Homeఆంధ్రప్రదేశ్‌Jagan: జాతీయస్థాయిలో జగన్ కు మద్దతు తెలిపే వారు ఏరి?!

Jagan: జాతీయస్థాయిలో జగన్ కు మద్దతు తెలిపే వారు ఏరి?!

Jagan: ఏపీలో( Andhra Pradesh) కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయని ఆరోపిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో పోరాటం చేయాలని భావిస్తోంది. ఈరోజు ఆ పార్టీ ఎంపీలు పార్లమెంట్ వద్ద నిరసన తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నినాదాలు చేశారు. మరోవైపు జాతీయస్థాయిలో ఉద్యమించాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. పార్టీ నేతలతో ఈరోజు కీలక చర్చలు జరిపారు. రేపు గుంటూరు వెళ్లి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. శుక్రవారం మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి వెళ్ళనున్నారు. అయితే జాతీయస్థాయిలో టిడిపి కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టాలని చూస్తున్నారు జగన్. అన్ని రాజకీయ పార్టీలను కలవాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో కలిసి వచ్చే పార్టీలు ఏవి? అనే ప్రశ్న వినిపిస్తోంది. ఇప్పటివరకు బిజెపి అడిగిందే తడువుగా అన్ని రకాల సాయం అందిస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అదే బిజెపి భాగస్వామ్యంతో నడుస్తున్న కూటమి ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధపడుతున్నారు. దీంతో జాతీయస్థాయిలో కలిసి వచ్చే పార్టీలు ఏవి అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.

* గతంలో పార్టీల మద్దతు..
కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలో ఇదే మాదిరిగా జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) ఢిల్లీలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. దీక్ష కూడా చేశారు. ఆ సమయంలో ఇండియా కూటమి తరపున చాలా పార్టీలు వచ్చాయి. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ వచ్చి సంఘీభావం ప్రకటించారు. ఒకటి రెండు పార్టీలు తమ ప్రతినిధులను పంపించాయి. అయితే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమి వైపు చారకపోయినా జాతీయస్థాయిలో ఇతర పార్టీలతో స్నేహం చేస్తారని అంతా భావించారు. అయితే ఇండియా కూటమి పార్టీలతో స్నేహం చేస్తే బిజెపికి కోపం వస్తుందని భావించి వెనక్కి తగ్గారు. అందుకే ఇప్పుడు ఆ పార్టీలన్నీ జగన్మోహన్ రెడ్డికి వచ్చి మద్దతు తెలుపుతాయా? ఆ ఛాన్స్ ఉందా? అనేది మాత్రం తెలియడం లేదు.

* భారీ ఓటమితో మసక బారిన ఇమేజ్..
మొన్నటి ఎన్నికల ఫలితాల వరకు జగన్మోహన్ రెడ్డి కి జాతీయస్థాయిలో మంచి ఇమేజ్ ఉండేది. ఎందుకంటే పార్టీ ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో 67 స్థానాలతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో ఏకంగా ప్రభంజనం సృష్టించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 175 సీట్లకు గాను 151 చోట్ల భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అందుకే జాతీయస్థాయిలో ప్రత్యేక స్థానం సంపాదించారు. కానీ అదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకు పరిమితం కావడంతో.. జగన్ పై ఉన్న అంచనాలు తప్పాయి. ఆయన ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని జాతీయ పార్టీలు గుర్తించాయి. కేవలం చరిష్మపై ఆధారపడి ఆయన పార్టీని నడుపుతున్నారే తప్ప.. విధానపరమైన నిర్ణయాలు కానీ.. సిద్ధాంతాలు కానీ పట్టించుకోరు అన్న విమర్శ ఆయనపై ఉంది. అందుకే ఈసారి జాతీయస్థాయిలో ఉద్యమిస్తామని చెబుతున్న జగన్మోహన్ రెడ్డికి.. ఇతర పార్టీల మద్దతుపై అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో??

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version