CM Jagan : జగన్ అక్రమ ఆస్తుల కేసులో కీలక ట్విస్ట్. సుప్రీంకోర్టుకు దర్యాప్తు సంస్థ కీలక అప్డేట్ ఇచ్చింది. ఏపీలో సీఎం జగన్ పై 2011లో అక్రమ ఆస్తుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. జగన్ అరెస్ట్ చేసి 16 నెలలపాటు రిమాండ్ ఖైదీగా కూడా ఉంచారు. రెండేళ్ల పాటు విచారణ కొనసాగగా.. 2013లోనే హైదరాబాద్ సిబిఐ కోర్టులో చార్జిషీ ట్లు దాఖలు చేసింది. అయితే అప్పటి నుంచి చార్జి షీట్లపై విచారణలో పురోగతి లేకుండా పోయింది. ఇటీవల ఈ అంశంపై ఎంపీ రఘురామకృష్ణం రాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు సిబిఐ తీరును తప్పు పట్టింది. చివాట్లు కూడా పెట్టింది. అయితే తాజా పరిస్థితిపై సుప్రీంకోర్టుకు సిబిఐ కీలక సమాచారం ఇచ్చింది.
చార్జిషీట్ లపై విచారణ ఎందుకు జాప్యం జరిగింది? అన్న విషయాల్లో స్పష్టతనిచ్చింది. 2013లో తాము చివరి ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత నుంచి చోటు చేసుకున్న పరిణామాలను వివరించింది. చార్జిషీట్లపై విచారణ ను అడ్డుకునేందుకు నిందితులు ఏకంగా 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేసినట్లు సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. అయితే ఈ పిటిషన్ లపై తీర్పు ఇవ్వకముందే జిడ్జిలు బదిలీ అవుతున్న విషయాన్ని ప్రస్తావించింది. ఇప్పటివరకు ఆరుగురు జడ్జిలు బదిలీ అయ్యారని వెల్లడించింది. నిందితులు శక్తివంతులని, ఏదో ఒక కారణం చూపి, పిటిషన్లు దాఖలు చేసి విచారణ ముందుకు సాగకుండా చేస్తున్నారని సిబిఐ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది.
ఇదే సమయంలో రఘురామకృష్ణం రాజు ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి అప్పగించాలన్న వినతిపై కూడా సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. జగన్ అక్రమ ఆస్తుల కేసుల్లో మొత్తం 911 మంది సాక్షులు ఉన్నారని. వారంతా 50 సంవత్సరాలకు పైబడిన వారేనని.. అందుకే పిటిషనర్ రఘురామ కోరినట్లుగా ఈ విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయవద్దని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం సీబీఐ కోర్టులో ఉన్న జడ్జిలు సరిపోవడంలేదని.. న్యాయమూర్తులను కేటాయించడంతోపాటు రోజువారి విచారణ జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ కోరింది. దీంతో ఈ కేసు కొత్త మలుపు తీసుకున్నట్లు అయ్యింది.