AP Government : ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతోంది. జూన్ 4న ఫలితాలు వచ్చాయి. అదే నెల 12న ప్రభుత్వం కొలువుదీరింది. సీఎం చంద్రబాబు తో పాటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. పాలన ప్రారంభించారు. 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా వేడుకలు చేసుకోవాలని నిర్ణయించారు. అయితే కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదని ఒక వర్గం ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. దుబారా ఖర్చు తగ్గి అభివృద్ధి పనులు పట్టాలెక్కయని ఇంకో వర్గం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కూటమిపాలన వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టనున్నారు చంద్రబాబు. వంద రోజుల్లో సర్కారుకు ఎదురైన సవాళ్లను, వాటిని ఎంత సమర్థవంతంగా ఎదుర్కొన్నది ప్రజలకు వివరించనున్నారు. వందరోజుల పాలనపై ప్రజల నుంచి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. దానికి అనుగుణంగా పాలనలో మార్పులు తీసుకురావాలన్నది ప్రభుత్వ వ్యూహం. అయితే పాలనాపరంగా మంచి మార్కులు పడినా.. సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా హామీలు అమలుకు నోచుకోకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
* ఎన్నో హామీలు
ఈ ఎన్నికలు చంద్రబాబుకు చావో రేవో అన్నట్టు సాగాయి. గత ఐదేళ్లుగా జగన్ సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా అమలు చేశారు. ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా సంక్షేమ పథకాలు ఇచ్చారు. కానీ ప్రజలు సంక్షేమంతో పాటు అభివృద్ధిని కోరుకున్నారు. అయితే తాను రెట్టింపు సంక్షేమ పథకాలు ప్రకటిస్తే కానీ.. ప్రజలు తనవైపు తిరగరని చంద్రబాబు భావించారు. అందులో భాగంగా చాలా సంక్షేమ పథకాలను ప్రకటించారు. ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేసుకున్నారు. సూపర్ సిక్స్ పథకాలలో వారికి పెద్ద పీట వేశారు.
* వాటి జాడలేదు
విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు పూర్తవుతుంది. కానీ ఇంతవరకు తల్లికి వందనం జాడలేదు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకు సాయం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. రైతులకు సాగు ప్రోత్సాహం లేదు. ఏటా రైతులకు 20వేల రూపాయల సాగు ప్రోత్సాహం అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఖరీఫ్ సీజన్ దాటిపోయినా ఇంతవరకు సాయం అందించలేదు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇంకా అమలులోకి రాలేదు. ఇంట్లో 18 సంవత్సరాలు నిండిన మహిళలకు మృతి అందిస్తామన్నారు. అది కూడా ఇంతవరకు అమలు చేయలేకపోయారు.
* పింఛన్లు సరే
సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి ఒక్క పెన్షన్ విషయంలో మాత్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. కూటమి గెలిస్తే ఏప్రిల్ నుంచి వర్తింప చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు జూలైలో మూడు నెలల బకాయిలతో పాటు 7000 రూపాయల పింఛన్ మొత్తాన్ని అందించారు. మరో హామీ అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 200 క్యాంటీన్లు తెరిచారు. జగన్ హయాంలో ఇబ్బందికరంగా ఉన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశారు. ఇంతకుమించి హామీలు అమలు చేయలేదు. మిగతా హామీల అమలుకు ఎదురుచూపులు తప్పడం లేదు.
* వాటితోనే కాలయాపన
టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు మాత్రమే అవుతోంది. ప్రస్తుతం ఓటాన్ బడ్జెట్ కొనసాగుతోంది. ప్రభుత్వ పాలనా తీరుతెన్నులు, సంక్షేమ పథకాలకు అయ్యే ఖర్చు, ఆదాయం వంటి వాటిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికిప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేయడం అసాధ్యం. ఇదే విషయాన్ని చంద్రబాబుఇటీవల తరచూ చెబుతున్నారు. జగన్ సర్కార్ ఖజానాను ఖాళీ చేసిందని.. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం కష్టతరమని సంకేతాలు కూడా ఇచ్చారు. మొత్తానికి అయితే కూటమి వంద రోజుల పాలన పై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.