Tippala Vamsi: విశాఖలో( Visakha City ) పొలిటికల్ సీన్ మారుతోంది. గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ పై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి సమయం సమీపిస్తోంది. ఈనెల 19న అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఓటింగ్ జరగనుంది. గత కొద్దిరోజులుగా క్యాంపు రాజకీయాలు సైతం జోరుగా కొనసాగుతున్నాయి. అవిశ్వాస తీర్మానం నెగ్గి మేయర్ పీఠం దక్కించుకుంటామని టిడిపి బలంగా చెబుతోంది. ఎట్టి పరిస్థితుల్లో మేయర్ పదవిని నిలుపుకుంటామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం విశాఖ కార్పొరేటర్లకు సంబంధించి క్యాంపు రాజకీయం నడుస్తోంది. కొంతమంది కార్పొరేటర్ లను విదేశాలకు తరలించినట్లు ప్రచారం సాగుతోంది.
Also Read: విజయసాయిరెడ్డికి ఓకే.. చంద్రబాబుతో చర్చించనున్న బిజెపి పెద్దలు
* వైసిపి ఏకపక్ష విజయం
2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో( Municipal Elections) గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. 98 డివిజన్లో ఉన్న గ్రేటర్ విశాఖలో.. 58 డివిజన్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. టిడిపి 29 స్థానాలకు పరిమితం అయింది. జనసేన మూడు చోట్ల గెలిచింది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చాలామంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్లు కూటమి పార్టీల వైపు వచ్చారు. టిడిపి తో పాటు జనసేనలో అధిక సంఖ్యలో చేరారు. ఇప్పుడు కూటమి బలం పెరిగింది. దీనికి తోడు కూటమికి చెందిన ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు ఉన్నారు. ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా వారు సైతం ఓటింగ్ కు వచ్చే అవకాశం ఉంది.
* మాజీ మంత్రితో భేటీ..
ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress ) కార్పొరేటర్లను శిబిరాల కు తరలించినట్లు తెలుస్తోంది. అయితే ఉన్నట్టుండి మాజీ తిప్పల నాగిరెడ్డి కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిప్పల వంశి జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణను కలిసి చర్చలు జరపడం విశేషం. ప్రస్తుతం వంశీ సోదరుడు గాజువాక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా ఉన్నారు. ఆ కుటుంబానికి చెందిన కార్పొరేటర్ జనసేన లో చేరేందుకు సిద్ధపడుతుండడం ఇప్పుడు వైసీపీలో కలకలం రేపుతోంది. ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడు, ఆపై కీలక నేత సోదరుడు ఓటమి వైపు రాడానికి సిద్ధంగా ఉంటే.. మిగతా వారి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. అందుకే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం కూటమికి దక్కుతుందన్న విశ్లేషణలు ప్రారంభం అయ్యాయి.
* కూటమికి చిక్కిన కార్పొరేటర్లు..
విశాఖలో కూటమికి( Alliance ) అవసరమైన కార్పొరేటర్లు ఇప్పటికే చిక్కినట్లు సమాచారం. టిడిపి నేతలు సమావేశమై బలాబలాలు తెలుసుకొని అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చారని తెలుస్తోంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తగిన జాగ్రత్తలు తీసుకున్నా చాలామంది కార్పొరేటర్లు.. ముఖం చాటేసినట్లు సమాచారం. కొంతమంది బహిరంగంగానే తాము కూటమికి మద్దతు తెలుపుతామని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నీరు గారి పోయిందని.. ఈ నెల 19న జరిగే అవిశ్వాస తీర్మానం నెగ్గడం ఖాయమని విశాఖ వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.