Deputy CM Pawan Kalyan: ఏపీలో పల్లెపాలనపై దృష్టి పెట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణాభివృద్ధి పై ఫుల్ ఫోకస్ పెట్టారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవితో పాటు హోం శాఖను దక్కించుకుంటారని అంతా ప్రచారం జరిగింది. కానీ తనకు ఇష్టమైన పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలనుదక్కించుకున్నారు పవన్. గత మూడు నెలలుగా ఆ శాఖలపై సమీక్ష చేశారు. సమస్యలను గుర్తించారు. వాటి పరిష్కార మార్గానికి చేపట్టాల్సిన చర్యలను త్వరితగతిన తీసుకుంటున్నారు. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంచాయితీల్లో ఏకకాలంలో గ్రామసభలు నిర్వహించారు. ప్రజాపయోగ పనులను గుర్తించారు. ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకొని నివేదికలు రూపొందించారు. వాటిని అనుసరించి పనులు చేపట్టాలని నిర్ణయించారు. తాజాగా అలా గుర్తించిన పనులను సత్తురమే మొదలు పెట్టాలని సంబంధిత అధికారులను డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించారు. పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో పవన్ ప్రత్యేకంగా సమీక్షించారు. ముఖ్యంగా 15వ ఆర్థిక సంఘం, గ్రామ సభల్లో ఆమోదించిన పనుల ప్రారంభం గురించి కీలక చర్చలు జరిపారు. రాష్ట్రవ్యాప్తంగా 13,326 పంచాయితీల్లో గ్రామసభలు జరిగాయని.. అక్కడ ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి పనులకు ఆమోదముద్ర వేసినట్లు అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు. అయితే ఎటువంటి జాప్యం లేకుండా పనులు ప్రారంభించాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
* నిధుల రాక ప్రారంభం
రాష్ట్రంలో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి నిధుల రాక ప్రారంభమైంది. 15వ ఆర్థిక సంఘం నుంచి రూ. 1987 కోట్లు, ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రూ. 4500 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించింది. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం పవన్ అధికారులతో సమీక్షలు జరిపారు.అక్టోబర్ 14 నుంచి అభివృద్ధి పనులు మొదలు పెట్టాలని ఆదేశించారు.ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. ఆ పనులను నిత్యం పర్యవేక్షించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు.
* దసరా తరువాత పనులు
దసరా అనంతరం గ్రామాల్లో పనులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 20 వరకు పండగ వాతావరణం లో పనులను ప్రారంభించాలని పవన్ ఆదేశించారు. ఆయా గ్రామాల ప్రజలను భాగస్వామ్యం చేయాలని కూడా సూచించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను సైతం పిలవాలని అధికారులకు ఆదేశించారు.మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధిత వెబ్సైటు, డాష్ బోర్డును సైతం ప్రారంభించారు. గ్రామాల్లో చేపట్టిన పనుల విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించారు. ముఖ్యంగా నాణ్యతకు పెద్దపీట వేయాలన్నారు.
* పట్టుదలతో పవన్
గ్రామీణాభివృద్ధి విషయంలో పవన్ పట్టుదలతో ఉన్నారు. ఒకేరోజు 13326 పంచాయితీల్లో ఏకకాలంలో గ్రామసభలు నిర్వహించగలరు. ప్రపంచస్థాయి గుర్తింపును పొందారు. గతంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అంతంత మాత్రమే నిధులు కేటాయించేవారు. కానీ పవన్ మాత్రం 100% నిధులు పెంచుతూ అందించారు. ఆర్థిక సంఘం నిధులను నేరుగా పంచాయతీలకే కేటాయించాలని తీర్మానించారు. ఒక్క రూపాయి కూడా వేరే పథకాలకు మళ్లించకుండా పవన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభం అవుతుండడంతో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.