Chandrababu: చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి 18 రోజులు గడుస్తోంది. అక్టోబర్ 5 వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. ఇటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు తలుపును చంద్రబాబు తట్టారు. క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో తీర్పు పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తప్పకుండా చంద్రబాబుకు ఉపశమనం లభిస్తుందని తెలుగుదేశం పార్టీ ఆశిస్తోంది. కానీ కింది కోర్టుల తీర్పు రిపీట్ అయ్యే అవకాశాలు సైతం ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సుప్రీంకోర్టు విచారణలో మూడు రకాలు తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబుపై నమోదైన కేసులు కొట్టివేత, లేకుంటే చంద్రబాబు ఒక్కరికే కేసు నుంచి విముక్తి, లేకుంటే కింది కోర్టులు చెబుతున్నట్టుగా విచారణ కొనసాగించడం.. ఈ మూడు అంశాలపైనే తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయని న్యాయ కోవిదులు భావిస్తున్నారు. కానీ చంద్రబాబు తరుపు న్యాయవాదులు మాత్రం సాంకేతిక అంశాలను చుట్టూనే తమ వాదనలు వినిపిస్తున్నారు. కేవలం సెక్షన్ 17 ఏ ప్రకారం చంద్రబాబు అరెస్ట్ విషయంలో గవర్నర్ అనుమతి తీసుకోలేదని మాత్రమే పిటీషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో తమ వాదనలు ఎలా వినిపిస్తారు అన్నది ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.
చంద్రబాబుకు ఇదే చిట్ట చివరి అవకాశం. అసలు తనను టచ్ చేయలేరని చంద్రబాబు భావించారు. ఒకవేళ అరెస్టు చేసినా గంటల వ్యవధిలో బయటకు రావచ్చని దీమా గా ఉండేవారు. కానీ చంద్రబాబు అనుకున్నది రివర్స్ అయ్యింది. ఏకంగా రిమాండ్ లో పెట్టి రోజులు సైతం పొడిగిస్తూ వస్తున్నారు. బెయిల్ అన్నదే లేకుండా చేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయ్యింది మొదలు.. ఎంతవరకు కేసుల కొట్టివేత పైనే ఫోకస్ చేశారు కానీ.. బెయిల్ పై దృష్టి పెట్టలేదు. అది వ్యూహాత్మకమా? లేకుంటే తప్పిదమా? అన్నది పక్కన పెడితే చంద్రబాబు రిమాండ్ పక్షం రోజులు దాటడం మాత్రం స్వయంకృతాపమే.
సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టివేతకు గురైతే.. చంద్రబాబు ఇప్పట్లో బెయిల్ పై బయటకు వచ్చే అవకాశాలు లేవు. చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసింది క్వాష్ పిటిషన్ మాత్రమే. కేవలం తనపై మోపిన సెక్షన్లు, కేసులు చెల్లవని మాత్రమే చంద్రబాబు తరఫున న్యాయవాదులు వాదిస్తున్నారు. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఇప్పటికే దీనిపై కేసులను నమోదు చేసింది. నిందితులను అరెస్టు చేసింది. అందులో దొరికిన లూప్ హోల్స్ తోనే సిఐడి చంద్రబాబును అరెస్టు చేయగలిగింది. ఇటువంటి సమయంలో కేసుల కొట్టివేత కంటే బెయిల్ తెచ్చుకోవడమే ఉత్తమమని న్యాయ కోవిదులు చెబుతున్నారు. చంద్రబాబు మాత్రం ఎన్నికల ముంగిట క్వాష్ పిటిషన్ తో బయటపడితే ఇక రాష్ట్ర ప్రభుత్వం తనను టచ్ చేయలేదని భావిస్తున్నారు. అందుకే అంతటి సాహసానికి దిగుతున్నారు.