AP Elections 2024: ఏపీలో గతంలో లేనివిధంగా పోస్టల్ బ్యాలెట్ చుట్టూ వివాదం నడుస్తోంది. గత 15 రోజులుగా వైసిపి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల చెల్లుబాటుపై గట్టిగానే పోరాటం చేస్తోంది. అయితే గత అనుభవాల దృష్ట్యా వైసిపి దీనిపై పోరాటం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈసారి టఫ్ ఫైట్ నడుస్తోంది. ఎవరు గెలిచినా తక్కువ మెజారిటీతోనే అన్న అంచనాలు ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఒకవైపు మొగ్గు చూస్తే మాత్రం ప్రత్యర్థులకు ప్రమాదకరమే. 2019 ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు సృష్టించిన సునామీ వైసీపీకి తెలియంది కాదు. అందుకే ఆ పార్టీ కలవర పడుతోంది. వీలైనంతవరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లుబాటు కాకుండా ఉంటే సేఫ్ జోన్ లోకి వెళతామని భావిస్తోంది.
ఈసారి భారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు అయ్యాయి. దాదాపు నాలుగున్నర లక్షలకు పైగా ఓట్లు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. సాధారణంగా ప్రతి ఎన్నికల్లో లక్షన్నర ఓట్లు మాత్రమే నమోదు అయ్యేవి. అయితే ఈసారి ఉద్యోగ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేశారు. గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలతో బాధిత వర్గాలుగా మిగిలిపోయారు ఉద్యోగ ఉపాధ్యాయులు. అందుకే ఈసారి వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని బలంగా నిర్ణయం తీసుకున్నారు. ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా క్యూలైన్లలో నిల్చొని మరి ఓటు వేశారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లను గమనిస్తే… ప్రతి నియోజకవర్గంలో నాలుగువేల వరకు ఓట్లు నమోదయినట్లు తెలుస్తోంది. వైసిపి పై వ్యతిరేకతతో టిడిపి కూటమి వైపు మొగ్గు చూపినట్టు అంచనాలు ఉన్నాయి.ఇదే వైసీపీకి ఆందోళన కలిగించే విషయం.
గత ఎన్నికల్లో నాలుగు వేల లోపు మెజారిటీతో వైసిపి గెలిచిన 15 స్థానాలు ఉన్నాయి. 10000 లోపు మెజారిటీతో గెలిచిన స్థానాలు మరో 30 వరకు ఉన్నాయి. నెల్లూరు రూరల్, శ్రీకాకుళం, విజయనగరం, గూడూరు, తాడికొండ వంటి నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లే గత ఎన్నికల్లో గెలుపోటములను నిర్దేశించాయి. గత టిడిపి ప్రభుత్వం ఉద్యోగులకు ఎంతో కొంత ప్రయోజనం చేకూర్చుతూ నిర్ణయాలు తీసుకుంది. కానీ వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.పైగా వారి హక్కులను కాల రాసింది.సక్రమంగాజీతాలు కూడా అందించలేకపోయింది. ఈ పరిణామాలన్నీ ఉద్యోగ ఉపాధ్యాయుల్లో వైసీపీ పై వ్యతిరేకతను పెంచాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత ఒకవైపు.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఒకవైపు పడితే తమకు ఇబ్బందికర పరిస్థితులు తప్పవని వైసీపీ భావిస్తోంది. అందుకే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల చెల్లుబాటు విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే ఈ నేపథ్యంలో చీఫ్ ఎలక్షన్ కమిషన్.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల చెల్లుబాటు విషయంలో ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. దీంతో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.