YV Subba Reddy Arrest: మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి(YV Subba Reddy) అరెస్టు తప్పదా? లడ్డూ కల్తీ కేసులో ఆయన చుట్టూ ఉచ్చు బిగిస్తోందా? విచారణకు పిలిచి అరెస్టు చేస్తారా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో దీనిపైనే చర్చ నడుస్తోంది. లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడారు అన్నది ప్రధాన ఆరోపణ. ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా బయటపెట్టారు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఈ దారుణం జరిగిందని వెల్లడించారు. అప్పటి నుంచి రచ్చ ప్రారంభం అయింది. కోట్లాదిమంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఈ వ్యవహారాలు నడిచాయి. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో కార్నర్ అయింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించి విచారణను ప్రారంభించింది. అయితే టీటీడీ అధ్యక్షుడిగా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలని పిటీషన్ దాఖలు చేశారు. అయితే అత్యున్నత న్యాయస్థానం సిబిఐ నేతృత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు సంయుక్తంగా విచారణ బృందంగా ఏర్పడి దర్యాప్తు చేయాలని ఆదేశించింది. అది మొదలు తిరుమల కేంద్రంగా చేసుకొని సీట్ దర్యాప్తు చేస్తోంది.
అప్పన్న ద్వారా సమాచార సేకరణ..
తాజాగా వైవి సుబ్బారెడ్డి అనుచరుడు, పీఏ గా భావిస్తున్న అప్పన్న( Appanna) అనే వ్యక్తి అరెస్టయ్యారు. తిరుమల లడ్డు తయారీకి సంబంధించి నెయ్యి సరఫరా చేసే సంస్థల నుంచి ఆయనకు భారీగా నగదు లావాదేవీలు జరిగిన విషయాన్ని సిట్ గుర్తించింది. అలా వచ్చిన కమిషన్లు వైవి సుబ్బారెడ్డికి చేర వేసినట్లు అప్పన్న ద్వారా విచారణ బృందం గుర్తించింది. అందుకే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి కి ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు పంపించింది. విచారణకు హాజరు కావాలని సూచించింది. అయితే ముందస్తు పనుల నేపథ్యంలో తాను హాజరు కాలేనని.. తన ఇంటి వద్దకు వస్తే విచారణకు సహకరిస్తానని వైవి సుబ్బారెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 20న హైదరాబాదులో వైవి సుబ్బారెడ్డి నివాసంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించనుంది. అయితే పరిస్థితులు చూస్తుంటే ఆయన అరెస్టు తప్పదని టాక్ నడుస్తోంది.
పక్కా వ్యూహంతోనే..
అయితే ఈ కేసులో పక్కా వ్యూహంతోనే వైవి సుబ్బారెడ్డిని ఇరికిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress )పార్టీ ఆరోపిస్తోంది. అసలు అప్పన్న అనే వ్యక్తి వై వి సుబ్బారెడ్డి అనుచరుడు, పిఏ కాదని.. అతని ఎప్పుడు టీటీడీలో పని చేయలేదని వైసీపీ చెబుతోంది. మరోవైపు ఆయన టిడిపి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కంపెనీల్లో పని చేసేవాడని.. నెలకు 25 వేల రూపాయల వరకు ఆయన జీతం గా వైసీపీ చెబుతోంది. టిడిపి ఎంపీ వద్ద పనిచేస్తున్న వ్యక్తిని తెచ్చి.. వైవి సుబ్బారెడ్డి అనుచరుడిగా చిత్రీకరించి.. కేసు నమోదు చేయడం.. వై వి సుబ్బారెడ్డిని విచారణకు పిలవడం దారుణమని వైసిపి వ్యాఖ్యానిస్తోంది. ఇది ముమ్మాటికి రాజకీయ కుట్రగా అభివర్ణిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.
ఆధారాలు సేకరించిన సిట్..
ఈనెల 20న వైవి సుబ్బారెడ్డి విచారణ కొనసాగనుంది. ఇప్పటికే ఆయన కమీషన్లు అందుకున్నట్టు ఆధారాలు సేకరించింది సిట్. దీంతో ఆయన అరెస్టు తప్పకుండా జరుగుతుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో చాలా ఆందోళనతో ఉంది. వరుస కేసులతో వైసిపి నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతూ వచ్చారు. ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లోనే ఉన్నారు. పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అరెస్టై బయటకు వచ్చారు. కానీ ఇప్పుడు స్వయానా జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డి అరెస్ట్ అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్. మరి ఏం జరుగుతుందో చూడాలి.