Vahana Mitra Scheme: ఏపీలో( Andhra Pradesh) మరో కొత్త పథకం సందడి ప్రారంభం అయ్యింది. నేటి నుంచి వాహన మిత్ర పథకానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. మూడు రోజులపాటు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏపీలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి సంబంధించి స్త్రీ శక్తి పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఐదు రకాల ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. దీంతో ప్రైవేట్ వాహనాల్లో మహిళల రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా ఆటో డ్రైవర్లకు ఉపాధి కష్టమవుతోంది. కనీసం వారు టాక్స్ లు కట్టుకునేందుకు సైతం ఇబ్బంది పడుతున్నారు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం వాహన మిత్ర పథకం కింద ఒక్కో ఆటో డ్రైవర్ కు 15 వేల రూపాయలు అందించేందుకు నిర్ణయించింది. దసరా కానుకగా అక్టోబర్ 1న బ్యాంక్ ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేయనుంది. అందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈరోజు ప్రారంభం అయింది. మూడు రోజులపాటు కొనసాగనుంది. ఇందుకు సంబంధించి దరఖాస్తులు సైతం అందుబాటులోకి వచ్చాయి. ఈరోజు 10 గంటల నుంచి గ్రామ/ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు.
* దరఖాస్తుదారుని పేరు, తండ్రి పేరు, ఆధార్ నంబర్, మొబైల్ నెంబర్, కులము/ ఉప కులం ధ్రువీకరణ పత్రం నంబరు అందించాల్సి ఉంటుంది.
* బ్యాంక్ అకౌంట్ నెంబర్, IFSC code, బ్రాంచ్ పేరు సమగ్రంగా రాయాల్సి ఉంటుంది.
* ఆదాయ ధ్రువీకరణ పత్రం, చిరునామా తప్పనిసరి.
* వాహన రకం, ఆటో/ ట్యాక్సీ / మ్యాక్సీ క్యాబ్, వాహన గుర్తింపు సంఖ్య, చెల్లుబాటు అయ్యే తేదీ, డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్, జారీ చేసిన తేదీ, కార్యాలయం వంటి వివరాలు దరఖాస్తులు పొందుపరచాలి.
* అయితే ఇలా దరఖాస్తులు పేర్కొన్న వివరాలు, ధ్రువీకరణ పత్రాలు వాస్తవం అని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
* ఒకవేళ వివరాలు తప్పు అని తేలితే మాత్రం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
* ఈనెల 22 లోపు వెరిఫికేషన్లు పూర్తి చేస్తారు. 24 నాటికి తుది జాబితాను సిద్ధం చేస్తారు. అదే రోజు కార్పొరేషన్ల వారీగా లబ్ధిదారుల జాబితాను జిఎస్డబ్ల్యూఎస్ విభాగం రవాణా శాఖకు పంపుతుంది.
* అక్టోబర్ 1న దసరా కానుకగా ఒక్కో ఆటో డ్రైవర్ ఖాతాలో 15వేల రూపాయలు జమ కానుంది.
* ఇవి తప్పనిసరి..
ఆటో డ్రైవర్లకు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వాహన రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్ వంటివి తప్పనిసరిగా ఉండాలి. దరఖాస్తుదారులకు ఏపీలో జారీచేసిన డ్రైవింగ్ లైసెన్స్ మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. లైసెన్స్ ఆటో లేదా మోటార్ వాహనం నడపడానికి చెల్లు బాటు అయ్యేదిగా ఉండాలి. వాహనం కూడా ఏపీలో రిజిస్ట్రేషన్ జరిగి ఉండాలి. మోటార్ క్యాబ్, మ్యాక్సీ ట్యాబ్ లకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఉండాలి. ఒకవేళ ఆటోలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుంటే ఒక నెలలో సమర్పించాల్సి ఉంటుంది. మొత్తానికైతే ఏపీలో పండగ వాతావరణం కనిపిస్తోంది ఆటో కార్మికుల్లో..