Deepavali : పేరు దీపావళి.. ఆ ఊరికి అల్లుడైతే బంపర్‌ ఆఫర్‌.. ఎక్కడుందో తెలుసా..?

దీపావళి.. ఈ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది అతిపెద్ద పండుగ. దీపా కాంతులు.. టపాసుల మోదతలు.. మిఠాయిలు, పిండి వంటలు. కొత్త బట్టలు. అందరికీ తెలిసిన దీపావళి ఇదే. కానీ.. ఓ ఊరి పేరు కూడా దీపావళి.

Written By: Raj Shekar, Updated On : October 30, 2024 9:11 pm

Deepavali

Follow us on

Deepavali :  దీపావళి పండుగ రానే వచ్చింది. దేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా వేడుకలు ప్రారంభమయ్యాయి. అయోధ్యలో బుధవారం(అక్టోబర్‌ 30న) దీపోత్సవం నిర్వహించారు. గిన్నిస్‌ రికార్డు సృష్టించారు. ఇక దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ దీపావళి సంబురాలు జరుపుకుంటున్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా, నరకాసురున్ని సత్యభామ వధించిన సందర్భంగా దీపావళి జరుపుకుంటారు. అయితే దీపావళి అనేది ఓ ఊరి పేరు కూడా ఆ ఊరు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంది. మరి ఆ ఊరికి దీపావళి అని ఎందుకు పేరు వచ్చింది.. ఆ ఊరికి ఉన్న ప్రత్యేకతలు ఏమిటి అనే వివరాలు తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం శ్రీకాకళం జిల్లాలో దీపావళి అనే గ్రామం ఉంది. దీనికి ఓ చరిత్ర కూడా ఉంది. శ్రీకాకుళం జిల్లా గార మండలం దీపావళి గ్రామం ఉంది. ఇక్కడ ఐదు రోజులు దీపావళి పండుగ జరుపుకుంటారు. తమ పూర్వీకులను పూజించిన తర్వాతనే ఈ పండుగ జరుపుకుంటామని గ్రామస్తులు తెలిపారు. ఇక ఈ గ్రామానికి ప్రత్యేకమైన సంప్రదాయం వెను ఓ ఆసక్తికరమైన కథనం కూడా ఉంది. పూర్వంలో శ్రీకాకుళంలో ఓ రాజు ఉండేవాడు. అతను ఈ గ్రామం మీదుగా వెళ్లూ శ్రీకూర్మనాథ్‌ ఆలయాన్ని సందర్శించాడు. తర్వాత తిరిగి వస్తుండగా స్పృహ తప్పి పడిపోయాడు. గ్రామస్తులు అతడికి సపర్యలు చేశారు. దీపాలు వెలిగించారు. రాజుకు స్పృహ వచ్చిన తర్వాత ఆ ఊరిపేరు అడిగాడు. ఈ గ్రామానికి పేరు లేదని స్థానికులు తెలిపారు. దీంతో రాజు మీరు నాకు దీపాల వెలుగుతో సేవ చేశారు. కాబట్టి ఈ ఊరికి దీపావళి అని పేరు పెడుతున్నా అని ప్రకటించారు. అప్పటి నుంచి గ్రామం పేరు దీపావళిగా పిలుస్తున్నారు.

ఐదు రోజులు పండుగ..
ఇక దీపావళి గ్రామంలో దీపావళి పండుగను ఐదు రోజులు జరుపుకుంటారు. పండుగ రోజు తెల్లవారుజామున నిద్రలేచి పూజలు, పితృకర్మలు చేస్తారు. ఇక్కడి ఎక్కువగా సోనాడి కమ్యూనిటీ ప్రజలు ఉంటారు. దీపావళి పండుగ రోజు వీరంతా పితృపూజ చేసి తమ పూర్వీకుల దీవెనలు పొందుతారు. కొత్త బట్టలు ధరిస్తారు. దీపావళి సమయంలో, సంక్రాంతినాడు చేసినట్లే తమ అత్తమామల ఇంటికి వచ్చిన అల్లుడికి స్వాగతం పలుకుతారు. ప్రత్యేక ఆచారాలు పాటిస్తారు. పండుగకు వచ్చే కొత్త అల్లుడికి ప్రత్యేకంగా బట్టలు పెట్టి సకల మర్యాదలు చేస్తారు. అయితే చాలాకాలంగా ఈ గ్రామానికి ఉన్న ప్రత్యేక పేరు కారణంగా వార్తల్లో నిలుస్తోంది. దీపావళి పండుగ వచ్చినప్పుడల్లా గుర్తు చేసుకుంటారు. ప్రస్తుతం దీపావళి గ్రామంలో జనాభా వెయ్యి.