Cold Wave in Telugu states: ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. నవంబర్ వరకు రెండు రాష్ట్రాలో వర్షాలు కురిశాయి. దీని ప్రభావంతో ఈసారి చలి తీవ్రత మరింత పెరిగింది. దీనికితోడు ఉత్తర భారత శీతల గాలులు, హిమాలయాల్లో కురిసిన భారీ మంచు ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చలి తీరుగా మారనుంది. అరకు, పాడేరు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 4–12 డిగ్రీల వరకు పడిపోతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మరింత ఊపందుకునే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఉత్తర ఏపీలో తీవ్ర చలి
అరకు, పాడేరు వంటి గిరిజన ప్రాంతాల్లో ఉదయం, రాత్రి వేళల్లో చలి తీవ్రంగా ఉంది. ఉత్తర భారతం నుంచి వీస్తున్న శీతల గాలులు రాష్ట్ర ఉత్తర భాగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఈ ధోరణి కొనసాగితే, సాధారణ ఉష్ణోగ్రతల కంటే 5–8 డిగ్రీలు తక్కువగా నమోదవ్వవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, కార్మికులు ఎక్కువగా బాధితులవుతారు.
తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్..
తెలంగాణలో 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఉదయం, సాయంత్రం, రాత్రి సమయాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అత్యవసర సందర్భాలు తప్ప బయటకు రావద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఈ అలర్ట్ రాష్ట్రవ్యాప్తంగా ప్రజల అవగాహన పెంచడానికి జారీ చేశారు.
మంచు ప్రభావం..
హిమాలయాల్లో కురుస్తున్న భారీ మంచు ఉత్తర భారతాన్ని మరింత శీతలంగా మార్చింది. దక్షిణానికి శీతల తరంగాలను తీసుకువస్తోంది. ఈ వాయువులు ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లోకి ప్రవేశించడంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. వాతావరణ మాధ్యమిక కేంద్రం ఈ ధోరణి రాబోయే వారంలో కొనసాగుతుందని ప్రకటించింది.
జాగ్రత్తలు..
చలి తీవ్రతకు వైరల్ జ్వరాలు పెరుగుతున్నాయి. జలుబు, దగ్గు, ఊపిరి తిత్తుల సమస్యలు తలెత్తుతున్నాయి. ఆస్తామా సమస్య ఉన్నవారు, చిన్న పిల్లలు, చలి తీవ్రతకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో మస్క్, షాల్, దుస్తులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. వేడి ఆహారాలు, తగినంత ద్రవాలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. జ్వరం, దగ్గ వస్తే వెంటనే చికిత్స తీసుకోవాలని çసూచిస్తున్నారు. బయటకు వెళ్లాలంటే స్వెట్టర్లు, గ్లవ్స్ ఉపయోగించాలంటున్నారు.