Nominated posts : ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులు అవుతోంది. రేపటికి వంద రోజులు పూర్తికానుండడంతో సంబరాలు చేసుకుంటున్నాయి ఆ మూడు పార్టీలు. అయితే ద్వితీయ శ్రేణి నాయకత్వం మాత్రం ఆశించిన స్థాయిలో సంతృప్తిగా లేదు. నామినేటెడ్ పదవుల భర్తీ జరగకపోవడంతో చాలామంది అసంతృప్తితో ఉన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందని అంతా భావించారు. కానీ రకరకాల కారణాలు చూపి వాటిని వాయిదా వేస్తూ వచ్చారు. ఆగస్టు 15న నామినేటెడ్ పోస్టుల ప్రకటన ఉంటుందని ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో సైతం ఫలానా వారికి ఫలానా పదవులు అంటూ ప్రచారం సాగింది. అయితే అటువంటిదేమీ లేకుండా పోయింది. మధ్యలో వరదలతో అటు ఇటుగా మూడు వారాలు సాగిపోయింది. ఇప్పుడు సాధారణ పరిస్థితులు రావడంతో మళ్లీ నామినేటెడ్ పదవులపై ప్రచారం ప్రారంభమైంది. ఈరోజు సాయంత్రానికి నామినేటెడ్ పదవుల జాబితాను ఖరారు చేస్తారని.. ఒకటి,రెండు రోజుల్లో ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. దీంతో మూడు పార్టీల్లో ఒక రకమైన టెన్షన్ నెలకొంది.
* మూడు పార్టీలకు ప్రాధాన్యం
ఏపీలో మూడు పార్టీలు కలిసి ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కూటమి ప్రభుత్వం కావడంతో మూడు పార్టీలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే తుది కసరత్తులో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ఫార్ములా ప్రకారం ముందుకెళ్తున్నట్లు సమాచారం. 60 శాతం పదవులు టిడిపికి, 30% జనసేన కు, 10 శాతం బిజెపికి కేటాయిస్తారని తెలుస్తోంది.అయితే దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పొత్తులో భాగంగా ఎక్కువ శాతం త్యాగాలకు పాల్పడింది తెలుగుదేశం పార్టీ. అందుకే మా పార్టీకి సింహభాగం పదవులు కేటాయించాలని ఆ పార్టీ శ్రేణులు కోరుతున్నారు.
* మెజారిటీ పదవులు మాకే
మరోవైపు జనసైనికులు సైతం మెజారిటీ పదవులు జనసేనకు కేటాయించాలని కోరుతున్నారు. టిడిపి తో సమానంగా పదవులు కోరుతున్నారు. పొత్తులో భాగంగా తక్కువ సీట్లు తీసుకున్నామని.. కూటమి అధికారంలోకి రావడానికి పవన్ ప్రధాన కారణమని జనసైనికులు వాదిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడుతున్న వారికి పదవులు కేటాయించాలని కోరుతున్నారు. టిడిపి తో సమానంగా పదవులు ఇస్తేనే న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. నామినేటెడ్ పోస్టులపై చాలా ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవులతో పాటు నియోజకవర్గస్థాయిలో అన్ని పదవుల్లో తమకు సింహభాగం ప్రయోజనాలు కల్పించాలని కోరుతున్నారు.
* బిజెపిలో పాత నేతలు
బిజెపిలో విచిత్ర పరిస్థితి. ఆ పార్టీ సుదీర్ఘకాలంగా ఏపీలో ఉన్నా.. సొంతంగా అధికారంలోకి వచ్చే బలం లేకపోవడం విశేషం. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. మూడు ఎంపీ సీట్లను గెలుపొందింది. కానీ నామినేటెడ్ పదవుల విషయంలో వెనుకబడింది. ఈ ఎన్నికల్లో బిజెపి సీనియర్లకు పదవులు దక్కలేదు. కొత్తగా పార్టీలో చేరిన వారికే టికెట్లు కేటాయించారు. అయితే పాత నేతలంతా నామినేటెడ్ పదవులు కోరుతున్నారు. రాష్ట్రస్థాయి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.