Satish case mysterious facts: టీటీడీ విజిలెన్స్( TTD vigilance) విభాగంలో పనిచేసిన సతీష్ అనుమానాస్పద మృతి మిస్టరీ ఇంకా వీడడం లేదు. ఆయన హత్యకు గురయ్యారా? లేకుంటే ప్రమాదవశాత్తు చనిపోయారా? అన్నది తేలాల్సి ఉంది. ఎందుకంటే ఆయన తిరుమల పరకామణి కేసులో కీలక వ్యక్తి. అక్కడ జరిగిన దొంగతనం పై నిజనిర్ధారణ చేసి నిందితుడికి పోలీసులకు అప్పగించారు. తరువాత అదే కేసులో రాజీ చేసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో నాటి ప్రభుత్వ పెద్దల హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. దానిపై తాజాగా జరుగుతున్న విచారణలో భాగంగా సతీష్ కుమార్ ను ఇప్పటికే ప్రశ్నించారు. మరోసారి ప్రశ్నించేందుకు పిలవగా.. ఆయన అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించారు. సహజంగానే దీని చుట్టూ రాజకీయ అంశాలు తిరుగుతాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులే చంపించేసారని టిడిపి ఆరోపిస్తుండగా.. కాదు కాదు టిడిపియే ఈ పని చేయించిందని వైసీపీ ఆరోపిస్తోంది. మరోవైపు ఈ కేసు విచారణ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. అదే సమయంలో సతీష్ కుమార్ అనుమానాస్పద మృతిపై కూడా దర్యాప్తు శరవేగంగా జరుగుతోంది.
రెండేళ్ల కిందట ఘటన..
ప్రస్తుతం గుంతుకల్లు( guntakallu ) జిఆర్పి లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్నారు సతీష్ కుమార్. ఆయన గతంలో టీటీడీ విజిలెన్స్ విభాగంలో పని చేసేవారు. ఈ క్రమంలో 2023లో పరకామణిలో పనిచేస్తున్న రవికుమార్ అనే ఉద్యోగి విదేశీ డాలర్లతో పట్టుబడగా సతీష్ కుమార్ పోలీసులకు అప్పగించారు. దాదాపు 70 వేల రూపాయల విలువ చేసే విదేశీ కరెన్సీ తో రవికుమార్ పట్టుబడ్డారు. దానిపైనే తిరుపతి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సతీష్ కుమార్. అయితే ఇదే కేసును లోక్ అదాలత్ ద్వారా రాజీ చేసుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. గత కొంతకాలంగా పరకామణిలో పనిచేస్తున్న రవికుమార్ పై అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. కోట్లాది రూపాయల అక్రమ సంపాదన వెనుక పరకామణి చోరీ ఉందన్నది ప్రధాన అనుమానం. దీంతో అప్పటి టీటీడీ పెద్దలు రంగంలోకి దిగి రవికుమార్ ఆస్తుల్లో సగం టీటీడీకి స్వాధీనం చేసుకున్నారని.. మిగతా వాటిని లంచం రూపంలో తీసుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. అందులో భాగంగానే విజిలెన్స్ అధికారి, ఆపై ఫిర్యాదుదారుడైన సతీష్ కుమార్ పై ఒత్తిడి పెంచారని.. ఆయన లోక్ అదాలత్ లో రాజీ చేసుకున్నట్లు తెలుస్తోంది.
క్షుణ్ణంగా దర్యాప్తు..
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పాత కేసుల్లో ఒకటైన పరకామణి కేసు తెరపైకి వచ్చింది. దీనిపై జర్నలిస్ట్ శ్రీనివాస్ హైకోర్టులో( High Court) పిటిషన్ వేశారు. అప్పటి టీటీడీ పెద్దల ఆదేశాలతోనే ఈ కేసు రాజీ చేశారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో న్యాయస్థానం విచారణకు ఆదేశించింది. దీంతో ఈ కేసులో ఫిర్యాదుదారుడు, ఆపై రాజీ చేసుకున్న సతీష్ కుమార్ ను విచారణ బృందం విచారించింది. ఆయన కీలక సమాచారం ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన రెండోసారి విచారణకు వస్తుండగా మార్గమధ్యలో అనుమానాస్పదంగా మృతి చెందారు. అయితే ఆయన హత్యకు గురయ్యారు అన్నది అనుమానం. దీనిపై దర్యాప్తు సాగుతోంది. రైలులో నాడు ప్రయాణించిన వారి నుంచి సైతం వివరాలు సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యులను సైతం విచారిస్తున్నారు. అసలు ప్రమాదవశాత్తు రైలు నుంచి పడిపోయారా? రైలు నుంచి ఎవరైనా బలవంతంగా తోసేసారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఎలా చనిపోయారు అనే విషయం నిర్ధారణ అయిన వరకు.. అది హత్య? ఆత్మహత్య? అన్నది స్పష్టత రాదు. ఒకవేళ హత్య అని తేలితే మాత్రం అనుమానపు చూపులన్నీ వైసీపీ వైపు వెళ్తాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.