YCP: వైసీపీ ( YSR Congress )రాజ్యసభ సభ్యులు జంప్ చేస్తారా? పదవికి రాజీనామా చేస్తారా? విజయసాయిరెడ్డి మాదిరిగా అస్త్ర సన్యాసం చేస్తారా? పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. విజయసాయిరెడ్డి తో పాటు మరో ఇద్దరు ఎంపీలు రాజీనామా చేస్తారని తెగ ప్రచారం నడిచింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. అయితే రాజ్యసభ సభ్యుల రాజీనామా వ్యవహారం ఒక వ్యూహం ప్రకారం జరుగుతుందన్న అనుమానాలు ఉన్నాయి. ఏదైనా ప్రభుత్వ పరంగా ఇష్యూ వచ్చినప్పుడు డైవర్ట్ చేసేందుకు రాజ్యసభ సభ్యుల రాజీనామాను తెరపైకి తెస్తుంటారని.. గతంలో కూడా వైసిపి ఇదే ఫార్ములాను అనుసరించిందన్న టాక్ ఉంది. విజయసాయిరెడ్డి తో పాటు అయోధ్య రామిరెడ్డి సైతం పార్టీ మారుతారని అప్పట్లో టాక్ నడిచింది. కానీ తాను పార్టీ మారడం లేదని అయోధ్య రామిరెడ్డి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ సైతం స్పష్టమైన సంకేతాలు పంపారు. అయితే ఇప్పుడు వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులు ఎవరు రాజీనామా చేస్తారు? అన్నది హాట్ టాపిక్ అవుతోంది.
* క్రమేపీ తగ్గుతున్న బలం
ఏపీలో( Andhra Pradesh) వైసిపి అధికారానికి దూరం అయిన సమయంలో రాజ్యసభలో ఆ పార్టీ బలం 11. కానీ కొద్ది నెలల కిందట మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య రాజీనామాతో వైసీపీ రాజ్యసభ సభ్యుల సంఖ్య 8 కి పడిపోయింది. తాజాగా విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పడంతో ఆస్థానం ఏడుకు చేరింది. రెండు రోజుల కిందట విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యత్వాన్ని సైతం వదులుకున్నారు. స్వయంగా రాజ్యసభ చైర్మన్ కు తన రాజీనామా లేఖ అందించారు. వ్యక్తిగత కారణాలతోనే తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దీంతో చైర్మన్ ఆయన రాజీనామాను ఆమోదించారు. దీంతో వైసీపీకి రాజ్యసభలో బలం ఏడుకు దిగజారింది. అయితే వైసీపీకి చెందిన మరో ముగ్గురు నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీకి గుడ్ బై చెప్పవచ్చన్న ప్రచారం మాత్రం జరుగుతోంది. అయితే పార్టీ మారడం వెనుక వారి పదవీకాలం దోహదపడే అవకాశం ఉంది. ఓ ముగ్గురు వైసీపీ రాజ్యసభ సభ్యులకు ఏడాది కాలం మాత్రమే పదవి ఉన్నట్లు తెలుస్తోంది. వారి పదవీకాలం బట్టి.. వారిపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.
* నాలుగు పదవులకు ఎన్నికలు
2026 జూన్ 21న ఏపీ నుంచి నాలుగు ఎంపీ సీట్లకు ఎన్నికలు ఉంటాయి. వైసీపీకి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్( pilli Subhash Chandra Bose) , అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని ఈసారి రిటైర్ అవుతారు. అయితే సుమారుగా ఏడాదిన్నర మాత్రమే వీరి పదవీకాలం ఉంది. అయితే ఇందులో అయోధ్య రామిరెడ్డి పార్టీ మారుతారని తెగ ప్రచారం నడుస్తోంది. ఇక పరిమల్ నత్వాని అదానికి అత్యంత సన్నిహితుడు. పేరుకే వైసీపీ కానీ ఆయన బిజెపి సభ్యుడుగా కొనసాగుతుంటారు. అందుకే ఈ ముగ్గురిలో ఒకరు మాత్రమే పార్టీ మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
* జగన్ కు విధేయ నేత
2028 జూన్ 22న నిరంజన్ రెడ్డి( Niranjan Reddy) పదవీకాలం ముగుస్తుంది. అదే సమయానికి విజయసాయిరెడ్డి సైతం రిటైర్డ్ కావాల్సి ఉంది. కానీ ఆయన ఇటీవల పార్టీతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. నిరంజన్ రెడ్డి పేరు మోసిన న్యాయవాది. పైగా జగన్ కు అత్యంత విధేయుడు. జగన్ కేసులు వాదిస్తున్న లాయర్ కావడంతో ఆయన సైతం పార్టీలోనే కొనసాగుతారని తెలుస్తోంది. పైగా రాష్ట్రవ్యాప్తంగా నడుస్తున్న వైసీపీ లీగల్ టీంకు ఆయనే బాధ్యతలు చూస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఢిల్లీ సర్కిల్లో కూడా వైసిపికి కీలకంగా మారారు.
* ఆ ముగ్గురికి ఐదున్నర ఏళ్ల పదవి
అయితే ఓ ముగ్గురికి మాత్రం ఇంకా ఐదున్నర ఏళ్లపాటు పదవీకాలం ఉంది. 2030 ఏప్రిల్ ఒకటి వరకు వై వి సుబ్బారెడ్డి( YV Subba Reddy) , మేడ రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబురావు పదవిలో ఉంటారు. అయితే ఇందులో వైవి సుబ్బారెడ్డి జగన్ కు స్వయానా బాబాయ్. ఆయన పార్టీ మారే సాహసం చేయరు. మరోవైపు మేడ రఘునాథ్ రెడ్డితోపాటు గొల్ల బాబురావులు పార్టీ మారే ఛాన్స్ ఉందన్న ప్రచారం నడుస్తోంది. అంటే ఈ పరిస్థితి చూస్తుంటే వైసీపీకి ముగ్గురు రాజ్యసభ సభ్యులు మాత్రమే మిగిలే ఛాన్స్ కనిపిస్తోంది. ఆ సంఖ్య ఒకటికి చేరుకున్న ఆశ్చర్యపడాల్సిన పని లేదన్న టాక్ వినిపిస్తోంది.