Jagan and Peddi Reddy: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో జగన్ కు గ్యాప్ ఏర్పడిందా? స్వల్ప విభేదాలు తలెత్తాయా? జగన్ ఆదేశాలను పెద్దిరెడ్డి పాటించలేదా? జగన్ కోపానికి అదే కారణమా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్ తరువాత ఎవరూ అంటే.. విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వై వి సుబ్బారెడ్డి లాంటి వారి పేర్లు వినిపించాయి. కానీ వీరందరికీ మించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నది బహిరంగ రహస్యం. ఇలా ఉన్న వారంతా ప్రజల్లో నాయకులు కాదు. కానీ పెద్దిరెడ్డి అలా కాదు. చిత్తూరు జిల్లా రాజకీయాలను శాసించారు. రాయలసీమలో సైతం తన ప్రతాపం చాటారు. కూటమి ప్రభంజనంలో సైతం గెలిచారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అతను ఒక్కడే కాదు తంబాలపల్లి నుంచి తమ్ముడు ద్వారకానాథ్ గెలిచారు. రాజంపేట ఎంపీ స్థానం నుంచి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విజయం సాధించారు. అలా పట్టు నిలుపుకున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
కూటమికి టార్గెట్..
సహజంగానే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తరువాత ఎక్కువగా కూటమి ప్రభుత్వానికి టార్గెట్ అయ్యారు పెద్దిరెడ్డి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రామచంద్రారెడ్డి పై కేసులు నమోదయ్యాయి. ఆయన కుమారుడు మిథున్ రెడ్డి ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో అరెస్టయ్యారు కూడా. చాలా రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వైసిపి హయాంలో ఒక వెలుగు వెలిగారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆ ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే వైసీపీ హయాంలో దూకుడుగా వ్యవహరించడం వల్లే ఇప్పుడు తమ కుటుంబం ఇబ్బంది పడుతోందని పెద్దిరెడ్డి భావిస్తున్నారు. అందుకే దూకుడు తగ్గించినట్లు వార్తలు వస్తున్నాయి. అయినా సరే జగన్మోహన్ రెడ్డి విషయంలో మరో ఆలోచనకు తావు లేకుండా ఉన్నారు పెద్దిరెడ్డి.
సభకు వెళ్లే విషయంలో..
అయితే తాజాగా శాసనసభ సమావేశాలకు హాజరు విషయంలో జగన్మోహన్ రెడ్డితో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విభేదించినట్లు ప్రచారం జరుగుతోంది. సభకు హాజరు కావాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అదే విషయంపై జగన్మోహన్ రెడ్డిని అడిగారు కూడా. అయితే సభకు వెళితే తనకు ఛాన్స్ ఇవ్వరని.. దారుణంగా అవమానిస్తారని.. అటువంటి అప్పుడు సభకు ఎందుకు వెళ్లాలి అని జగన్మోహన్ రెడ్డి తిరిగి ప్రశ్నించారు. గత ఐదేళ్ల వైసిపి హయాంలో జరిగిన పరిణామాలు తెలుసు. అందుకే జగన్మోహన్ రెడ్డి సభకు హాజరు కాకపోవడం ఉత్తమమని ఒక నిర్ణయంతో ఉన్నారు. కానీ ప్రస్తుతం యూరియా, మెడికల్ కాలేజీల అంశం, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి అంశాలపై ప్రశ్నించేందుకు అవకాశం ఉంది. అందుకే సభకు హాజరయ్యేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే ఎమ్మెల్యేలను పంపించాలని జగన్మోహన్ రెడ్డికి ఉంది. సభకు వెళ్లాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉంది. అయితే శాసనసభాపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి వస్తేనే వెళ్దామని పెద్దిరెడ్డి ఒక అభిప్రాయంతో ఉన్నారు. జగన్ మాత్రం పెద్దిరెడ్డితో వెళ్లాలని ఎమ్మెల్యేలకు సూచించారు. అయితే జగన్ ఆదేశాలను పెద్దిరెడ్డి పట్టించుకోలేదు. తిరస్కరించారు కూడా. అప్పటి నుంచి వారి మధ్య గ్యాప్ ఏర్పడినట్లు ప్రచారం నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి?