Vallabhaneni Vamsi Mohan: వల్లభనేని వంశీ మోహన్( vallabhanani Vamsi Mohan) … పరిచయం అక్కర్లేని పేరు ఇది.. కేవలం రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన వంశీ ఏపీ రాజకీయాల్లో ప్రముఖంగా నిలిచారు. దానికి కారణం ఆయన తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే. అందుకే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గన్నవరం నియోజకవర్గ పేరు కూడా మార్మోగేది. అయితే చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై నిత్యం విమర్శలు చేస్తూ వచ్చేవారు వల్లభనేని వంశీ మోహన్. అందుకే కూటమి వచ్చిన తర్వాత టార్గెట్ అయ్యారు. ఏకంగా నెలల తరబడి రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు జైల్లో. ఈ క్రమంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. గన్నవరం నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీ మోహన్ కు కీలక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీపై గట్టిగానే ఆయన చెప్పినట్లు సమాచారం.
Also Read: గేట్ ఔట్..రేపటినుంచి మీరు రావొద్దు..రోడ్డున పడ్డ 40 మంది జర్నలిస్టులు
* టిడిపి ద్వారా ఎంట్రీ..
తెలుగుదేశం ( Telugu Desam) పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు వల్లభనేని వంశీ మోహన్. 2009లో విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి లగడపాటి రాజగోపాల్ చేతిలో ఓడిపోయారు. అయితే 2014 విషయానికి వస్తే సీన్ మారింది. జూనియర్ ఎన్టీఆర్ సిఫారసులతో గన్నవరం టిడిపి టికెట్ దక్కించుకున్నారట వల్లభనేని వంశీ మోహన్. ఆ ఎన్నికల్లో గెలిచి టిడిపి అధికారంలోకి రావడంతో ఐదేళ్లపాటు అణిగిమనిగి ఉండేవారు. 2019లో జగన్ ప్రభంజనంలో సైతం టిడిపి అభ్యర్థిగా రెండోసారి పోటీ చేసి గెలిచారు గన్నవరం నుంచి. అయితే కొద్దికాలం పాటు పార్టీలో కొనసాగినా ఆయన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఫిరాయించారు. అప్పటినుంచి చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ వచ్చారు. 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.
* గన్నవరంలో నిలిచిన కార్యకలాపాలు.. గన్నవరం( Gannavaram) నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ మోహన్ అనారోగ్యానికి గురవుతూ దూరంగా ఉన్నారు. ఇప్పుడు పరామర్శల పేరుతో పర్యటనలు చేస్తున్నారు. అయితే ఆశించిన స్థాయిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ మైలేజ్ రావడం లేదు. అందుకే అక్కడ ప్రత్యామ్నాయనేతకు అవకాశం ఇవ్వాలని జగన్ స్ట్రాంగ్ గా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అయితే వల్లభనేని వంశీ మోహన్ సైతం విముఖంగా ఉన్నారు రాజకీయాల పట్ల. త్వరలో ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరమవుతారన్న ప్రచారం కూడా ఉంది. అదే సమయంలో ఆయన భార్యను గన్నవరం నుంచి పోటీ చేయిస్తారని కూడా టాక్ నడిచింది.. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనసు మార్చుకున్నట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం అయితే జరుగుతోంది.
* విజయవాడ నుంచి బరిలో దిగాలని..
వల్లభనేని వంశీ మోహన్ ను విజయవాడ( Vijayawada) ఎంపీగా పోటీ చేయించాలని జగన్ ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి విజయవాడ ఎంపీ సీటు అనేది ఆ పార్టీకి లోటు. మూడుసార్లు ప్రయోగాలు చేసింది గాని ఆ పార్టీ గెలవలేకపోయింది ఈ స్థానంలో. చివరకు సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేసినేని నాని తీసుకొచ్చి వైసిపి అభ్యర్థిగా పోటీ చేయించినా ఫలితం లేకపోయింది. అందుకే ఈసారి వల్లభనేని వంశీ మోహన్ ను ప్రయోగిస్తారని తెలుస్తోంది. అయితే అందుకు వల్లభనేని వంశీ మోహన్ విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. చేస్తే విజయవాడ ఎంపీగా చెయ్.. లేకుంటే అంతేనని జగన్మోహన్ రెడ్డి గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల క్రమంలో వల్లభనేని వంశీ మోహన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.