https://oktelugu.com/

Samineni Udayabhanu: చిరంజీవి, పవన్ పై విమర్శలకు ఒప్పుకొని వైసీపీ నేత.. అందుకే ఇప్పుడు జనసేనలోకి..

గత ఐదేళ్ల వైసిపి పాలనలో చాలామంది బాధితులుగా మిగిలారు.అందులో సొంత పార్టీ నేతలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ పార్టీకి ఓటమి ఎదురయ్యేసరికి బయటపడుతున్నారు. పార్టీ నుంచి బయటకు వెళ్తున్నారు.

Written By: Dharma, Updated On : September 18, 2024 5:26 pm

Saamineni Udayabhanu

Follow us on

Saamineni udayabhanu : వైసీపీకి మరో షాక్ తగలబోతోంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారు. జనసేనలో చేరనున్నారు. జగన్ తనకంటే జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చి.. తన విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆ నేత అసంతృప్తితో ఉండేవారు. ప్రజల్లో మంచి నాయకుడిగా గుర్తింపు పొందారు. అదే సమయంలో రాజకీయాల్లో హుందాతనం పాటిస్తూ వచ్చారు. కానీ జగన్ తనను నమ్మకపోయేసరికి అసంతృప్తితో ఉన్న సదరు నేత.. పార్టీకి గుడ్ బై చెప్పడమే ఉత్తమమని భావిస్తున్నారు. జనసేనలో చేరితే మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఒక నిర్ణయానికి వచ్చారు. అందుకే వైసీపీని వీడి జనసేనలో చేరేందుకు దాదాపు డిసైడ్ అయ్యారు. ఆయనే జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట అడుగులు వేశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో మాత్రం గెలిచారు. మంత్రి పదవి పై ఆశలు పెట్టుకున్నారు. జగన్ మాత్రం రకరకాల సమీకరణల పేరు చెప్పి ఉదయభాను కు అవకాశం ఇవ్వలేదు.

* ఆ కారణంతోనే మంత్రి పదవి రాలేదట
గత ఐదేళ్లుగా హుందాతనం పాటించడం వల్లే ఉదయభాను కు మంత్రి పదవి రాలేదని తెలుస్తోంది. కాపుల్లో సీనియర్ మోస్ట్ లీడర్ ఆయన. రాజశేఖర్ రెడ్డి పిలుపుమేరకు రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. 2009లో జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో జగన్ వెంట అడుగులు వేశారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినా ఓడిపోయారు. 2019లో గెలిచినా మంత్రి పదవి దక్కలేదు. అయితే పవన్ ను విమర్శించాలని ఉదయభానును జగన్ ఆదేశించేవారట. అందుకు ఆయన అంగీకరించలేదట. ఆ కారణంతోనే ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదట. ఉదయభాను కంటే జూనియర్లు అయిన అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్ లాంటి వారికి మంత్రి పదవులు ఇచ్చి.. అదే సామాజిక వర్గానికి చెందిన ఉదయభాను మాత్రం జగన్ పట్టించుకోలేదు. ప్రత్యర్థులపై విమర్శలు చేయడంలో హుందాగా ఉంటారు అన్నది ఉదయభాను పై ఉన్న అభిప్రాయం.

* మెగాస్టార్ అంటే అభిమానం
మెగాస్టార్ చిరంజీవి అంటే సామినేని ఉదయభాను కు ఎనలేని అభిమానం. 2009లో పిఆర్పి ఏర్పాటు చేశారు చిరంజీవి. ఆ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండేది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు ఉదయభాను. అదే సమయంలో జగ్గయ్యపేట నియోజకవర్గంలో ప్రచారానికి సినీ నటుడు రాజశేఖర్, జీవిత దంపతులు వచ్చారు. చిరంజీవిపై విమర్శలు చేసే క్రమంలో వద్దని వారించారు ఉదయభాను. కాంగ్రెస్ అభ్యర్థిగా ఉంటూనే.. తనకు మద్దతుగా ప్రచారం వచ్చిన వారికి సైతం అభ్యంతరాలు తెలిపారు అంటే చిరంజీవి పై ఉన్న అభిమానం అర్థమవుతోంది. అందుకే ఇప్పుడు జనసేన వైపు ఉదయభాను మొగ్గు చూపుతున్నారు.

* జగ్గంపేట ఖాళీ
ఇప్పటికే జగ్గంపేట మున్సిపల్ పాలకవర్గం తెలుగుదేశం వశం అయింది. మునిసిపల్ చైర్మన్ తో పాటు కౌన్సిలర్లు టిడిపి గూటికి చేరారు. ఈ విషయంలో సామినేని ఉదయభాను పెద్దగా పట్టించుకోకపోవడం వల్లే వారు చేజారిపోయినట్లు తెలుస్తోంది. తాను జనసేనలో చేరే క్రమంలో.. వైసీపీని పట్టించుకోవడం మానేసినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులో పవన్ సమక్షంలో సామినేని ఉదయభాను జనసేనలో చేరతారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని సమాచారం.