Two New Districts In AP: ఏపీలో( Andhra Pradesh) జిల్లాల విభజన పై ప్రాథమికంగా ఒక స్పష్టత వచ్చింది. రెండు కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు నాలుగు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు మంత్రివర్గ ఉప సంఘం ప్రభుత్వానికి నివేదించింది. ఏపీ సీఎం చంద్రబాబుతో ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం నిన్ననే జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం హాజరయ్యారు. ఈరోజు మరోసారి సమావేశం కానున్నారు. మరిన్ని మార్పులు, చేర్పులకు అవకాశం ఉంది. పూర్తిస్థాయిలో చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి రానున్నారు. అయితే ఇప్పటివరకు నాలుగు నుంచి ఆరు కొత్త జిల్లాలు ఏర్పాటు అవుతాయని ప్రచారం జరిగింది. కానీ దానిని తెరదించుతూ కొత్తగా రెండు జిల్లాల ఏర్పాటుకు సంబంధించి క్యాబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదన ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే 26 జిల్లాలు ఉన్న దృష్ట్యా.. ఎక్కువగా ఏర్పాటు చేస్తే చాలా రకాల ఇబ్బందులు వస్తాయని క్యాబినెట్ సబ్ కమిటీ గుర్తించింది.
Also Read: రవితేజ వల్లే మా తమ్ముడు కార్తీ కెరియర్ నిలబడింది : సూర్య…
* హేతుబద్ధత లేకపోవడంతో..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో జిల్లాల విభజన జరిగింది. ఉమ్మడి 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చింది. అయితే జిల్లాల విభజనలో హేతుబద్ధత పాటించలేదన్న విమర్శ ఉంది. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా కాకుండా రాజకీయ ప్రయోజనాలను ఆశించి జిల్లాలను విభజించారన్న విమర్శ ఉంది. అందుకే తాము అధికారంలోకి వస్తే దీనిపై దృష్టి పెడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రధానంగా మార్కాపురం, మదనపల్లి కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు కానుంది. అయితే అమరావతి తో పాటు పలాస, ఏజెన్సీలోని కొత్త జిల్లా ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు వచ్చాయి. అయితే వాటికి సమ్మతం కంటే అభ్యంతరాలు ఎక్కువగా వచ్చాయి. దీంతో ప్రభుత్వం రెండు కొత్త జిల్లాలతో పాటు నాలుగు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు మాత్రమే ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
* రెండు జిల్లాలకి నివేదిక..
నిన్న జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీ( cabinet Sub committee ) సమావేశంలో.. మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్ సబ్ కమిటీ నివేదించినట్లు తెలుస్తోంది. పుంగనూరు / పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకశిర కేంద్రాలుగా నాలుగు రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయాలని ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ సూచించింది. పది జిల్లాల్లోని రెవెన్యూ డివిజన్లు, మండలాల్లో మార్పులు చేర్పులను ప్రతిపాదించింది. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేట ఏర్పాటయ్యే అవకాశం ఉంది. మార్కాపురం కొత్త జిల్లా ఏర్పాటుతో అక్కడ గిద్దలూరు కేంద్రంగా మరో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది. ఈ కొత్త జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు కొనసాగున్నాయి. అద్దంకి డివిజన్ ఏర్పాటుతో ప్రకాశం జిల్లాలో నాలుగు డివిజన్లు ఉండనున్నాయి.
* మన్యంలో కొత్త జిల్లా లేనట్టే.. మన్యంలో( manyam) మరో కొత్త జిల్లా ఏర్పాటుకు అవకాశం లేదని తెలుస్తోంది. చింతూరు తో పాటు రంపచోడవరం డివిజన్ల పరిధిలోని చాలా గ్రామాలు జిల్లా కేంద్రమైన పాడేరుకు దూరంగా ఉంటాయి. అందుకే ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. కానీ చింతూరు రంపచోడవరం డివిజన్లతో జిల్లాను ఏర్పాటు చేస్తే అతి చిన్న జిల్లాగా మారే అవకాశం ఉంది. అందుకే ఆ రెండు డివిజన్లను తూర్పుగోదావరి జిల్లాలో కలిపేందుకు ప్రతిపాదించారు. అదే జరిగితే అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు రెవెన్యూ డివిజన్ మాత్రమే ఉంటుంది. 11 మండలాలకి పరిమితం అవుతుంది. అయితే పోలవరం ముంపు మండలాల ప్రజలకు ఏ నియోజకవర్గాల్లో పునరావాసం కల్పిస్తే.. ఆయా జిల్లాల్లో చేర్చే అవకాశం ఉంది. మరోవైపు పలాస, అమరావతి జిల్లాల ఏర్పాటు పై అభ్యంతరాలు రావడంతో ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ పక్కన పడేసినట్లు తెలుస్తోంది. ఈరోజు సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రుల సబ్ కమిటీతో మరోసారి సమావేశం కానున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు పై కీలక నిర్ణయాలు తీసుకొనున్నారు.