Tirumala Parakamani Theft Case: తిరుమల( Tirumala) పరకామణి చోరీ కేసులో కీలక పరిణామం. ఈ కేసులో టీటీడీ పూర్వపు ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి ఇప్పుడు సంచలనంగా మారింది. తొలుత ఈ చోరీకి సంబంధించి ఫిర్యాదుదారుడుగా ఉన్న ఆయన తర్వాత.. లోక్ అదాలత్ లో రాజీ చేసుకున్నారు. అయితే దీనిపై కోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు కావడం.. సిఐడి విచారణ ప్రారంభం అయిన తరువాత ఫిర్యాదుదారుడుగా భావిస్తున్న సతీష్ కుమార్ మృతి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఇది ఆత్మహత్యగా తొలుత భావించారు. సోషల్ మీడియాలో సైతం వైసీపీ అనుకూల వ్యక్తులు అలానే ప్రచారం చేశారు. అయితే ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు మాత్రం హత్యగా నిర్ధారించారు. దీంతో ఏపీలో ఇది ఒక సంచలన అంశంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే తిరుమలలో జరిగిన వివాదాలకు సంబంధించి దర్యాప్తులు జరుగుతున్నాయి. ఇప్పుడు సతీష్ కుమార్ హత్యతో మరో విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
* 2023లో చోరీ..
తిరుమల పరకామణిలో రవికుమార్( Ravi Kumar) అనే వ్యక్తి పనిచేసేవారు. 2023 ఏప్రిల్ లో రవికుమార్ పరకామణిలో విదేశీ కరెన్సీని చోరీ చేస్తూ పట్టుబడ్డారు. అప్పట్లో టీటీడీ విజిలెన్స్ విభాగంలో సతీష్ కుమార్ పనిచేసేవారు. పరకామణిలో రవికుమార్ చోరీ చేసిన విషయంపై సతీష్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయింది. అయితే అప్పట్లో లోక్ అదాలత్ లో ఈ కేసు రాజీ కుదిరించారు. అప్పట్లో టీటీడీ పెద్దల ప్రాబలంతోనే ఈ రాజీ జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జర్నలిస్ట్ శ్రీనివాస్ వేసిన ప్రజా ప్రయోజన పిటీషన్తో హైకోర్టు స్పందించింది. సిఐడి విచారణకు ఆదేశించింది. అప్పట్లో ప్రభుత్వంతో పాటు టీటీడీ పెద్దలు రవికుమార్ ఆస్తులను కొంత మేర టీటీడీకి రాయించారు. మిగతా మొత్తం తమ పేరు తో రాయించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ కేసు విచారణ ప్రారంభం అయితే కుట్ర కోణం వెలుగులోకి వస్తుందని అంతా భావించారు. విచారణ అధికారుల ఎదుట ఈనెల 6న సతీష్ కుమార్ హాజరయ్యారు. ఆయన నుంచి విచారణ అధికారులు వివరాలను సేకరించారు. మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పారు.
* విచారణకు వస్తుండగా ఘటన.. గుంతకల్లు( guntakallu ) రైల్వే డివిజన్లో జి ఆర్ పి సీఐగా విధులు నిర్వహిస్తున్నారు సతీష్ కుమార్. పరకామణి కేసుకు సంబంధించి రెండోసారి విచారణకు హాజరయ్యేందుకు బయలుదేరారు. ఇంతలోనే ఆయన మృతి చెందారు. అయితే ఆయనను గొడ్డలితో హత్య చేశారని ప్రాథమిక నిర్ధారణలో తేలింది. మృతదేహం పోస్టుమార్టం లో కూడా అదే తేలినట్లు తెలుస్తోంది. దీంతో ఇది మరోసారి రాజకీయ సంచలన అంశంగా మారింది. రిజర్వ్ పోలీస్ విభాగం నుంచి డిప్యూటేషన్ పై వచ్చారు సతీష్ కుమార్ టిటిడి కి. అక్కడ విజిలెన్స్ ఇన్స్పెక్టర్గా సేవలందించారు. 2022 సెప్టెంబర్ లో ఏవీఎస్ఓగా ప్రమోషన్ పొందారు. ఆ సమయంలోనే పరకామణిలో చోరీ జరిగింది. తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే అప్పటి ప్రభుత్వ పెద్దలతో పాటు టీటీడీ పెద్దల ఒత్తిడితో.. లోక్ అదాలత్ లో రాజీ చేసుకున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో భారీగా చేతులు మారినట్లు తెలుస్తోంది. అప్పటి పెద్దల చేతిలో సతీష్ కుమార్ పావుగా మారినట్లు ప్రచారం నడుస్తోంది. అయితే ఇప్పుడు వైసీపీ సతీష్ కుమార్ హత్య కాదు ఆత్మహత్య అని ముందుగానే ప్రచారం చేయడం విశేషం. దీంతో దీని వెనుక ఎవరి హస్తం ఉందో తెలియాల్సి ఉంది. అయితే ఏపీ రాజకీయాల్లో ఇదో సరికొత్త అంశంగా మారే అవకాశం కనిపిస్తోంది.