New Liquer Policy : రాష్ట్రంలో మద్యం దుకాణాల ఏర్పాటుకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మరి కొద్ది గంటల్లోనే ముగియనుంది. ఆఫ్లైన్ కు సంబంధించి ఎక్సైజ్ కార్యాలయాల్లో క్యూ లైన్ లో ఉండే వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏడు గంటల వరకు గడువు విధించగా.. అప్పటివరకు క్యూ లైన్ లో ఉన్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆన్లైన్లో సంబంధించి ఏడు గంటల వరకు దరఖాస్తు చేసే అవకాశం ఉంది.అయితే అందుకు సంబంధించి దరఖాస్తు రుసుము మాత్రం రాత్రి 12 గంటల లోగా చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు డిడి కానీ ..నిర్దేశించిన విధానంలో కానీ.. రుసుము చేరే విధంగా చర్యలు తీసుకోవాలి. లేకుంటే మాత్రం ఆ దరఖాస్తు చెల్లుబాటు అయ్యే అవకాశం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 3396 మద్యం దుకాణాలకు సంబంధించి ప్రభుత్వ నోటిఫై చేసింది. ఈనెల ఒకటి నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. 9వ తేదీ వరకు గడువు విధించింది. రాష్ట్రవ్యాప్తంగా లక్ష దరఖాస్తులు వస్తాయని అంచనా వేసింది. కానీ ఆ స్థాయిలో ఆదరణ కనిపించకపోయేసరికి ప్రభుత్వం కంగారు పడింది. మరో రెండు రోజులపాటు గడువు పెంచింది. ఆ గడువు ఈ సాయంత్రంతో ముగియనుంది. చివరి నిమిషంలో దరఖాస్తులు చేసుకునేందుకు వేలాది మంది సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రభుత్వం అంచనా వేసిన విధంగా.. దరఖాస్తు రుసుము రూపంలో రెండు వేల కోట్లు వచ్చే అవకాశం కనిపించడం లేదు. కానీ 1500 కోట్ల ఆదాయం సమకూరడం ఖాయంగా తేలుతోంది. దీనిపై మరికొద్ది గంటల్లో క్లారిటీ రానుంది.
* మద్యం పాలసీ ఆలస్యం
వాస్తవానికి సెప్టెంబర్ 31 తో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం విధానం ముగిసింది. అక్టోబర్ 1న కొత్త మద్యం పాలసీ తప్పకుండా అందుబాటులోకి తేవాలి. అంటే సెప్టెంబర్ చివరి వారంలోనే ఈ దరఖాస్తు ప్రక్రియ ముగియాలి. కానీ అలాకాకుండా కూటమి ప్రభుత్వం అక్టోబర్ 1 నుంచి ఈ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఈనెల 12 నుంచి షాపులు ప్రారంభించాలని నిర్ణయించింది. అయితే మారిన షెడ్యూల్ కారణంగా ఈనెల 16 నుంచి కొత్త షాపులు తెరిపించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది.అయితే దరఖాస్తులు భారీ స్థాయిలో రాకపోవడానికి కూటమి పార్టీల ఎమ్మెల్యేలు కారణమన్న ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో సీఎం చంద్రబాబు సీరియస్ కావడంతో వెనక్కి తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే దరఖాస్తుల సంఖ్య పెరిగినట్లు సమాచారం.
* 15 వేల కోట్ల ఆదాయం?
ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు రాష్ట్రవ్యాప్తంగా 3396 షాపులకు గాను.. 65424 దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు దరఖాస్తు రుసుము రూపంలో ప్రభుత్వానికి రూ. 1308 కోట్లు సమకూరినట్లు సమాచారం. చివరిగా మరో రెండు గంటలపాటు సమయం ఉంది. చివరి నిమిషంలో వేలాదిగా దరఖాస్తులు నమోదవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలా ఎలా చూసినా 1500 కోట్ల రూపాయల ఆదాయం దరఖాస్తుల రుసుమ రూపంలో సమకూరడం ఖాయంగా తేలుతోంది. ఆఫ్ లైన్ తో పాటు ఆన్లైన్ వెసులుబాటు ఉండడంతో దరఖాస్తులు సంఖ్య పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈసారి మునుపెన్నడూ లేని విధంగా.. మద్యం వ్యాపారంతో అస్సలు సంబంధం లేని వ్యక్తులు దరఖాస్తులు చేయడం విశేషం.