Undavalli Arun Kumar alliance comments: అసలే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి కొత్త రాజధాని ప్రతిపాదనపై విపరీతంగా విమర్శలు వస్తున్నాయి. ఆయన రాజధానుల విషయంలో చేస్తున్న ఆలోచన సొంత పార్టీ శ్రేణులని విస్మయ పరుస్తోంది. ఇటువంటి సమయంలో ఈ అంశంపై స్పందించాల్సిన ఉండవల్లి అరుణ్ కుమార్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. నేరుగా జగన్మోహన్ రెడ్డి రాజధానుల విషయంలో చేస్తున్న తప్పిదాన్ని ప్రస్తావించకుండా.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదని తేల్చి చెప్పారు. కూటమి కలిసి ఉన్నంతకాలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆ చాన్స్ లేదని కూడా చెప్పుకొచ్చారు. నిన్ననే ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. కూటమి కలిసి ఉన్నంతకాలం ఆ మూడు పార్టీలను వైసీపీ ఏం చేయలేదని చెప్పుకొచ్చారు. బహుశా జగన్మోహన్ రెడ్డి మావిగన్ రాజధాని ప్రతిపాదనతోనే.. నేరుగా చెప్పకుండా ఉండవల్లి అరుణ్ కుమార్ ఇలా తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.
సమకాలీన విశ్లేషకుడిగా..
చాలా రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. సమకాలీన అంశాలపై ఎప్పటికప్పుడు విశ్లేషణలు చేస్తుంటారు. మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి తనలో ఉన్న భావాన్ని వ్యక్తపరుస్తుంటారు. అదే మాదిరిగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో 2029 ఎన్నికల్లో ఏపీలో గెలుపు ఎవరిది అనేదానిపై మాట్లాడారు. అయితే ఎప్పుడూ జగన్ తో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫేవర్ కనిపించేది ఉండవల్లి అరుణ్ కుమార్ మాటల్లో. అటువంటిది మూడు పార్టీల కూటమి ఉండగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఛాన్స్ లేదని తేల్చేయడం విశేషం. ఇటీవల ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీలో చేరుతారని కూడా ప్రచారం నడిచింది. కానీ తన మనసులో అటువంటిదేమీ లేదని ఉండవల్లి అరుణ్ కుమార్ చెబుతున్నారు. రాజకీయాల పట్ల పూర్తిగా ఆసక్తి తగ్గిపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు.
జాగ్రత్తనా?హెచ్చరిక నా?
టిడిపి తో పాటు చంద్రబాబు విషయంలో విరుచుకు పడే తత్వం ఉండవల్లి అరుణ్ కుమార్ ది. జగన్మోహన్ రెడ్డి తో పాటు వైసీపీ విషయంలో మాత్రం చిన్నపాటి విమర్శలకే పరిమితం అవుతారు. అయితే ఎప్పుడు తన అభిమాన నేత రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డికి మంచి జరగాలని కోరుకుంటారు. అయితే ఉండవెల్లి లాంటి వారిని జగన్మోహన్ రెడ్డి లెక్కచేయరు. అందుకే సలహా ఇచ్చేందుకు ఉండవల్లి ముందుకు రారు. కానీ కొన్ని రకాల జాగ్రత్తలు చెప్పుకుంటారు. ఆ మూడు పార్టీలు కూటమిగా ఉన్నంతవరకు వైసీపీకి కష్టమని చెప్పడం ద్వారా జగన్మోహన్ రెడ్డికి సూచనలు చేసినట్టు ఉన్నారు. ఆ మూడు పార్టీలను విడగొడితే నీదే గెలుపు అని సూచించినట్టు ఉన్నారు. ఏదైనా ఉండవల్లి అరుణ్ కుమార్ మాటలకు అర్ధాలే వేరులే అన్నట్టు ఉంటుంది.