Pawan Kalyan: విజయవాడలో వరదల వేళ ప్రభుత్వమంతా మొహరించింది. సీఎం చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్లో బస చేశారు. వరద బాధిత ప్రాంతాలను కలియతిరిగారు.పగలూ రాత్రి అని చూడలేదు. తెల్లవారుజామున బాధితులను పరామర్శించిన సందర్భాలు ఉన్నాయి. ఒక్క విజయవాడ కాదు రాష్ట్రవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అధికారులతో సమీక్షలు సైతం జరిపారు. క్షణం తీరిక లేకుండా గడిపారు. మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ప్రాంతాలకు ఒకరు చొప్పున సహాయ చర్యలను పర్యవేక్షించారు. అయితే ఇంతటి విపత్తు సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనిపించకపోవడం పై విమర్శలు వచ్చాయి. వైసీపీ నేతలు సైతం పవన్ ను టార్గెట్ చేసుకున్నారు. అసలు పవన్ రాష్ట్రంలో ఉన్నారా? విదేశాలకు వెళ్లిపోయారా? అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో సైతం పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. పవన్ మంగళగిరిలో ఉంటే కచ్చితంగా స్పందించేవారని.. ఆయన విదేశాలకు వెళ్లిపోవడం వల్లే వరద సహాయ చర్యల్లో పాల్గొనలేదని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. మాజీ మంత్రి రోజా అయితే ఏకంగా పవన్ ఎక్కడికి వెళ్లారని నిలదీసినంత పని చేశారు. ప్రజలు కష్టాల్లో ఉంటే మంత్రులు విహారయాత్రలో గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. పవన్ వరద సహాయ చర్యల్లో పాల్గొనక పోవడంపై ముప్పేట విమర్శలు వచ్చాయి. ఈ తరుణంలో పవన్ స్పందించారు. సహాయ చర్యలకు ఎందుకు వెళ్లలేదో ప్రకటించారు.
* కోటి రూపాయల విరాళం
మరోవైపు వరద బాధితులకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే హీరోలు, నిర్మాతలు స్పందించి సాయం ప్రకటిస్తున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కోటి రూపాయల విరాళం ప్రకటించారు. దీనిని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ కమిషనర్ కార్యాలయం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని పరిశీలించారు పవన్. అక్కడ నుంచే ఈ ప్రకటన చేశారు. విజయవాడలో వరద పరిస్థితిపై రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా, ఇతర ఉన్నత అధికారులతోపవన్ సమీక్ష జరిపారు.
* ఇబ్బందికరంగా మారుతుందనే
విజయవాడ ప్రజలు మహా విపత్తును ఎదుర్కొన్నారని పవన్ కళ్యాణ్ అభివర్ణించారు. తనకు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఉందని.. కానీ ధైర్యం చెప్పడానికి తాను వెళ్లినప్పుడు జనం మీద పెడితే అసలు ఉద్దేశమే దెబ్బతింటుందన్నారు. ఇది ప్రకృతి విపత్తు అని.. ప్రభుత్వం వచ్చిన మూడు నెలలకే ఈ విపత్తు దురదృష్టకరమని తెలిపారు. ఇది ముమ్మాటికీ గత ప్రభుత్వం నిర్లక్ష్యమేనని ఆరోపించారు. బుడమేరుకు సంబంధించి నిర్వహణ పనులను గత ప్రభుత్వం చేయలేదన్నారు. అన్ని ప్రాంతాల్లో వర్షాలు ముంపునకు కారణమయ్యాయని వివరించారు. వరద తగ్గగానే మరోసారి ఇటువంటివి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామని చెప్పారు.
* నిరంతరం సహాయ చర్యలు
వరద బాధితుల కోసం 262 ప్రత్యేక టీమ్లు ఏర్పాటు చేసినట్లు పవన్ వెల్లడించారు. 176 పునరావాస కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో అందరం సహాయ కార్యక్రమాల్లో పనిచేస్తున్నామని.. 72 గంటల పాటు నిద్రాహారాలు లేకుండా యంత్రాంగం చేస్తున్న కృషిని వివరించారు. విపత్తు తలెత్తగానే ప్రభుత్వమే సత్వరంగా స్పందించి పనిచేసిన విషయాన్ని పవన్ గుర్తు చేశారు. వరద సహాయ చర్యలకు తాను ఆటంకం కాకూడదని భావించి వెళ్లలేదని.. దీనిపై దుష్ప్రచారం జరుగుతున్న దృష్ట్యా తాను స్పందించాల్సి వచ్చిందని పవన్ చెప్పుకొచ్చారు. పవన్ ఫుల్ క్లారిటీ ఇవ్వడంతో జనసైనికులు వైసీపీకి కౌంటర్ ఇవ్వడం ప్రారంభించారు.