనలు చేసి పరిస్థితిని గమనిస్తారట. ఎన్నికలకు ముంగిట ఒక నిర్ణయానికి వస్తారట. ఇప్పుడు ఆశాకిరణ్ విషయంలో ఇదే ప్రచారం నడుస్తోంది.
ఆరాటపడుతున్న వైసిపి..
వంగవీటి మోహన్ రంగ వారసురాలిగా ఆశాకిరణ్ పార్టీల్లో చేర్చుకోవాలని అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తాయి. అయితే ఇప్పుడు ఆమె అవసరం ఎక్కువగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం పూర్తిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరమైంది. పవన్ కళ్యాణ్ ద్వారా కూటమికి అండగా నిలిచింది ఆ సామాజిక వర్గం. ఐదేళ్ల వైసిపి పాలనలో కాపులకు అన్యాయం జరిగిందన్నది ఆ సామాజిక వర్గంలో ఉన్న ఆగ్రహం. తద్వారా అది పవన్ కళ్యాణ్ కు కలిసి వచ్చింది. ఆయన ద్వారా కూటమికి టర్న్ అయింది. అయితే ప్రస్తుతం కూటమి వద్ద ఉన్న కాపు సామాజిక వర్గ బలం చేజిక్కించుకోవాలంటే బలమైన నేతలు అవసరం. ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న.. కాపు రిజర్వేషన్ ఉద్యమంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇబ్బందికరంగా మారాయి. పవన్ కళ్యాణ్ విషయంలో ముద్రగడ స్టాండ్ కాపుల్లో ఆగ్రహానికి కారణం అయింది. అందుకే ఇప్పుడు వంగవీటి మోహన్ రంగ వారసురాలిగా ఆశాకిరణ్ ను తిప్పుకుంటే కాపులు టర్న్ అవుతారన్నది వైసిపి అంచనా. అయితే ఇప్పటికే మోహన్ రంగా కుమారుడు రాధాకృష్ణ రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. తప్పకుండా ఆ ప్రభావం ఆశాకిరణ్ పై ఉంటుంది. తన సోదరుడు పరిస్థితికి రాకుండా ఆమె 2029 ఎన్నికలకు ముందున్న పరిస్థితిని గమనించి రాజకీయ అడుగులు వేస్తారని తెలుస్తోంది.