Jagan And Sharmila: ఏపీ కాంగ్రెస్ సారధ్య బాధ్యతలను చూస్తున్నారు వైఎస్ షర్మిల( Y S Sharmila ). తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన పార్టీ అలా ఉండడాన్ని జీర్ణించుకోలేక ఆ బాధ్యతలు తీసుకున్నట్లు ఆమె ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే తాను ఒక్కదాన్నే కాదు.. తన తాత పేరు పెట్టుకున్న తన కుమారుడు రాజారెడ్డిని సైతం కాంగ్రెస్ పార్టీలో తేవడానికి నిర్ణయించారు. కాంగ్రెస్ కుటుంబంగా, గాంధీ కుటుంబానికి నిత్యం విధేయత చూపిస్తామని తరచూ చెబుతుంటారు షర్మిల. అయితే అందులో ఎంత మాత్రం నిజం లేదని ఓ సీనియర్ నేత తేల్చి చెప్పారు. కేవలం జగన్మోహన్ రెడ్డి తన ఆస్తిలో వాటా ఇవ్వకపోవడం వల్లే ఆమె కాంగ్రెస్ బాట పట్టారని ఆ సీనియర్ నేత బాంబు పేల్చారు. జగన్మోహన్ రెడ్డితో షర్మిలకు ఏం జరిగింది అనే దానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
* కాంగ్రెస్ కుటుంబం గానే..
వైయస్ రాజశేఖర్ రెడ్డి( y s Rajasekhar Reddy ) కుటుంబం సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగింది. కాంగ్రెస్ అంటే రాజశేఖర్ రెడ్డి.. రాజశేఖర్ రెడ్డి అంటే కాంగ్రెస్ అనే పరిస్థితి ఉండేది. కాంగ్రెస్ పార్టీ సైతం రాజశేఖర్ రెడ్డి కి ఎంతో స్వేచ్ఛ ఇచ్చింది. రాజశేఖర్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించారు. ఈ తరుణంలోనే 2003లో ఉమ్మడి రాష్ట్రంలోనే పాదయాత్ర చేశారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఏపీలోనే కాదు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడ్డారు. అందుకే కాంగ్రెస్ అగ్రనాయకత్వం రాజశేఖర్ రెడ్డి కి ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. రెండోసారి కూడా ఆయనకే ఛాన్స్ ఇచ్చింది. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో ఆ పదవిని కోరుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో జగన్ కు గ్యాప్ ఏర్పడింది. అందుకే ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి కుటుంబమంతా జగన్కు అండగా నిలబడింది. ముఖ్యంగా సోదరి షర్మిల అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు పాదయాత్ర సైతం చేశారు.
* ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో..
2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ప్రభుత్వంలో తనకు ప్రాధాన్యం దక్కుతుందని జగన్( Jagan Mohan Reddy) సోదరి షర్మిల భావించారు. అందుకు జగన్ నో చెప్పారు. దీంతో ఏపీ ని కాదని తెలంగాణలో తన సొంత రాజకీయాన్ని మొదలుపెట్టారు షర్మిల. తండ్రి పేరిట పార్టీ ఏర్పాటు చేసిన ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసి ఏపీ బాధ్యతలను తీసుకున్నారు. అయితే తన తండ్రి పార్టీలో చేరడం గర్వంగా ఉందని.. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తన లక్ష్యమని రాజశేఖర్ రెడ్డి చేసిన ప్రకటనను గుర్తు చేశారు షర్మిల. తండ్రి ఆశయ సాధన కోసమే తాను కాంగ్రెస్లో చేరానని.. కాంగ్రెస్ సారధ్య బాధ్యతలు తీసుకున్నానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కంటే జగన్మోహన్ రెడ్డి పతనానికి షర్మిల ఎక్కువగా దోహదపడ్డారన్న విశ్లేషణలు ఉన్నాయి.
* బయటపెట్టిన సోము వీర్రాజు..
అయితే ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. ఇండియా కూటమి తరుపున తెలుగు వ్యక్తి సుదర్శన్ రెడ్డి పోటీ చేశారు. కానీ జగన్ మాత్రం ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలిపారు. దానిపై విమర్శలు చేస్తున్నారు షర్మిల. జగన్మోహన్ రెడ్డి చారిత్రాత్మక తప్పిదానికి పాల్పడ్డారని.. ఆర్ఎస్ఎస్ నేతకు మద్దతు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. అయితే దీనిపై ఏపీ బీజేపీ మాజీ చీఫ్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పందించారు. షర్మిలకు రాజకీయాలు తెలియని.. కేవలం జగన్మోహన్ రెడ్డి ఆస్తిలో వాటా ఇవ్వకపోవడం వల్లే ఆమె ఎదురు తిరిగారని.. కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పుకొచ్చారు. అయితే ఇదే సోము వీర్రాజు కొద్ది రోజులపాటు జగన్ తో స్నేహం కొనసాగించారు అన్నది ఒక ఆరోపణ. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాటాలు ఇవ్వకపోవడం వల్లే షర్మిల ఇలా వ్యవహరిస్తున్నారని చెప్పుకు రావడం విశేషం. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది.