AP  Budget : ఒక్క ఏడాదిలో రెండు బడ్జెట్లు.. ఏపీ చరిత్రలో ఇది తొలిసారి.. సాహసం చేసిన చంద్రబాబు సర్కార్*

పాలనలో బడ్జెట్ కీలకం. బడ్జెట్ కేటాయింపులు చేయనిదే పనులు జరగవు. అందుకే ఏ ప్రభుత్వమైనా బడ్జెట్ కు అత్యంత ప్రాధాన్యమిస్తుంది. కానీ ఏపీ చరిత్రలోనే ఒకే ఏడాది రెండు బడ్జెట్లు విడుదల కావడం విశేషం.

Written By: Dharma, Updated On : July 31, 2024 11:59 am
Follow us on

Ap Budget : సాధారణంగా ఎన్నికలకు ముందు ఓటాన్ బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఆనవాయితీ.ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. దీంతో ముందుగానే ఓటాన్ బడ్జెట్ వైసీపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. స్వల్ప కాలానికి బడ్జెట్ ప్రవేశపెడతారు. ఎన్నికల ఫలితాల అనంతరం కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయిలో వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం భిన్నమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఓటాన్ బడ్జెట్ కే మొగ్గు చూపింది. ఎన్నికల్లో పెద్ద ఎత్తున హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించిన విషయం విధితమే. అందుకే ఈ పథకాలకు సంబంధించి ఖర్చు, అంచనాలు రూపొందించుకునేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే ఓటాన్ బడ్జెట్ కే చంద్రబాబు సర్కార్ ఆమోదముద్ర వేసింది. వాస్తవానికి మొన్నటి అసెంబ్లీ సమావేశాలు ఓటాన్ బడ్జెట్ కోసమే అని అంతా భావించారు. కానీ సమావేశాలు చివరి వరకు బడ్జెట్ను ప్రవేశ పెట్టలేదు. దీంతో కొద్దిపాటి విమర్శలు కూడా వ్యక్తం అయ్యాయి. ఓటాన్ బడ్జెట్ కూడా పెట్టుకోలేని స్థితిలో టిడిపి కూటమి ప్రభుత్వం ఉందని వైసిపి ఎద్దేవా చేసింది. అయితే దీనిని పక్కన పెడితే.. ఏపీ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఆర్డినెన్స్ జారీ చేసింది. మంత్రుల నుంచి ఆన్లైన్లో ఆర్డినెన్స్ కు ఆమోదం తీసుకుంది. ఆ తరువాత గవర్నర్ ఆమోదం కోసం ఆర్డినెన్స్ ను పంపింది. గత ప్రభుత్వం పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పరిమితి బుధవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే నాలుగు నెలల కాలానికి కూటమి ప్రభుత్వం ఓటాన్ బడ్జెట్ ఆర్డినెన్స్ కు ఆమోదం తీసుకుంది.

* రూ. 1.30 లక్షల కోట్లతో ఆమోదం
సుమారు రూ.1.30 లక్షల కోట్లతో ఈ బడ్జెట్ ఆర్డినెన్స్ ను జారీ చేసింది. 40 విభాగాలకు చెందిన డిమాండ్లు, గ్రాంట్లకు ఆమోదం లభించేలా బడ్జెట్ రూపొందించింది. అన్న క్యాంటీన్ల నిర్మాణం, రహదారుల మరమ్మత్తులు,అత్యవసర విభాగాలకు బడ్జెట్ కేటాయింపులు చేసింది. రోడ్ల మరమ్మతులకు 1100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఇప్పటికే అధికారులు అంచనా వేశారు. ఆగస్టు 15 నుంచి అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మరికొన్ని కీలకమైన కేంద్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్ కు నిధులు కేటాయించినట్లు తెలుస్తోంది.

* రెండు ప్రభుత్వాల హయాంలో
ఏపీ చరిత్రలోనే ఒకే ఏడాదిలో రెండుసార్లు ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఆర్థిక పరిస్థితి పై స్పష్టత వచ్చేందుకు మరో రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే సెప్టెంబర్ నెలలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.అప్పటికి పాలన కొంత గాడిలో పడుతుంది. ప్రభుత్వ ఆదాయ వ్యయాలు తెలిసే అవకాశం ఉంది. అంతవరకు ఓటాన్ బడ్జెట్ తోనే సర్దుబాటు చేసుకోవాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది.

* ఆదాయ ఖర్చుల అంచనాకే
ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ పథకాలను అమలు చేయాల్సి ఉంది. అయితే 50 రోజుల పాలన పూర్తయిన ఒక్క పింఛన్ల పథకం తప్పించి.. ఏ సంక్షేమ పథకం పట్టాలెక్కలేదు. సంక్రాంతి తరువాతనే కీలక పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. అంతవరకు ఓటాన్ బడ్జెట్ తోనే ముందుకెళ్తారని తెలుస్తోంది. కానీ దీనిపై విమర్శలు వ్యక్తం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే సంక్షేమ పథకాల అమలు విషయంలో వైసిపి విమర్శలు ప్రారంభించింది. ఈ విషయంలో ప్రభుత్వం కొంత ఆలోచన చేయకపోతే నష్టం జరిగే అవకాశం ఉంది.