Vishakapatnam : విశాఖలో మరోసారి వైసీపీకి షాక్ తగిలింది. విశాఖ నేతలతో జగన్ వరుస సమావేశాలు జరుపుతున్న తరుణంలో ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఎన్డీఏ కూటమి ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ముందు వైసీపీకి మింగుడు పడని విషయమే.విశాఖ నగరపాలక సంస్థ స్థాయి సంఘ కమిటీలకు ఎన్నికలు జరిగాయి. పదికి పది స్థానాలను టిడిపి కూటమి కైవసం చేసుకుంది. దీంతో ఆ పార్టీలో సంబరాలు మిన్నంటాయి. వైసీపీలో మాత్రం ఆందోళన కనిపిస్తోంది. విజయవాడ, కర్నూలు స్థాయి సంఘ కమిటీల ఎన్నికల్లో వైసిపి ఏకపక్ష విజయం సొంతం చేసుకుంది. కానీ విశాఖకు వచ్చేసరికి మాత్రం కూటమి పట్టు బిగించింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో.. టిడిపి కూటమి అన్ని రకాలుగా జాగ్రత్తలు పడింది. పెద్ద ఎత్తున వైసిపి కార్పొరేటర్ లను టిడిపి, జనసేనలో చేర్చుకుంది. ఒక వ్యూహం ప్రకారం వారు పార్టీని వీడియోల పావులు కదిపింది. ఎన్నికలకు ముందు కొంతమంది పార్టీని వీడగా.. ఎన్నికల తర్వాత మరికొందరు పార్టీకి గుడ్ బై చెప్పారు. 96 మంది కార్పొరేటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒక్కొక్కరికి 10 ఓట్లు వేసే అవకాశం ఉండడంతో.. మొత్తం 960 ఓట్లు పోలయ్యాయి. కూటమి తరుపున నిలబడిన పదిమంది టిడిపి అభ్యర్థులు అన్ని స్థానాలను గెలుచుకున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. వైసిపి శ్రేణులు డీలా పడ్డాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కి సంబంధించి ఉప ఎన్నికలో ప్రతికూల ఫలితాలు తప్పవని వైసిపి ఆందోళనతో ఉంది.
* వైవి సుబ్బారెడ్డికి షాక్
విశాఖ స్థాయి సంఘ ఎన్నికల్లో ఓటమితో వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ముఖ్యంగా వైసిపి ఉత్తరాంధ్ర ఇన్చార్జ్ వై వి సుబ్బారెడ్డికి ఇది మింగుడు పడని విషయం. 2022 నుంచి ఆయన ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. గత ఏడాది మార్చిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురయింది. దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదు. అందుకే 2024 సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు స్థాయి సంఘ ఎన్నికల్లో సైతం అదే పరిస్థితి ఎదురైంది. దీంతో స్థానిక సంస్థల ఉప ఎన్నికలకు సంబంధించి వైసీపీలో టెన్షన్ కనిపిస్తోంది.
* బలమైన అభ్యర్థిగా బొత్స
ఎలాగైనా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ని కైవసం చేసుకోవాలని వైసిపి భావిస్తోంది. అందుకే బలమైన అభ్యర్థిగా భావిస్తున్న పొరుగు రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ను రంగంలోకి దించారు జగన్. స్థానికంగా ఆశావహులు ఉన్నా.. దూకుడు మీద ఉన్న కూటమికి బ్రేక్ వేయాలంటే బొత్స సరైన అభ్యర్థి అవుతారని జగన్ ఒక నిర్ణయానికి వచ్చారు. అందుకే విశాఖ పార్టీ శ్రేణులతో వరుసగా రెండు రోజులు పాటు సమావేశమయ్యారు. అయితే ఒక వైపు సమావేశాలు నిర్వహిస్తుండగా.. మరోవైపు స్థాయి సంఘ ఎన్నికల్లో వైసిపికి భారీ దెబ్బ తగిలింది.
* విశాఖలో వరుస ఓటములు
విశాఖ అనేసరికి వైసీపీకి ఓటమి తప్పడం లేదు. 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా ఒక ప్రభంజనం వీచింది. కానీ విశాఖ నగర పరిధిలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రం టీడీపీ వశమయ్యాయి. ఆపై గత మార్చిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ రూపంలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో అయితే విశాఖ నగరం తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు తుడిచిపెట్టుకుపోయాయి. అందుకే విశాఖ అంటేనే వైసీపీలో ఒక రకమైన భయం కనిపిస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ముందు.. స్థాయి సంఘ ఎన్నికల్లో టిడిపి కూటమి ఏకపక్ష విజయం దక్కించుకోవడం భయం వెంటాడుతోంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదు అన్న ప్రచారం ప్రారంభమైంది. దీనిని వైసిపి ఎలా అధిగమిస్తుందో చూడాలి.