Simhachalam : ఏపీలో ఇటీవల ఆలయాల పవిత్రతను దెబ్బతీసేలా పరిణామాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుపతిలో ఫేక్ వెబ్ సైట్ లు రాజ్యమేలుతున్నాయి. సాక్షాత్ ప్రజాప్రతినిధులే టిక్కెట్ల విక్రయాలతో నిలువుదోపిడీకి పాల్పడుతుండడం విచారకరం. తాజాగా సింహాచలంలో అప్పన్న చందనోత్సవంలో ప్రభుత్వం దారుణంగా ఫెయిలైంది. భక్తులకు కనీస మంచినీరు కూడా కల్పించలేకపోయింది. ఉత్సవ నిర్వహణలో, ఏర్పాట్లలో ఫెయిలైంది. కానీ అంతా సవ్యంగా సాగుతున్నట్టు సమర్థించుకుంటోంది. కానీ ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా స్వామివారి నిజరూప దర్శనం ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో ఫెయిల్యూర్సే కాదు.. భద్రతలోనూ డొల్లతనం వెలుగులోకి వచ్చింది.
నెట్టింట్లో వైరల్..
ప్రస్తుతం నిజరూప దర్శనం ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత ఏడాది చందనోత్సవం నాడు ఈ విధంగానే నిజరూప దర్శనం దృశ్యాలు బయటపడ్డాయి. అప్పట్లో భక్తులు నేరుగాఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో పెద్ద దుమారమే రేగింది. గత అనుభవాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాల్సిన యంత్రాంగం మరింత నిర్లక్ష్యం చేసింది. దీంతో మరోసారి అటువంటి అనుభవమే ఎదురైంది. ఈ ఏడాది చందనోత్సవం దృశ్యాలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దీని వెనుక ఓ మంత్రి గన్ మెన్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన ఫొటోలు తీస్తుండగా దేవదాయ శాఖ సిబ్బంది అడ్డుకున్నట్టు తెలుస్తోంది, స్వామివారి నిజరూప దర్శన సమయంలో ఫొటోలు నిషిద్ధం. ఆగమ శాస్త్రం ప్రకారం స్వయంభూ విగ్రహాలకు ఫొటోలు తీయకూడదు. అయినా ఆలయంలో ఈ నిబంధనలు బేఖాతరవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
విచారణకు ఆదేశం
సింహగిరిపై చందనోత్సవం నాడు భక్తులు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీకావు. ఆ రోజుస్వామి వారి నిజరూప దర్శనానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, చత్తీస్ గడ్ ల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివస్తారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేయాలి. కానీ ఈ ఏడాది ప్రభుత్వం లైట్ తీసుకుంది. దీంతో భక్తులు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. అసలే ఎండ.. ఆపై తాగునీరు కూడా లేకపోవడంతో భక్తులు ఆపసోపాలు పడ్డారు. కానీ దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాత్రం అన్నీ సవ్యంగా జరిగినట్టు చెప్పుకొచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చందనోత్సవం జరిపినట్టు సమర్థించుకున్నారు. దీనిపై అన్నివర్గాల నుంచి విమర్శలు రావడంతో ఇప్పుడు విచారణకు ఆదేశించారు.
ట్రస్ట్ సభ్యుల పెదవివిరుపు..
ప్రస్తుతం జేసీ విశ్వనాథన్ విచారణ చేపడుతున్నారు. చందనోత్సవం నాడు జారీ చేసిన టిక్కెట్లు, ఏర్పాట్లు,ఇతరత్రా అంశాలపై ఆరాతీస్తున్నారు. అయితే దీనిపై ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టిక్కెట్ల జారీ నుంచి ఏర్పాట్ల వరకూ అంతా జిల్లా యంత్రాంగమే చూసిందని.. అటువంటప్పుడు జిల్లా అధికారులను ఎలావిచారణకు నియమిస్తారని ప్రశ్నించారు. గతంలో కూడా ఇటువంటి విచారణలు ఎన్నో చూశామని.. బుట్టదాఖలు చేశారని గుర్తుచేస్తున్నారు. గత ఏడాది నిజరూప దర్శనం దృశ్యాలు బయటకు రావడంతో దర్యాప్తు చేశారని.. కానీ దానినివేదిక ఇంత వరకూ బహిర్గతం చేయలేదని చెప్పుకొస్తున్నారు. మొత్తానికైతే విచారణకు ఆదేశించడం ద్వారా చందనోత్సవంలో వైఫల్యాలు జరిగాయని ప్రభుత్వం ఒప్పుకున్నట్టయ్యిందని విశ్లేషకులు చెబుతున్నారు.