AP census 2026: ఏపీలో( Andhra Pradesh) నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి చర్చకు వచ్చింది. ఏపీలో ముందుగా జనగణన ప్రారంభం కానుంది. 2026 ఏప్రిల్ నుంచి తొలి విడత జన గణన మొదలుపెట్టనున్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అయితే జనగణన మొదలైన తర్వాత.. కులగనణ చేపట్టనున్నారు. ఈ రెండు రకాల గణనకు దాదాపు రెండేళ్ల కాలవ్యవధి పట్టనుంది. అంటే 2028 వేసవి వరకు ఈ రెండు రకాల ప్రక్రియలు జరగనున్నాయి. 2029 సార్వత్రిక ఎన్నికలకు అక్కడకు ఏడాది కాలం మాత్రమే ఉంటుంది. ఈ ఏడాది కాలంలో నియోజకవర్గాల పునర్విభజన అనేది కష్టం అని తెలుస్తోంది. 2034 సార్వత్రిక ఎన్నికల నాటికి పునర్విభజన చేస్తారని ఒక అంచనాలు ఉన్నాయి. అదే జరిగితే పునర్విభజన పై ఆశలు పెట్టుకున్న చాలామంది నేతలు నిరుత్సాహానికి గురికాక తప్పదు.
విభజన చట్టంలో స్పష్టం..
రాష్ట్ర విభజన సమయంలోనే నియోజకవర్గాల పునర్విభజనతో.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు ఉంటుందని విభజన చట్టంలో పొందుపరిచారు. కానీ మధ్యలో జనగణన( census ) జరగకపోవడంతో పునర్విభజన సాధ్యం కాలేదు. ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనగణన జరగడం ఆనవాయితీగా వస్తోంది. చివరిసారిగా 2011లో జన గణన జరిగింది. 2021 కి వచ్చేసరికి కరోనా కారణంగా ఆ ప్రక్రియ జరగలేదు. గత నాలుగేళ్లలో అనేక రకాల కారణాలు జనగణనకు ఇబ్బందిగా మారాయి. అయితే ఇప్పుడు జనగణన మొదలుకానుంది. తరువాత కులగణనను మొదలుపెట్టనున్నారు. అయితే తర్వాత రిజర్వేషన్లు పూర్తిచేసి నియోజకవర్గాల పునర్విభజన జరపాల్సి ఉంది. కానీ అందుకు సమయం చాలదు. అందుకే ఈ ఎన్నికలకు పునర్విభజన అనేది అనుమానంగా తెలుస్తోంది.
ఆందోళనలో ఆశావహులు..
ఏపీలో దాదాపు 50 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయని అంచనాలు ఉన్నాయి. ప్రధానంగా కూటమి పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. ఎందుకంటే పొత్తులో భాగంగా జనసేనతో( janasena ) పాటు బిజెపి ఆశించే స్థానాలు పెరగడం, ఆశావహులు ఎక్కువగా ఉండడంతో నియోజకవర్గాల పెంపుతో సర్దుబాటు చేయవచ్చు అని అంతా భావించారు. కానీ ఇప్పుడు నియోజకవర్గాల సంఖ్య పెరగదని.. ఈ ఎన్నికలకు పునర్విభజన ఉండదని తెలుస్తుండడంతో నేతలు ఆందోళనకు గురవుతున్నారు. అటువంటి వారంతా ఇప్పుడు భవిష్యత్ రాజకీయాలపై అంచనాలు మొదలుపెట్టారు.
ఆశించే సీట్లు అధికం..
మొన్నటి ఎన్నికల్లో పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేసింది. అయితే బలాని కంటే తక్కువ స్థానాలను తీసుకున్నామని పలుమార్లు పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు పొందాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. జనసేన నేతల అంతర్గత చర్చల్లో సైతం వచ్చే ఎన్నికల్లో 40 అసెంబ్లీ సీట్లు డిమాండ్ చేస్తారని తెలుస్తోంది. బిజెపి సైతం 20 అసెంబ్లీ సీట్లు అడిగే పరిస్థితి కనిపిస్తోంది. అయితే పునర్విభజన జరిగి ఉంటే 50 నియోజకవర్గాలు పెరిగేవి.. వాటిని యధాతధంగా జనసేనతో పాటు బిజెపికి అప్పగించి మిగతా 175 సీట్లలో టిడిపి పోటీ చేసేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో కూటమి పార్టీలకు ఇబ్బందికరమే.