Amaravati land acquisition: అమరావతి రాజధాని లో( Amaravathi capital ) మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించి అడుగులు శరవేగంగా పడుతున్నాయి. అందుకు సంబంధించి కీలక అప్డేట్ ఒకటి వచ్చింది. అమరావతికి మణిహారంగా నిలవనున్న ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఎందుకు సంబంధించి భూ సేకరణ ప్రక్రియలో కదలిక వచ్చింది. 11 మండలాల్లోని 40 గ్రామాల్లో భూసేకరణకు కసరత్తు ప్రారంభం అయింది. ఈ భూ సేకరణ ప్రక్రియను పర్యవేక్షించే ప్రత్యేక అధికారిగా శ్రీవాత్సవ నియమితులైన సంగతి తెలిసిందే. ఆయన ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. భూ సేకరణకు సంబంధించిన అంశాలపై ఫోకస్ చేశారు. దాదాపు 12 ప్యాకేజీలుగా విభజించి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించాలన్నది ప్రణాళికగా తెలుస్తోంది. మొత్తం ఐదు జిల్లాల్లో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కోసం భూ సేకరణ చేపట్టనున్నారు.
హైదరాబాద్ మాదిరిగా..
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు( Hyderabad Outer Ring Road) మాదిరిగా దీనిని నిర్మించనున్నారు. 11 మండలాలలోని 40 గ్రామాల్లో ఔటర్ రింగ్ రోడ్డు కోసం భూసేకరణ చేపట్టాల్సి ఉంది. దాదాపు 4792 ఎకరాలను సమీకరించనున్నారు. ప్రధానంగా దుగ్గిరాల, కొల్లిపర, తెనాలి, గుంటూరు తూర్పు, చేబ్రోలు, వట్టిచెరుకూరు, గుంటూరు పశ్చిమ, తాడికొండ, మేడికొండూరు, మంగళగిరి, పెదకాకాని మండలాల్లో భూ సేకరణ చేపట్టనున్నారు. ఇప్పటికే అన్ని మండలాల రెవెన్యూ అధికారులకు షెడ్యూల్ ఇచ్చారు. ఇప్పటికే రెవెన్యూ అధికారులు నేషనల్ హైవే అధికారులతో కలిసి ఏడు మండలాల్లో పర్యటన పూర్తి చేశారు.
190 కిలోమీటర్ల పొడవుతో..
అమరావతి రాజధాని చుట్టూ 190 కిలోమీటర్ల పొడవుతో అవుటర్ రింగ్ రోడ్డు నిర్మించాలన్నది ప్రణాళిక. ఈ ప్రాజెక్టు కోసం జాతీయ రహదారుల సంస్థ డిపిఆర్ సిద్ధం చేసింది. ఢిల్లీలోని జాతీయ రహదారుల సమస్త ప్రధాన కార్యాలయానికి పంపింది. దాదాపు 25 వేల కోట్ల రూపాయలతో ఈ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేయాలన్నది ప్రణాళిక. హైదరాబాద్కు మణిహారంగా నిలిచే ఔటర్ రింగ్ రోడ్డు పొడవు 158 కిలోమీటర్లు. అంటే అమరావతి రాజధాని లో 190 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తే.. అమరావతికి ఇది మణిహారంగా మారనుంది. 140 మీటర్ల వెడల్పుతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూ సేకరణ జరగనుంది. ఐదు జిల్లాల్లో జరిగే భూ సేకరణ కోసం ఒక్కో జిల్లాకు ఒక్కో జాయింట్ కలెక్టర్ ను నియమించింది. త్వరలో భూ సమీకరణ ప్రారంభం కానుంది.