Data Centers: అభివృద్ధిని సానుకూల కోణంలో చూడాలి. అలాకాకుండా రంద్రాన్వేషణ చేస్తే ప్రతిదీ కూడా తప్పులాగానే కనిపిస్తుంది. ప్రస్తుతం ఏపీలో వైసిపి చేస్తోంది కూడా ఇదే. విశాఖపట్నంలో google డాటా సెంటర్ ఏర్పాటును స్వాగతించాల్సింది పోయి.. ఇందులో కూడా రాజకీయాన్ని చూసింది. గూగుల్ డేటా సెంటర్ పై సానుకూల ధోరణి ప్రదర్శించకుండా.. చంద్రబాబు మీద.. లోకేష్ మీద విమర్శలకు దిగింది. అంతేకాదు గూగుల్ డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు రావని.. పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుందని.. ఉపద్రవం ముంచుకొస్తుందని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాన్ని మొదలుపెట్టింది.
వైసిపి చేస్తున్న ప్రధాన ఆరోపణ డాటా సెంటర్ వల్ల ఉద్యోగాలు రావని.. వాస్తవానికి ఒక ఐటీ కేంద్రం ఏర్పడితే దానికి అనుబంధంగా ఎన్నో పరిశ్రమలు వస్తుంటాయి. మౌలిక వసతులు మెరుగవుతాయి. హోటల్స్, పరిశ్రమలు ఏర్పాటు అవుతాయి. రవాణా వ్యవస్థ విస్తరిస్తుంది. విద్యుత్ సరఫరా మరింత మెరుగవుతుంది. ఉదాహరణకు హైదరాబాదులోని రాయదుర్గం ప్రాంతంలో ఐటీ కంపెనీలు ఏర్పాటు కాకముందు ఆ ప్రాంతం శివారుగానే ఉండేది. కానీ ఇప్పుడు ఆ ప్రాంతం ఒక సిలికాన్ వ్యాలీగా రూపాంతరం చెందుతోంది. అక్కడ ఎకరం భూమి విలువ వందల కోట్లకు చేరుకుంది. భవిష్యత్తు కాలంలో అక్కడ భూమి దొరకడమే గగనం అవుతుందని అంచనాలు ఉన్నాయి. రేపటి నాడు విశాఖపట్నంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు.
ఇక డేటా సెంటర్ల నిర్వహణకు సంబంధించి భారీగానే మీరు అవసరం పడుతుంది. ఎందుకంటే డేటా సెంటర్లలో వేలాది సర్వర్లు ఉంటాయి. స్టోరేజ్ డివైస్లు కూడా ఉంటాయి. నెట్వర్కింగ్ పరికరాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి నిత్యం పనిచేస్తూనే ఉండాలి. అందువల్లే అక్కడ అత్యధిక ఉష్ణోగ్రత ఉంటుంది. ఆ ఉష్ణోగ్రతను తగ్గించే పని చేయకపోతే హార్డ్వేర్ ఫెయిల్ అవుతుంది. కొన్ని సందర్భాలలో అగ్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. ఒక పెద్ద డేటా సెంటర్ ప్రతిరోజు మెగావాట్ల విద్యుత్ స్వీకరిస్తుంది. ఐదు లక్షల గ్యాలన్ల వరకు నీటిని తీసుకుంటుంది. చిల్లర్స్, లిక్విడ్ కూలింగ్, నీటి ఆవిరి, కూలింగ్ టవర్లను ఉపయోగించి డాటా సెంటర్ టెంపరేచర్ తగ్గిస్తారు. అయితే ఇటీవల కాలంలో విద్యుత్ వినియోగంలో గ్రీన్ ఎనర్జీ ఉపయోగించాలని గూగుల్ నిర్వహించినట్టు తెలుస్తోంది. ఆ ప్రకారం చేసుకుంటే పర్యావరణం మీద పెను ప్రభావాన్ని తగ్గించినట్టే. దానికి తోడు నీటి వినియోగంలో సైతం పొదుపును పాటించాలని గూగుల్ భావిస్తోంది. అది కూడా కార్యరూపం దాల్చితే పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ ఈ విషయాలను పక్కనపెట్టి వైసిపి ఫేక్ ప్రచారం చేస్తోంది. దీనివల్ల ఏపీలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు వెనక్కి వెళ్ళిపోతారు. ఇప్పటికే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఏపీ అన్ని విభాగాలలో నష్టపోయింది. ఇప్పుడిప్పుడే దారిలో పడుతున్న రాష్ట్రాన్ని వైసిపి మళ్ళీ గందరగోళం లోకి నెట్టే ప్రయత్నం చేస్తోంది.