YSR Congress party
YSR Congress : వైఎస్ఆర్ కాంగ్రెస్ ( YSR Congress)పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వచ్చారు. ఆయనకు జనాలు బ్రహ్మరథం పట్టారు. విజయవాడ సబ్ జైలులో ఉన్న వల్లభనేని వంశీ మోహన్ ను పరామర్శించారు జగన్. అటు తరువాత గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లి రైతులను కలుసుకున్నారు. అయితే ఈ రెండు ఘటనలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన చేంజ్ కనిపించింది. జోష్ కూడా వచ్చింది. అయితే ఓ రెండు ఘటనలు మాత్రం ఈ క్రెడిట్ ను నీరు గార్చాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేక స్వరాలు బయటపడ్డాయి. దీంతో జోష్ వచ్చినట్టే వచ్చి… మైనస్ కూడా కనిపించింది. వాస్తవానికి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టును ముందుగానే ఖండించారు జగన్. నేరుగా కలిసి అండగా నిలవాలని భావించి జైలుకు వెళ్లి వచ్చారు.
* భిన్నంగా స్పందించిన వాసుపల్లి
రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వల్లభనేని వంశీ మోహన్( Vallabha neni Vamsi ) అరెస్టుపై స్పందించాయి. చాలామంది నేతలు ఖండించారు కూడా. అయితే విశాఖ జిల్లాకు చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాత్రం భిన్న స్వరం వినిపించారు. వల్లభనేని వంశీ లాంటి నేతలను పార్టీ నుంచి బయటకు పంపేయడం మేలని.. కొడాలి నాని వంటి నేతలు చేసిన వ్యాఖ్యలే పార్టీకి ఇబ్బందికరంగా మారాయని సంచలన ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి ఆర్కే రోజా తన దూకుడు తగ్గించుకోవాలని కూడా సూచించారు. విజయసాయి రెడ్డి లాంటి నేతల మాటలను జగన్మోహన్ రెడ్డి విన్నారని.. అందుకే ఉత్తరాంధ్రలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని కూడా వ్యాఖ్యానించారు. దీంతో ఒక్కసారిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన చర్చ ప్రారంభం అయింది.
* వినుకొండలో తిరుగుబాటు
ఇంకోవైపు వినుకొండ( Vinukonda ) వైసీపీలో పంచాయితీ పార్టీకి మైనస్ గా పరిణమించింది. అక్కడ వైసీపీ ఇన్చార్జ్ బొల్లా బ్రహ్మనాయుడు పార్టీకి ఇబ్బందికరంగా మారారని ఓ 500 మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏకంగా కేంద్ర కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశారు. బ్రహ్మనాయుడు ను మారిస్తేనే అక్కడ పార్టీ నిలబడుతుందని తేల్చి చెప్పారు. వాస్తవానికి బ్రహ్మానాయుడు పార్టీలో సీనియర్. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతూ వస్తున్నారు. అటువంటి నేత విషయంలో ఫిర్యాదు రావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది.
* పార్టీలో ఉన్న వారిలో అసంతృప్తి
వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress)పార్టీ ఓడిపోయిన తర్వాత చాలామంది నేతలు బయటకు వెళ్లిపోయారు. అయితే మరి కొంతమంది వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. అటువంటివారిని ఒక వ్యూహం ప్రకారం కూటమి పార్టీలో చేర్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వచ్చిన సమయంలో వీరు అసమ్మతి లేవనెత్తేలా మాట్లాడతారు. దానిని క్యాష్ చేసుకునే పనిలో పడతారు. అది వ్యూహం ప్లాన్ గా తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా పార్టీని ఇరుకున పెట్టేలా మాట్లాడారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. దీనికి ఇప్పుడు వాసుపల్లి గణేష్ కుమార్ తోడయ్యారు. మరి కొంతమంది సైతం వైసీపీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. వారు కూడా సరైన సమయంలో నిరసన గళం వినిపించి కూటమి పార్టీలకు మేలు చేయనున్నారు. తద్వారా కూటమి పార్టీలు చేరేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారు.