Kodali Nani: వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని సంచలన ప్రకటన చేశారు. పార్టీ శ్రేణులను ఆందోళనలో ముంచెత్తారు. ప్రత్యర్థులను సైతం ఆశ్చర్యపరిచారు. వచ్చే ఎన్నికలే తనకు చివరివని తేల్చి చెప్పారు. 2029 ఎన్నికల్లో పోటీ చేయబోనని కూడా స్పష్టం చేశారు. సరిగ్గా ఎన్నికల ముంగిట కొడాలి నాని ఈ తరహా ప్రకటన చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన కామెంట్స్ వెనుక కారణం ఏమై ఉంటుందా? అన్న అనుమానం అందర్నీ వెంటాడుతోంది. ఒకవైపు ఆయన ఆరోగ్యం పై రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే కొడాలి నాని కామెంట్స్ సంచలనంగా మారుతున్నాయి.
2004 ఎన్నికల నుంచి గుడివాడ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న కొడాలి నాని గెలుపొందుతూ వస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో కొడాలి నానిని ఓడించడానికి చంద్రబాబు చాలా రకాలుగా ప్రయత్నించారు. కానీ అనుకున్నది సాధించలేకపోయారు. అటువంటి నేత ఇప్పుడు రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కొద్దిరోజుల కిందట నాని అనారోగ్యానికి గురైనట్లు వార్తలు వచ్చాయి. అప్పట్లో ఆయనే స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అదంతా ఎల్లో మీడియా సృష్టి అని నాని ఆరోపించారు. అందులో ఎంత మాత్రం నిజం లేదని తేల్చి చెప్పారు. అటువంటి నాని ఇప్పుడు వయసు దృష్ట్యా తాను రిటైర్ అవుతానని ప్రకటించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
నానికి రాజకీయ వారసుడు లేడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారికి రాజకీయాలపై ఎంత మాత్రం ఆసక్తి లేదు. ఈ తరుణంలో నాని తమ్ముడు కుమారుడ్ని వారసుడిగా ప్రకటిస్తారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అదే విషయాన్ని నాని ప్రకటించారు. నా సోదరుడి కుమారుడికి ఆసక్తి ఉంటే 2029 ఎన్నికల్లో బరిలోదింపుతానని చెప్పుకొచ్చారు.అయితే తాను మాత్రం వయసు దృష్ట్యా తప్పుకుంటానని నాని చెప్పడం కాస్త ఆశ్చర్యం వేస్తోంది.’ప్రస్తుతం నా వయసు 53 ఏళ్లు. వచ్చే ఎన్నికల నాటికి 58 ఏళ్లు వస్తాయి. ఆ వయసులో నేను ఎన్నికల్లో పోటీ చేయలేను. అందుకే 2029 ఎన్నికలకు దూరంగా ఉంటా’నని కొడాలి నాని ప్రకటించారు.
అయితే కొడాలి నాని నిర్ణయం సహేతుకంగా లేదు. చాలామంది నేతలు ఏడు పదుల వయసులో కూడా రాజకీయం చేస్తున్నారు. ఈ లెక్కన మరో 15 సంవత్సరాల పాటు నాని రాజకీయం చేయగలరు. కానీ 58 సంవత్సరాలకే రిటైర్మెంట్ తీసుకుంటానని నాని ప్రకటించడం వెనుక బలమైన కారణాలు ఉన్నట్లు చర్చ నడుస్తోంది. ఒకవేళ టిడిపి అధికారంలోకి వస్తే నానికి ఇబ్బందికర పరిణామాలు తప్పవు. అందుకే ఈ తరహా ప్రకటన చేసి ఉంటారని అనుమానం ఉంది. మరోవైపు ఈ ఎన్నికల్లో పార్టీ టికెట్ దక్కుతుందా? లేదా అన్న చర్చ నడుస్తోంది. అందుకే హై కమాండ్ పై ఒత్తిడి పెంచే భాగంలో ఇలా ప్రకటన చేసి ఉంటారని ఆయన అభిమానులు భావిస్తున్నారు. మొత్తానికైతే కొడాలి నాని నిర్ణయం సొంత పార్టీ శ్రేణులను కాదు ప్రత్యర్థులను సైతం విస్మయపరుస్తోంది.