Tuni Missing Girl: తుని చిన్నారి అదృశ్యం మిస్టరీ 20 రోజులు అవుతున్న వీడడం లేదు. మూడు వారాలు గడుస్తున్నా ఆచూకీ లేదు. ఇప్పటివరకు వందలాది మంది పోలీసులు గాలింపు చర్యలు చేపడుతూ వచ్చారు. ఒక్క క్లూ కూడా దొరకలేదు. తొలుత కిడ్నాప్ కోణంలో దర్యాప్తు చేశారు పోలీసులు. తర్వాత అటవీ ప్రాంతం కావడంతో వన్యప్రాణుల బారిన పడవచ్చు అని అనుమానం వ్యక్తం చేశారు. కానీ ఏ కోణంలో కూడా ఈ కేసు ఒక కొలిక్కి రావడం లేదు. అయితే ప్రధానంగా ఈ కేసులో కీలకంగా ఉన్న పెంపుడు కుక్క సైతం మృతి చెందింది. దీంతో మరిన్ని అనుమానాలు పెరిగాయి. వాటన్నింటినీ తెరదించుతూ కుక్క మృతి పై ల్యాబ్ నివేదికలు వచ్చాయి. కుక్క ఎందుకు మృతి చెందిందో.. పశుసంవర్ధక శాఖ అధికారులు బయటపెట్టారు.
* మూడు వారాల కిందట..
ఈనెల 6న చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం అయింది. పామాయిల్ తోటలో కాపలాదారులుగా ఉన్న తల్లిదండ్రుల చెంతనే ఉండేది జ్ఞానేశ్వరి. అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు కిడ్నాప్ కోణంలో దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఆ కుటుంబ సభ్యులకు ఎవరైనా ప్రత్యర్థులు ఉన్నారా? కుటుంబంలో ఏమైనా విభేదాలు ఉన్నాయా? అనే కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు. ఆచూకీ లేకపోవడం, అటవీ ప్రాంతం కావడంతో ఎన్ డి ఆర్ ఎఫ్ తోపాటు ఎస్ టి ఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. వందలాది మంది పోలీసులు జల్లెడ పట్టారు. కానీ చిన్నారి ఆచూకీ మాత్రం ఇంతవరకు లేదు.
* పెంపుడు కుక్క మృతి..
అయితే చిన్నారి అదృశ్యం అయినప్పుడు.. వారింట్లో ఉండే పెంపుడు కుక్క కూడా కనిపించకుండా పోయింది. అక్కడకు రెండు రోజుల తర్వాత తీవ్ర అలసట, ఆందోళనతో ఇంటి వద్ద కనిపించింది. దాని ద్వారా అదృశ్యమైన చిన్నారి ఆచూకీ కనిపెట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఆ కుక్క మెడకు జిపిఎస్ ట్రాక్ చేసి అడవుల్లోకి వదిలారు. రెండు రోజులపాటు గాలించిన ఆ కుక్క.. మళ్లీ ఇంటికి చేరింది. తీవ్ర అనారోగ్యానికి గురైంది. కాపాడేందుకు పశుసంవర్ధక శాఖ అధికారులు చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ ఫలితం లేకపోవడంతో ఆ కుక్క మృతి చెందింది. కుక్క మృతి పై అనేక రకాల అనుమానాలు వ్యక్తం కావడంతో.. పోస్టుమార్టం చేసి ల్యాబ్ నివేదిక కోసం పంపించారు విశాఖకు. అయితే ఆ ల్యాబ్ నివేదిక బయటకు వచ్చింది. ఒక్క చనిపోవడానికి అనారోగ్యమే కారణమని తేలిపోయింది. విష ప్రయోగం, అటవీ జంతువుల దాడి వంటివి కావలి నిర్ధారణ అయింది. దీంతో చిన్నారి అదృశ్యం మిస్టరీ మరింత జఠిలం అయినట్టు కనిపిస్తోంది.
