TIMES NOW- ETG SURVEY : ఏపీలో ఎన్నికల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. రోజుకో సంస్థ సర్వే పేరుతో కీలక వివరాలు వెల్లడిస్తోంది.. అధికార వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని కొన్ని సంస్థలు.. లేదు లేదు ప్రతిపక్ష టీడీపీ కూటమే అధికారాన్ని దక్కించుకుంటుందని మరికొన్ని సంస్థలు సర్వే ఫలితాలను వెల్లడిస్తున్నాయి. ఇందులో కొన్ని పేరున్న సంస్థలు కూడా ఈ సర్వే ఫలితాలు వెల్లడించడం విశేషం… ఎన్నికల నేపథ్యంలో సర్వే సంస్థలు కూడా పార్టీల వారీగా విడిపోయినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే కొన్ని మీడియా సంస్థలు ఒక పార్టీకి అవకాశం ఉందని చెబుతుండగా.. మరికొన్ని సంస్థలు ఇంకో పార్టీకి మాత్రమే అధికారం దక్కుతుందని ప్రకటిస్తున్నాయి.. సర్వే సంస్థలు ఇచ్చే ఫలితాలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయా? దూరంగా ఉంటాయా? అనేది పక్కన పెడితే.. ఎన్నికల ముందు అవి వెల్లడించే ఫలితాలు కాస్త హడావిడి కి కారణమవుతాయి. అంతేతప్ప ప్రజల నాడిని మార్చలేవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అధికారం ఆ పార్టీదే
ఏపీలో ఎన్నికలకు కొంత సమయం ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు పోటాపోటీగా ప్రచార పర్వాన్ని సాగిస్తున్నాయి. పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి.. అయితే ఇవన్నీ వ్యక్తిగతమైన అంశాలను దాటిపోతుండడం అసలైన రాజకీయ వైచిత్రి. సరే ఇదంతా పక్కన పెడితే.. త్వరలో జరిగే ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారు అనే అంశంపై.. ఎవరు అత్యధికంగా పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటారనే విషయంపై టైమ్స్ నౌ- ఈటీజీ సంస్థ సర్వే నిర్వహించింది. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో ఈ సంస్థ శాంపిల్ సర్వే నిర్వహించినట్టు చెప్పుకుంది. దీని ప్రకారం వైసీపీ 21 నుంచి 22 వరకు పార్లమెంటు స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. టిడిపి, జనసేన, బిజెపి కూటమి మూడు నుంచి నాలుగు పార్లమెంటు స్థానాలు గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. గత ఎన్నికల్లో వైసిపి ఏకంగా 22 పార్లమెంటు స్థానాలు గెలుచుకుంది.. ఆ ఎన్నికల్లో టిడిపి మూడు స్థానాలకు మాత్రమే పరిమితమైంది. అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ 151 స్థానాలు గెలుచుకుంది. 23 స్థానాలు టిడిపి దక్కించుకుంది. ఒక్క స్థానంలో జనసేన విజయం సాధించింది.
ఇక త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి మళ్లీ అధికారంలోకి వస్తుందని టైమ్స్ నౌ సర్వే ప్రకటించింది. 110 నుంచి 130 వరకు ఆ పార్టీ స్థానాలు గెలుచుకొని మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేసింది. గత ఎన్నికల్లో 151 స్థానాలు గెలుచుకోగా.. ఈసారి అవి 20 వరకు తగ్గుతాయని టైమ్స్ నౌ సర్వే స్పష్టం చేసింది.. ఇదే సమయంలో ప్రతిపక్ష టీడీపీ కూటమి తన స్థానాలను మరింత మెరుగుపరుచుకుంటుందని వివరించింది.. జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఈసారి కూడా ఎంపీ సీట్లు గెలుచుకునేది కష్టమేనని టైమ్స్ నౌ సర్వేలో అభిప్రాయపడింది. వైయస్ షర్మిల కడప పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో.. ఆమె గెలిచేది అనుమానమేనని టైమ్స్ నౌ సర్వే స్పష్టం చేసింది..
ఈ సర్వేపై టిడిపి కూటమి నేతలు మండిపడుతున్నారు. మొదటినుంచి టైమ్స్ నౌ వైసీపీకి బాకాలు ఊదుతుందని… ఇప్పుడు కూడా అలాగే చేసిందని ఆ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు.. జాతీయ సర్వ సంస్థలు టిడిపి కూటమి అధికారంలోకి వస్తుందని చెప్తే.. దానికి పోటీగా.. జనాల మైండ్ సెట్ మార్చేందుకు వైసిపి నాయకులు సర్వే పేరుతో అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.. ఎవరు ఎన్ని జిమ్మిక్కులకు పాల్పడినా టిడిపి అధికారంలోకి వస్తుందని వారు చెబుతున్నారు.. ముందుగానే చెప్పినట్టు ఎన్ని సర్వే సంస్థలు ఎలాంటి ఫలితాలు ప్రకటించినా.. అంతిమంగా ఫలితాన్ని నిర్ణయించేది ప్రజలే.. అప్పటిదాకా ఇలాంటి సర్వే సంస్థలు ఎన్నో ఫలితాలను ప్రకటిస్తూనే ఉంటాయి.. వాటి పనే అది కాబట్టి.. మీడియాలో, సోషల్ మీడియాలో కాస్త చర్చ జరిగేందుకు అవి ఉపకరిస్తాయి. అంతే.. అంతకుమించి ఏమీ లేదు.
TIMES NOW- @ETG_Research Survey
Andhra Pradesh (Total Seats: 25) || Here are seat share projections-
– YSRCP: 21-22
– BJP: 0
– TDP+JSP: 3-4
– Others: 0Watch as @navikakumar shares more details. pic.twitter.com/CdIxog58lk
— TIMES NOW (@TimesNow) April 4, 2024