Nikhil Siddhartha: టాలీవుడ్ హీరో నిఖిల్ టిడిపిలో చేరినట్లు ప్రచారం జరుగుతోంది. నారా లోకేష్ సమక్షంలో నిఖిల్ సిద్ధార్థ పసుపు కండువా కప్పుకున్నారు. దీంతో నిఖిల్ టిడిపిలో చేరారని.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తారని టాక్ నడుస్తోంది. అయితే రాజకీయాలు చేయాలని నిఖిల్ టిడిపిలో చేరలేదని.. తన బంధువుకు టికెట్ ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞత తెలిపేందుకు మాత్రమే లోకేష్ ను కలిశారని సన్నిహితులు చెబుతున్నారు.ఇందులో ఏమాత్రం రాజకీయం లేదని చెప్పుకొస్తున్నారు. నిఖిల్ మామ మద్దులూరి మాలకొండయ్య యాదవ్ చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిఖిల్ టిడిపికి మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది.
మాల కొండయ్య యాదవ్ సీనియర్ పొలిటీషియన్. విద్యాసంస్థలు కూడా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా చేస్తుంటారు. 2009 ఎన్నికల్లో టిడిపి తరఫున ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. 2019 ఎన్నికలకు ముందు టిడిపిలోకి తిరిగి జాయిన్ అయ్యారు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాం పార్టీ నుంచి ఫిరాయించిన సంగతి తెలిసిందే. దీంతో చీరాల ఇన్చార్జిగా మాలకొండయ్యకు టిడిపి అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. చీరాలలో యాదవ సామాజిక వర్గం అధికం. అందుకే 2024 ఎన్నికల్లో మాలకొండయ్య అభ్యర్థిత్వాన్ని టిడిపి హై కమాండ్ ఖరారు చేసింది.ఇక్కడ వైసిపి అభ్యర్థిగా కరణం బలరాం కుమారుడు వెంకటేష్ ఖరారయ్యారు.
హీరో నిఖిల్ సోదరిని మాలకొండయ్య యాదవ్ పెద్ద కుమారుడు అమర్నాథ్ కు ఇచ్చి వివాహం చేశారు. అప్పటినుంచి వీరి మధ్య బంధుత్వం ఉంది. అయితే సినీ రంగం నుంచి ప్రముఖ హీరోలెవరు రాజకీయాల వైపు రారు. కానీ నిఖిల్ ఏకంగా టిడిపి కండువా కప్పుకున్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో టిడిపి తరఫున ప్రచారం చేస్తారని కూడా టాక్ నడుస్తోంది. అయితే నిఖిల్ టిడిపిలో చేరలేదని.. తన మామకు టికెట్ కేటాయించినందుకు నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలియజేసినట్లు నిఖిల్ సన్నిహితులు చెబుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేసినట్లు చెప్పుకొస్తున్నారు. అయితే నిఖిల్ టిడిపిలో చేరిన వ్యవహారం ఇండస్ట్రీలో సరికొత్త టాక్ గా మారింది. సినీ పరిశ్రమలో ఎక్కువమంది జనసేన వైపు మొగ్గు చూపుతున్నా.. ఎవరూ బయటపడటం లేదు.