Amaravathi capital :విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలతో అతలాకుతలం అయింది. లక్షలాదిమంది నిరాశ్రయులు అయ్యారు. ఇప్పటికీ శివారు ప్రాంతాలు వరద ముంపు లోనే ఉన్నాయి. లక్షలాది మంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు కృష్ణానది ఉప్పొంగి ప్రవహిస్తోంది. రికార్డు స్థాయిలో ప్రవహిస్తుండడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అమరావతి రాజధాని పరిస్థితి ఎలా ఉంది? ఆ ప్రాంతం మొత్తం మునిగిపోయిందా? అన్న ఆసక్తికర చర్చ సాగుతోంది. విజయవాడకు వరదలు అంటే.. అమరావతి సైతం మునిగిపోయి ఉంటుందని ఒక ప్రచారం మొదలైంది. కొందరైతే ఏకంగా వీడియోలు పెట్టి గ్రౌండ్ రిపోర్ట్ ఇది అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. మొత్తం అమరావతి అన్నది లేదని.. పూర్తిగా వరద నీటితో మునిగిపోయిందని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వేల అసలు నిజం ఏంటి? నిజంగా అమరావతి మునిగిందా? లేదా? అన్న విషయాలను పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజధాని అమరావతికి తాజాగా చుట్టుముట్టిన వరద ముప్పు లేదు. రాష్ట్ర పాలనకు కీలకమైన సచివాలయం వరద ముప్పు నుంచి సేఫ్ గా ఉంది. ఎమ్మెల్యే, ఐఏఎస్ అధికారుల నివాసాల వద్ద కూడా ముంపు పరిస్థితి లేదు. వచ్చిన వరద వచ్చినట్లుగా కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణానది లోకి వెళ్లిపోతోంది. అయినా సరే అమరావతి వరదలో చిక్కుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ శ్రేణులు అదే పనిగా ప్రచారం చేస్తున్నాయి. అమరావతి అనేది ప్రమాదకర పరిస్థితుల్లో ఉందనేది వారి ప్రచార ఉద్దేశం. చంద్రబాబు రాజధాని ఎంపిక పప్పు అని చూపే ప్రయత్నం తాజాగా మళ్లీ ప్రారంభం అయ్యింది.
* జంగిల్ క్లియరెన్స్ పనులకు ఆటంకం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. వర్షాలతో ఆ పనులకు ఇబ్బందికరంగా మారింది. 45 రోజుల్లో ఈ పనులు పూర్తిగా చేపట్టి.. అమరావతి రాజధానిని యధా స్థానంలోకి తేవాలన్నది రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం. మరోవైపు కేంద్ర బడ్జెట్లో అమరావతికి 15 కోట్లు కేటాయించిన నేపథ్యంలో వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతలోనే భారీ వర్షాలు ఆ రెండు జిల్లాలను చుట్టుముట్టాయి. అయితే ఇప్పటికే అమరావతి రాజధాని విషయంలో కూటమి ప్రభుత్వం దూకుడుగా ముందుకు సాగుతుండడంతో.. వైసీపీ శ్రేణులకు మింగుడు పడడం లేదు. అందుకే అమరావతికి వరద చుట్టుముట్టిందని.. భవిష్యత్తులో వరదలు వస్తే ఇలానే అమరావతి మునిగిపోతుందని ప్రచారం మొదలుపెట్టారు. కానీ అమరావతిలో క్షేత్రస్థాయిలో ఎక్కడ వరద నీరు లేదని తెలుస్తోంది.
* నిన్ననే భారీ ఈవెంట్
నిన్ననే అమరావతి ప్రాంగణంలోని ఎస్సార్ఎమ్ యూనివర్సిటీలో భారీ ఈవెంట్ సాగింది. వేలాదిమంది విద్యార్థుల సందడి వేళ స్నాతకోత్సవం నిర్వహించారు. రోజంతా విద్యార్థులు ఆటపాటలతో గడిపారు. నిజంగా అమరావతిలో వరద ఉంటే వేలాదిమంది విద్యార్థులతో ఆ ఈవెంట్ సాగేదా? అందుకే అది ముమ్మాటికి దుష్ప్రచారం అని తేలింది. రెండు రోజుల కిందట అక్కడ 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. కానీ వరద చేరిన ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని మళ్లించే ఏర్పాట్లు గతంలో టిడిపి ప్రభుత్వమే చేసింది. ఇప్పుడు అదే ప్రాజెక్టు ద్వారా వచ్చిన వరద వచ్చినట్లే కృష్ణా నదిలోకి వెళ్లిపోతోంది.
* ఎప్పుడూ అదే ప్రచారం
విజయవాడ అంటే ముందుగా గుర్తుకొచ్చేది అమరావతి. సమీప ప్రాంతంలో అమరావతి ఉండడంతో అక్కడ కూడా అదే పరిస్థితి ఉంటుందన్నది ఒక వాదన. గతంలో కూడా వైసిపి దీనిపై బలంగా వాదించింది. నది చెంతన రాజధాని నగరం నిర్మాణం అన్నది సాహసంతో కూడిన పని అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు వరదల రూపంలో ప్రచారం చేసుకోవడానికి ఒక ఛాన్స్ వచ్చింది. అయితే సోషల్ మీడియా పుణ్యమా అని క్షణాల్లో వాస్తవ పరిస్థితి తెలుస్తోంది. అయితే అమరావతి రాజధాని విషయంలో ఎలాగైనా గందరగోళం సృష్టించాలన్న ఆలోచనలో వైసిపి ఉంది. అందుకే లేనిపోని ప్రచారం చేస్తోంది. కానీ ప్రజలకు వెళ్లే పరిస్థితి లేదు. గత ఐదు దశాబ్దాలలో ఎన్నడూ చూడని వర్షం పడింది. వరద బీభత్సం సృష్టించింది. జనాభాసాల్లోకి సైతం నీరు చొచ్చుకొచ్చింది. అయితే అమరావతి అలానే ఉందని వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు.