TDP Final List: తెలుగుదేశం పార్టీ తుది జాబితాను ప్రకటించనుంది. ఇప్పటికే చంద్రబాబు కసరత్తు పూర్తి చేశారు. అటు బిజెపి సైతం పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించింది. గతంలో టిడిపి ప్రకటించిన మూడు స్థానాల్లో కొత్తగా బిజెపి అభ్యర్థులను ప్రకటించింది. దీంతో ఆ మూడు స్థానాలు టిడిపి వదులుకున్నట్టే. గతంలో పెండింగ్లో ఉన్న ఐదు స్థానాలతో పాటు ఈ మూడు కలవడంతో.. మొత్తం ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. తుది జాబితాలో మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావుల భవితవ్యం తేలనుంది. దీంతో అందరి దృష్టి టిడిపి ఫైనల్ జాబితా పై పడింది.
పొత్తులో భాగంగా జనసేనతో పాటు బిజెపికి 31 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలను తెలుగుదేశం పార్టీ వదులుకుంది. 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాలకు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తోంది. ఇప్పటికే మూడు జాబితాలను ప్రకటించింది. ఇంకా నాలుగు లోక్సభ స్థానాలు, 8 అసెంబ్లీ సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. గతంలో టిడిపి ప్రకటించిన సీట్లలో ఇప్పుడు బిజెపి అభ్యర్థులను ప్రకటించింది. అరకు అసెంబ్లీ స్థానాన్ని దన్ను దొరకు, పి. గన్నవరంలో మహాసేన రాజేష్, అనపర్తిలో నల్లిమిల్లి రామకృష్ణారెడ్డిని ఇంతకుముందే టిడిపి ప్రకటించింది. కానీ ఈ మూడింటిలో తాజాగా బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది.
టిడిపి కీలక స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.ముఖ్యంగా విశాఖ జిల్లా భీమిలి,విజయనగరం జిల్లా చీపురుపల్లి,ప్రకాశం జిల్లా దర్శి ఉన్నాయి. చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని గంటా శ్రీనివాసరావుకు చంద్రబాబు సూచించారు. కానీ ఆయన అందుకు అంగీకరించలేదు. భీమిలి సీటు కావాలని కోరుతున్నారు. దీంతో కళా వెంకట్రావు కానీ, కిమిడి నాగార్జున కానీ అక్కడ బరిలో దిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఒకవేళ గంటా శ్రీనివాసరావు చీపురుపల్లి నుంచి పోటీకి సిద్ధపడితే.. భీమిలి నియోజకవర్గాన్ని కళా వెంకట్రావు కానీ, కర్రోతు బంగారు రాజు గానీ పోటీ చేసే చాన్స్ కనిపిస్తోంది. గంటా శ్రీనివాసరావు మాత్రం తనకు భీమిలి సీటు దక్కుతుందని ధీమాతో ఉన్నారు.
విజయనగరం ఎంపీ సీటు తూర్పు కాపు సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశం ఉంది. కళా వెంకట్రావు, మీసాల గీత, కిమిడి నాగార్జునల్లో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒంగోలు నుంచి సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి దాదాపు ఖరారు అయినట్లు సమాచారం. కడప ఎంపీగా రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి లేకుంటే భూపేష్ రెడ్డి పోటీ చేసే ఛాన్స్ ఉంది. అనంతపురం ఎంపీగా జెసి పవన్ రెడ్డి తో పాటు పూల నాగరాజు, కొంబూరి నాగరాజు పేర్లు వినిపిస్తున్నాయి. దర్శి సీటు గొట్టిపాటి శ్రీలక్ష్మికి ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే ఫైనల్ జాబితా కోసం టిడిపి ఆశావహులు ఆశగా ఎదురుచూస్తున్నారు.