Tirumala : తిరుమలలో ( Tirumala) ఇటీవల వన్య మృగాలు హల్ చల్ చేస్తున్నాయి. మెట్ల మార్గంతో పాటు ఘాట్ రోడ్లో సైతం దర్శనమిస్తున్నాయి. దీంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గాలు, ఘాట్ రోడ్లలో ఇటీవల కాలంలో చిరుతల సంచారం పెరిగింది. ఇటీవల ఓ చిరుత చాలాసేపు వీడియోలకు చిక్కింది. అది సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అయితే గత అనుభవాల దృష్ట్యా టిటిడి అప్రమత్తం అయ్యింది. వాటి కట్టడికి, భక్తుల భద్రతపై తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలోని గోకులంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి అటవీ శాఖ తో పాటు వివిధ విభాగాలతో చర్చలు జరిపారు. కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.
* ఇకనుంచి స్పెషల్ డ్రైవ్..
అలిపిరి( aliperi) మెట్ల మార్గంలో భక్తుల భద్రతకు అదనపు సిబ్బందిని కేటాయించాలని నిర్ణయించారు. పరిస్థితులకు అనుగుణంగా వారిని అప్పటికప్పుడు అలిపిరి నడకదారి, శ్రీవారి మెట్టు, ఘాట్ రోడ్లలో విధులు కేటాయిస్తారు. ఆరోగ్య విభాగం ద్వారా ఎప్పటికప్పుడు చెత్తను తొలగించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అటవీ, రెవెన్యూ, పంచాయితీ రాజ్, ఆరోగ్యం, విజిలెన్స్ శాఖలతో కలిసి అటవీ శాఖ సమన్వయంతో నిరంతర జాయింట్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించారు. వన్యప్రాణుల సంచారం పై తక్షణ, దీర్ఘకాలిక చర్యల రూపకల్పనలో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్, అటవీ శాఖల సహకారం తీసుకోవాలని కూడా డిసైడ్ అయ్యారు. అలిపిరి మార్గాన్ని చిరుత రహిత ప్రాంతంగా మార్చడానికి కెమెరా ట్రాప్స్, స్మార్ట్ స్టిక్స్, బయో ఫెన్సింగ్ లు, నెట్ గన్స్, హై ఫ్లాష్ టార్చ్ లైట్ లు, పెప్పర్ స్ప్రేలు తదితర వస్తువులను రక్షణ పరికరాలుగా వినియోగించేలా నిర్ణయం తీసుకున్నారు.
Also Read : తిరుమలలో రూం కావాలా.. ఇలా సులభంగా బుకింగ్ చేసుకోండి..
* కొండపైకి గుంపులు గుంపులుగా భక్తులు..
రెండు రోజుల కిందటే అలిపిరి కాలిమార్గంలో చిరుత సంచరించిన విషయం తెలిసిందే. 350వ మెట్టు సమీపంలో భక్తులు చిరుతను గుర్తించారు. భయంతో పరుగులు తీశారు. ఈ నేపథ్యంలో టీటీడీ భద్రతా సిబ్బంది తక్షణ చర్యలు చేపట్టారు. అలిపిరి మెట్ల మార్గంలో భక్తులను గుంపులు గుంపులుగా పంపించారు. ఎట్టి పరిస్థితుల్లో భక్తులు ఒంటరిగా కొండపైకి వెళ్లొద్దని సూచిస్తున్నారు. గుంపులుగా మాత్రమే వెళ్లాలని సూచిస్తున్నారు. 12 సంవత్సరాలలోపు వయసున్న వారిని ఈ మార్గంలో అనుమతించకూడదని ప్రాథమికంగా నిర్ణయించారు. భక్తుల భద్రత కోసం టిటిడి అటవీ విభాగం సిబ్బంది అలిపిరి నడక మార్గం పొడవునా పెట్రోలింగ్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రెండున్నర కిలోమీటర్ల పొడవు ఉన్న 7వ మైలు నుంచి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు పటిష్ట భద్రత కల్పించడం, చిరుతలతో పాటు ఇతర వన్యప్రాణుల కదలికలపై నిఘా ఉంచడం చేయనున్నారు. అయితే ఇక్కడ నుంచి భక్తుల భద్రతపై నిరంతర పర్యవేక్షణ, అందుకు సంబంధించి సమీక్షలు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.