AP new districts: ఏపీలో( Andhra Pradesh) జిల్లాల ఏర్పాటు పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఈరోజు కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యింది. గతంలో రెండు జిల్లాలతో పాటుగా కొత్తగా మరో జిల్లాకు కూడా ఆమోదం తెలిపింది మంత్రివర్గం. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతోంది. 2022లో వైసిపి కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. పార్లమెంటరీ నియోజకవర్గాల ప్రాతిపదికన ఈ కొత్త జిల్లాల ఏర్పాటు జరిగింది. అప్పట్లో టిడిపి నుంచి అభ్యంతరాలు వచ్చినా పరిగణలోకి తీసుకోలేదు. అయితే తాము అధికారంలోకి వస్తే జిల్లాల పునర్విభజన చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఇప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి నివేదికలు తీసుకున్నారు. ఎటువంటి సాంకేతిక పరమైన ఇబ్బందులు రాకుండా ఈ కొత్త జిల్లాల ఏర్పాటును ముందుకు తీసుకెళ్ళనున్నారు.
కొత్తగా రంపచోడవరం..
గతంలో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో 25 జిల్లాలకు తోడు.. మరో రెండు జిల్లాలు అంటే మార్కాపురం, మదనపల్లి జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ తాజాగా మన్యం జిల్లా జిల్లాలో ఉన్న రంపచోడవరం కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటుకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఈరోజు మార్కాపురం, మదనపల్లి, రంపచోడవరం జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్ అంగీకారం తెలిపింది. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని కొత్తగా ఏర్పడే మదనపల్లె జిల్లాకు మారుస్తున్నారు. రాజంపేట ను కడపలో కలుపుతున్నారు. వీటితో పాటు రైల్వే కోడూరు ను తిరుపతి జిల్లాలో కలపాలని క్యాబినెట్ నిర్ణయించింది.
మంత్రి ఎమోషన్.. రాయచోటి( Rayachoti) నియోజకవర్గం ఇప్పటివరకు అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉంది. దానిని తీసుకెళ్లి మదనపల్లి జిల్లాలో కలపడంతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఎమోషన్ అయ్యారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న అన్నమయ్య జిల్లా.. తన సొంత నియోజకవర్గంలో రాయచోటి గురించి మంత్రి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన కన్నీటి పర్యంతం అయ్యారు. సీఎం చంద్రబాబు ఆయనను ఓదార్చారు. రాయచోటి అభివృద్ధి బాధ్యత నాది అంటూ సముదాయించారు. మొత్తానికి అయితే ఏపీలో మరో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించడం విశేషం. అయితే మంత్రివర్గం ఆమోదం నేపథ్యంలో ఈ నెల 30న.. జిల్లాల పునర్విభజనపై తుదినోటిఫికేషన్ జారీ చేసి అవకాశం కనిపిస్తోంది.