Tirumala Parakamani Case: తిరుమల తిరుపతి.. పుణ్యక్షేత్రం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నిత్య కళ్యాణం.. పచ్చ తోరణంగా ఈ క్షేత్రం వెలుగొందుతూ ఉంటుంది. దేవదేవుడి కరుణాకటాక్షాల కోసం ఆగర్భ శ్రీమంతుల నుంచి మొదలు పెడితే పేదవారి వరకు వస్తూనే ఉంటారు. ఏడుకొండలవాడిని దర్శనం చేసుకుని ఆయన కృపకు పాత్రులు అవుతూనే ఉంటారు. ఆ గడ్డమీద అడుగుపెట్టగానే మూడు నామాలను నుదుట దిద్దుకుంటారు. కళ్యాణ కట్టలో తల నీలాలు సమర్పిస్తారు. గంటలు గంటలు ఎదురుచూసి స్వామివారిని దర్శించుకుంటారు . దర్శనం అనంతరం స్వామివారి లడ్డు ప్రసాదాన్ని ఆరగిస్తారు. అంతేకాదు స్వామివారి ఆలయంలో ఉచితంగా పెట్టే అన్నప్రసాదాన్ని కూడా స్వీకరిస్తారు.
తిరుమల శ్రీవారి మాత్రమే కాదు ఆ గడ్డమీద ఉన్న ప్రతి ఆలయం ఎంతో విశిష్టమైన చరిత్ర కలిగి ఉంటుంది. అడుగున ఆధ్యాత్మిక సౌరభం కనిపిస్తూ ఉంటుంది. భక్తులు ప్రతిరోజు వేలాదిమందిగా వస్తుంటారు కాబట్టి స్వామివారి హుండీ ఆదాయం అంతకంతకు పెరుగుతూనే ఉంటుంది. తలనీలాలు, లడ్డు ప్రసాదాల విక్రయం, ఇతర మార్గాల ద్వారా స్వామివారికి విశేషమైన ఆర్జన లభిస్తూ ఉంటుంది. అయితే అటువంటి తిరుమల శ్రీవారి ఆలయం గత కొంతకాలంగా వివాదాలకు కేంద్రంగా మారిపోయింది. అన్యమత ప్రచారం, లడ్డు తయారీలో ఇతర జంతువుల కొవ్వు, స్వామి వారి ప్రాకారాల నుంచి విమానాలు ఎగరడం.. స్వామివారి ఆలయ పరిసర ప్రాంతాల్లో కొంతమంది వికృత చేష్టలకు పాల్పడడం వంటివి ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్నాయి . వీటివల్ల తిరుమల తిరుపతి ఆలయం గొప్పతనం దెబ్బతింటుందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వివాదాలు ఇలా ఉండగానే తాజాగా పరకామణి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 2023 లో తిరుమలలోని పరకామణిలో రవికుమార్ అనే ఉద్యోగి దొంగతనం చేసినట్టు స్థానిక పాత్రికేయుడు శ్రీనివాసులు గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సిఐడి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ దొంగతనంపై 2023 లో ఏప్రిల్ నెలలో పోలీసులకు టీటీడీ విజిలెన్స్ ఆఫీసర్ సతీష్ ఫిర్యాదు చేశారు. అయితే సెప్టెంబర్ నెలలో లోక్ అదాలత్ లో రవితో రాజీ చేసుకున్నారని తెలుస్తోంది. లోక్ అదాలత్ నిర్ణయాన్ని జస్టిస్ రామకృష్ణ సస్పెండ్ చేశారు. ఖజానా రికార్డులు, రాజీ ఉత్తర్వుల సీజ్ కు సిఐడిని ఆదేశించినప్పటికీ.. అది సాధ్యం కాలేదు. దీంతో పరకామణిలో నాడు రవి చేసిన వ్యవహారం వెలుగులోకి వస్తుందా? ఆయన వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు? ఇందులో ఉన్న పాత్రధారులు ఎవరు? అనే విషయాలు బయటపడతాయా? అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్తమవుతున్నాయి.
తిరుమల ఆలయ పవిత్రతను కాపాడుతూ.. భక్తులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత దెబ్బతినకుండా.. భక్తులకు ఇబ్బంది గలకుండా ఎప్పటికప్పుడు ఏర్పాట్లును పర్యవేక్షిస్తున్నామని చైర్మన్ బి.ఆర్ నాయుడు చెబుతున్నారు. 2023 లో వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి.. నాడు జరిగిన ఈ ఘటనపై ప్రస్తుత నూతన కమిటీ దృష్టి సారించి చర్యలు తీసుకుంటే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని భక్తులు అభిప్రాయపడుతున్నారు.