TDP Mahanadu 2025: తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడుకు( mahanadu ) రంగం సిద్ధం అయింది. ఈసారి కడపలో మహానాడు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు ఊపు మీద ఉన్న తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డికి ఓటమి రుచి చూపించింది. చివరకు ఆ కుటుంబానికి ఏకపక్షంగా అండగా నిలిచే కడప జిల్లాలో సైతం సత్తా చాటింది. అదే ఊపును కొనసాగించాలని భావిస్తూ కడపలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించింది. ఉమ్మడి ఏపీలో ఇంతవరకు కడపలో మహానాడు నిర్వహించలేదు. కానీ ఈసారి కనీ వినీ ఎరుగని రీతిలో మహానాడు నిర్వహించి సవాల్ విసరాలని భావిస్తోంది తెలుగుదేశం పార్టీ. ఈనెల 27, 28, 29 తేదీల్లో మహానాడును అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
* నెలల కిందటే నిర్ణయం..
వాస్తవానికి మూడు నెలల కిందటే కడపలో( Kadapa) మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు. తొలుత పులివెందులలో నిర్వహించేందుకు కడప జిల్లా నేతలు చాలా ఆసక్తి చూపారు. కానీ చివరకు కడప అయితే బాగుంటుందని ఒక అభిప్రాయానికి వచ్చారు. రాష్ట్ర నాయకత్వం సైతం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో పాటు రాయలసీమ జిల్లాకు చెందిన మంత్రులు, కీలక నేతలు మహానాడు ఏర్పాట్లలో భాగస్వామ్యం అయ్యారు. అయితే ఆదిలో కడప జిల్లా నేతలు ఐక్యంగా ముందుకు సాగారు. కానీ ఇప్పుడు కొందరు నేతలు ముఖం చాటేస్తున్నారు. అంతర్గత విభేదాలతో కడప జిల్లా నాయకులు మహానాడు ఏర్పాట్లలో పాలుపంచుకోవడం లేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
* ఆ నేతలంతా దూరం..
బీటెక్ రవి ( BTech Ravi )నుంచి ఎమ్మెల్యే మాధవి వరకు పలువురు నాయకులు మహానాడు ఏర్పాట్లకు దూరంగా ఉన్నారు. కమలాపురం ఎమ్మెల్యే సతీష్ రెడ్డికి మహానాడు నిర్వహణ బాధ్యతలు అప్పగించడాన్ని మిగతా నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. నిజానికి మహానాడు జరుగుతోంది కమలాపురం నియోజకవర్గం పరిధిలోనే. దీంతో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న సతీష్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు. అయితే తమకు ఎలాంటి బాధ్యతలు అప్పగించకపోవడాన్ని మిగతా నేతలు సహించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా బీటెక్ రవి వర్గం అసహనంతో ఉంది. ఇక కడప ఎమ్మెల్యే మాధవి సైతం ఏర్పాట్లకు దూరంగా ఉన్నారు. కడపలో జరుగుతున్న మహానాడులో తన భాగస్వామ్యం లేకపోవడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర నాయకులు వెంట కేవలం కమలాపురం ఎమ్మెల్యే సతీష్ రెడ్డి మాత్రమే కనిపిస్తున్నారు. మిగతా నేతలు అంతా ముఖం చాటేస్తున్నారు.
* సతీష్ రెడ్డి హాట్ కామెంట్స్..
మరోవైపు కమలాపురం ఎమ్మెల్యే సతీష్ రెడ్డి ( kamalapuram MLA Satish Reddy ) మాటలు కాక రేపుతున్నాయి. మహానాడు ఏర్పాట్లలో ఎవరు కలిసి వచ్చినా కలుపుకొని వెళ్తామని.. ఎవరు రాకపోయినా పనులు ఆగబోవని ఆయన మీడియా ముఖంగా తేల్చి చెప్పడం మరింత వివాదానికి ఆజ్యం పోసింది. కడప జిల్లాలో మహానాడు విజయవంతంగా పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసరాలని భావించింది టిడిపి నాయకత్వం. కానీ క్షేత్రస్థాయిలో కడప జిల్లా టిడిపి నేతలు పెద్దగా ఆసక్తి చూపకపోవడం మైనస్ గా మారుతోంది. దీనిపై హై కమాండ్ కు సైతం ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. మరి అధి నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.