Tirupati: తిరుమల తిరుపతి దేవస్థానం లో అక్రమార్కులు పాగా వేస్తే ఏమవుతుందో గత ప్రభుత్వంలో జరిగిన విధానాలు కళ్ళకు కట్టాయి. లడ్డు తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ నుంచి మొదలు పెడితే అన్యమత వ్యక్తులకు పెద్దపీట వేయడం వరకు ప్రతి విషయంలోనూ ఇష్టారాజ్యంగా సాగింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా నాటి అక్రమాలను బయటపెడుతోంది. లడ్డులో కల్తీ నెయ్యి వాడకం ఇప్పటికే సంచలనం సృష్టించగా.. ఇప్పుడు దానిని మించిన ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది.
తిరుపతి పరకామణిలో జరిగిన చోరీ, కల్తీ నెయ్యి, వస్త్రాల కొనుగోలులో జరిగిన అవినీతి వంటి వ్యవహారాలు దేవదేవుడి క్షేత్రానికి మాయని మచ్చను తీసుకొచ్చాయి. ఇప్పుడు శ్రీ గోవిందరాజ స్వామి వారి విమాన గోపురం పనులలో 50 కిలోల బంగారం మాయమైందని అభియోగాలు నమోదయ్యాయి. దీనిపై విజిలెన్స్ విభాగం అత్యంత లోతుగా విచారణ నిర్వహిస్తోంది. 30 విగ్రహాలను ధ్వంసం కూడా చేసినట్టు తెలుస్తోంది.
తిరుపతిలోని గోవిందరాజ స్వామి వారి ఆలయానికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. 2022, 23 కాలంలో స్వామివారి ఆలయ విమాన గోపురానికి బంగార తాపడం చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఏకంగా 100 కిలోల బంగారాన్ని కేటాయించింది. తాపడంలో భాగంగా తొమ్మిది పొరల్లో గోపురానికి అమర్చాల్సి ఉంటుంది. విమాన గోపురంపై 30 విగ్రహాలను ధ్వంసం చేశారని.. ఆ తర్వాత బంగారు తాపడం చేశారని తెలుస్తోంది. 30 విగ్రహాలను ధ్వంసం చేయడం ద్వారా మిగిలిన బంగారాన్ని మాయం చేశారని తెలుస్తోంది. మాయం చేసిన బంగారం దాదాపు 50 కిలోల వరకు ఉంటుందని విజిలెన్స్ అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్టు సమాచారం.
ఈ వ్యవహారం వెలుగులోకి రాకుండా నాటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, ఆలయ ఈవో ధర్మారెడ్డి అనేక రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. విమానం గోపురం పనులకు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ఒకరైతే.. అతడిని పక్కనపెట్టి మరో సబ్ కాంట్రాక్టర్ కు పనులు అప్పగించినట్టు ప్రచారం జరుగుతుంది. దీనిపై దేవస్థానానికి ఫిర్యాదులు కూడా అందినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దేవస్థానం విజిలెన్స్ విభాగం ఈ వ్యవహారంపై విచారణ నిర్వహిస్తోంది. అప్పటి కాలంలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వివరాలు సేకరించి.. కీలకమైన విషయాలను విజిలెన్స్ విభాగం బయటపడుతోంది. బంగారం తాపడంలో పాల్గొన్న కార్మికుల వివరాలు కూడా సేకరించిన విజిలెన్స్ విభాగం.. విగ్రహాలను ఎలా ధ్వంసం చేశారు? ధ్వంసం చేసిన విగ్రహాలను ఎక్కడ వేశారు? తాపడం కోసం ఎంత బంగారాన్ని వినియోగించారు? అనే అంశాలపై లోతుగా దర్యాప్తు సాగిస్తున్నారు.