YSRCP MPs Join TDP: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పట్టు బిగించేందుకు కూటమి ప్రయత్నిస్తోంది. పుంజుకునే ప్రయత్నాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అయితే ఎంత మాత్రం ఈసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వకూడదని కూటమి భావిస్తోంది. టిడిపి తో పోల్చుకుంటే జనసేన నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం లేదని పవన్ భావిస్తున్నారు. తక్షణం కౌంటర్ అటాక్ ప్రారంభించాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలను తిప్పి కొట్టాలని పిలుపునిస్తున్నారు. ఇదే క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దెబ్బతీయాలని సీఎం చంద్రబాబు పక్క వ్యూహంతో అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్ లో పడద్దని పార్టీ శ్రేణులకు ఇప్పటికే ఆయన పిలుపునిచ్చారు. అయితే రాష్ట్రంలో జరిగిన రెండు ఘటనలతో మళ్లీ యాక్టివ్ కావాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. జగన్మోహన్ రెడ్డి బలంగా ప్రజల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి సమయంలో రాజకీయంగా దెబ్బతీయాలని చంద్రబాబు గట్టిగానే పావులు కదుపుతున్నట్లు పొలిటికల్ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది.
* చేరికలు పెంచాలని..
వైసిపి ( YSR Congress party) ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలామంది నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. కూటమి పార్టీలో చేరిపోయారు. రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులను సైతం వదులుకున్న వారు ఉన్నారు. భారీగా చేరికలు ఉండేవి. అయితే గతంతో పోల్చుకుంటే ఈ చేరికల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఎందుకంటే గతంలో దూకుడుగా వ్యవహరించిన వైసీపీ నేతలు వస్తామంటే కూటమి నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఇప్పుడు మరోసారి ఆ చేరికలను మరింత పెంచాలని కూటమి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానంగా వైసీపీ ఎంపీలు ఇద్దరు టిడిపిలోకి వచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. ఎంపీలు అంటే లోక్సభ సభ్యులు కాదు.. రాజ్యసభ సభ్యులు అని తెలుస్తోంది.
* జూన్లో పదవీ విరమణ..
ఈ ఏడాది జూన్లో పిల్లి సుభాష్ చంద్రబోస్( Subhash Chandra Bose), ఆళ్ల అయోధ్య రామిరెడ్డి రాజ్యసభ పదవీకాలం ముగియనుంది. అయితే ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు టిడిపి టచ్ లోకి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే సీఎం చంద్రబాబును కలుస్తానని పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రకటించారు. వైసీపీ హయాంలో తన నియోజకవర్గంలో గృహ నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని ఆయన ఆరోపిస్తూ వచ్చారు. దానిపై ఫిర్యాదు చేసేందుకు సీఎం చంద్రబాబును కలుస్తానని కూడా ఆయన ప్రకటన చేశారు. అయితే అది రాజకీయంగా దగ్గర అయ్యేందుకు అని ప్రచారం జరుగుతోంది. కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం బోస్ టిడిపిలో చేరుతారని పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరోవైపు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి సైతం టిడిపి వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన పారిశ్రామికవేత్త కూడా. టిడిపిలోని ఓ బలమైన నేత ఆయన కోసం రంగంలోకి దిగినట్లు సమాచారం. వైసీపీలో ఉండి మొన్నటి ఎన్నికలకు ముందు టిడిపిలోకి వచ్చి సదరు నేత ఎంపీ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి పై ఆగ్రహంగా ఉన్న ఆ ఎంపీ ఇప్పుడు వైసీపీ నుంచి చేరికలకు తెర వెనుక కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది.
* ఆది నుంచి వైసీపీలోనే..
ఆది నుంచి ఆళ్ల కుటుంబం వైసీపీలో ఉండేది. పార్టీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసేది. అయోధ్య రామిరెడ్డి సోదరుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి రెండుసార్లు వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో లోకేష్ ను ఓడించి జెయింట్ కిల్లర్ గా నిలిచారు. వైసీపీ కోసం నిత్యం న్యాయస్థానాలు చుట్టూ తిరిగేవారు. అటువంటి నేతకు మంత్రి పదవి ఇవ్వకపోగా 2024 ఎన్నికల్లో మంగళగిరి నుంచి తప్పించారు. అప్పటినుంచి ఆళ్ల కుటుంబం జగన్ విషయంలో అసంతృప్తిగా ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ఈ పరిణామ క్రమంలోనే సుభాష్ చంద్రబోస్ తో పాటు అయోధ్య రామిరెడ్డి సైతం టిడిపిలోకి వచ్చేందుకు మంతనాలు జరుగుతున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.