Godavari Sankranthi Celebrations 2026: ఏపీవ్యాప్తంగా సంక్రాంతి సందడి నెలకొంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో సందడి ప్రారంభం అయింది. సంక్రాంతి అంటేనే ముందుగా వినిపించేవి కోడిపందాలు. అసలు సంక్రాంతి సందడంతా అక్కడే మొదలవుతుంది. పట్టణాల్లో ఈ సంస్కృతి కనిపించదు కానీ.. గ్రామాల్లో మాత్రం స్పష్టంగా కనబడుతుంది. అందుకే ఎక్కువమంది పల్లెలకు వెళ్తారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సందడే వేరు. మరికొన్ని గంటల్లో భోగి వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. కోడిపందాలకు సైతం సిద్ధపడుతున్నారు. ఒకవైపు కోర్టు వద్దని ఆదేశించింది. పోలీసులు సైతం గట్టి చర్యలే ప్రారంభించారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడికక్కడే కోడిపందాలు బరులు సిద్ధమవుతున్నాయి.
* భోగిమంటల సందడి కంటే ముందే.. గోదావరి జిల్లాలో పందెం కోళ్ళు రణ రంగానికి సిద్ధమవుతున్నాయి. గతంలో గ్రామీణ బరులకే పరిమితమైన ఈ క్రీడ.. ఇప్పుడు హైటెక్ హంగులను అందుకుంటుంది. కోడి పందాలను వీక్షించేందుకు భారీ ఎల్ఈడి స్క్రీన్ లను సైతం ఏర్పాటు చేశారు. లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చేందుకు సైతం నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు.
* రాష్ట్రవ్యాప్తంగా ఈసారి వేడుకలు ప్రత్యేకంగా నిలవనున్నాయి. పశ్చిమగోదావరి, ఏలూరు, కోనసీమ, కృష్ణా జిల్లాలతో పాటు ఈ ఏడాది ఎన్టీఆర్, బాపట్ల, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లోనూ బరులు రెడీ చేశారు. కొన్నిచోట్ల ప్రజాప్రతినిధులే స్వయంగా ఏర్పాట్లు చేసినట్లు ప్రచారం నడుస్తోంది. అయితే గతంతో పోలిస్తే కోడి పందాల బరులు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.
* గత ఏడాది ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 150 నుంచి 200 బరులు ఏర్పాటయ్యాయి. కానీ ఈ ఏడాది మాత్రం 450 వరకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. భీమవరం నుంచి తాడేపల్లిగూడెం వెళ్లే మార్గంలో అయితే.. 14 కిలోమీటర్ల పరిధిలోనే 18 కి పైగా పెద్ద బరులు ఏర్పాటు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.
* ఐదు నుంచి పది ఎకరాల్లో బరులు ఏర్పాటు చేస్తున్నారు. ఇక వాహనాల పార్కింగ్ కోసం రెండు నుంచి మూడు ఎకరాలు కేటాయిస్తున్నారు. రాకపోకలకు ఇబ్బంది లేకుండా ప్రాధాన రహదారులకు సమీపంలోని తోటలు, లేఅవుట్లలో బరులు ఏర్పాటు చేశారు.
* కోనసీమ జిల్లాలో అయితే ప్రతి మండలంలో ఐదు నుంచి పది వరకు బరులు ఏర్పాటు చేశారు. అక్కడ బరులకు అనుమతులు ఇప్పించడం ప్రజా ప్రతినిధులకు ఇబ్బందిగా మారింది.
* గతంలో పందాలు నేలపై జరిగేవి. కానీ ఇప్పుడు సింథటిక్ బరులు ఏర్పాటు చేస్తున్నారు. పుంజుల కాళ్లకు గాయాలు కాకుండా జాగ్రత్త పడుతున్నారు.
* ఒకేసారి నాలుగు వేల నుంచి 5000 మంది కూర్చుని చూసేలా అక్కడ ఏర్పాటు చేశారు.
* నిర్వాహకులు ప్రత్యేకంగా జారీచేసిన టోకెన్లు ఉన్నవారికి మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. బయట ఉన్నవారు సైతం పోటీలను తిలకించేందుకు వీలుగా ఎల్ఈడి స్క్రీన్ లను ఏర్పాటు చేస్తున్నారు. రాత్రి వేళ కూడా పందాలు జరిగేలా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక అతిధులు సేద తీరేందుకు కార్వాన్లు ఉంచుతున్నారు.
* జనాన్ని నియంత్రించేందుకు వీలుగా బౌన్సర్లను నియమిస్తున్నారు. ఎవరిని సెల్ ఫోన్లతో లోపలికి వెళ్లకుండా ప్రవేశ ద్వారం వద్ద డిపాజిట్ చేయించుకుంటున్నారు.
* దాదాపు ఉభయ గోదావరి జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఉన్న హోటల్లు ముందుగానే బుక్ అయ్యాయి. పొందాలను తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోని బళ్లారి, గుల్బర్గా.. తమిళనాడులోని కొన్ని ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు.